భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా గుర్‌ప్రీత్‌

సునీల్‌ ఛెత్రి రిటైర్మెంట్‌ నేపథ్యంలో భారత ఫుట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌గా గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు ఎంపికయ్యాడు. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌కు గురువారం కువైట్‌తో మ్యాచ్‌తో ఛెత్రి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Published : 10 Jun 2024 04:18 IST

దోహా: సునీల్‌ ఛెత్రి రిటైర్మెంట్‌ నేపథ్యంలో భారత ఫుట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌గా గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు ఎంపికయ్యాడు. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌కు గురువారం కువైట్‌తో మ్యాచ్‌తో ఛెత్రి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భారత సారథి కూడా అయిన ఛెత్రి నిష్క్రమణతో ఇప్పుడు ఖతార్‌తో మ్యాచ్‌కు ఆ బాధ్యతలను గోల్‌కీపరైన గుర్‌ప్రీత్‌కు అప్పగించారు. ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం ఖతార్‌తో భారత్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మొదటి సారి మూడో రౌండ్‌కు అర్హత సాధించే అవకాశముంది. 32 ఏళ్ల గుర్‌ప్రీత్‌ గతంలో ఛెత్రి గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. అతను ఇప్పటివరకూ 71 మ్యాచ్‌లాడాడు.  


బ్రిటన్‌ చేతిలో భారత్‌ ఓటమి

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ 

లండన్‌: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భారత జట్టు ఆదివారం 2-3తో గ్రేట్‌ బ్రిటన్‌ చేతిలో పరాజయంపాలైంది. ఫిల్‌ రోపర్‌ తొలి నిమిషంలోనే గోల్‌ కొట్టి బ్రిటన్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత  స్కోరు సమం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించిన భారత్‌ 19వ నిమిషంలో విజయవంతమైంది. సుఖ్‌జీత్‌ సింగ్‌ గోల్‌ అందించాడు. విరామానికి జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 36వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సద్వినియోం చేశాడు. వెంటనే జాక్‌ వాలర్‌ చేసిన గోల్‌తో బ్రిటన్‌ 2-2తో స్కోరు సమం చేసింది. 50 నిమిషంలో అలన్‌ గోల్‌తో ఆ జట్టు 3-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు మహిళల ప్రొ లీగ్‌లో భారత మహిళల జట్టు ఓటమితో ముగించింది. ఆదివారం చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2-3తో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం చవిచూసింది.


ఒమన్‌పై స్కాట్లాండ్‌ విజయం 

బ్రిడ్జ్‌టౌన్‌: టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-బి మ్యాచ్‌లో ఒమన్‌పై స్కాట్లాండ్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట ఒమన్‌ 7 వికెట్లకు 150 పరుగులు చేసింది. లక్ష్యాన్ని స్కాట్లాండ్‌ 13.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. మెక్‌ములెన్‌ (61 నాటౌట్‌) జట్టును గెలిపించాడు.


ఒలింపిక్స్‌కు నగాల్‌ అర్హత!

హెయిల్‌బ్రోన్‌: భారత అగ్రశ్రేణి సింగిల్స్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌..హెయిల్‌బ్రోన్‌ నెకర్‌కప్‌ ఏటీపీ ఛాలెంజర్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో అతడు 6-1, 6-7 (5-7), 6-3తో అలెగ్జాండర్‌ రిచర్డ్‌ (స్విట్జర్లాండ్‌)పై విజయం సాధించాడు. ఈ విజయంతో నగాల్‌ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-80లో అడుగుపెట్టనున్నాడు. దీంతో పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆడేందుకు అతడికి అర్హత లభిస్తుంది. సోమవారం ప్రకటన రానుంది.


గేల్‌ ప్రత్యేకంగా

మ్యాచ్‌ కోసం వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ వేసుకున్న కోటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు దేశాల మధ్య స్నేహాన్ని చాటేలా ఓ వైపు భారత్, మరోవైపు పాకిస్థాన్‌ జాతీయ జెండా రంగులతో కూడిన కోటును గేల్‌ ధరించాడు. అంతేకాకుండా దీనిపై కోహ్లి, పంత్, రోహిత్, బాబర్‌ అజామ్‌ తదితర ఆటగాళ్ల సంతకాలనూ తీసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని