Team India: ఈ పేస్‌ సరిపోతుందా..?

Eenadu icon
By Sports News Desk Updated : 18 Feb 2025 04:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

రేపటి నుంచే ఛాంపియన్స్‌ ట్రోఫీ! ఫేవరెట్‌ జట్లలో టీమ్‌ఇండియా కూడా ఒకటి. బ్యాటర్ల సూపర్‌ ఫామ్‌ ఉత్సాహాన్నిస్తోంది. కానీ బౌలింగ్‌ సంగతేంటి? ముఖ్యంగా పేస్‌ బౌలింగ్‌ సత్తా చాటగలదా? సూపర్‌స్టార్‌ బుమ్రా దూరం కావడం టీమ్‌ఇండియా అవకాశాలకు పెద్ద ఎదురుదెబ్బే. కానీ షమి పునరాగమనం ఆశలు రేపుతోంది. మరి బుమ్రా లోటును అతడు పూడ్చగలడా? షమి సారథ్యంలో పేస్‌ విభాగం భారత్‌ను పైచేయిలో నిలుపుతుందా?

దుబాయ్‌ సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయడంతో మంచి అంచనాలతోనే ఛాంపియన్స్‌ ట్రోఫీకి సిద్ధమైంది టీమ్‌ఇండియా. బ్యాటింగ్‌ బలంగా ఉన్న నేపథ్యంలో.. బౌలర్లు ఏం చేస్తారన్నది ఆసక్తికరం. స్పిన్‌ వనరులు పుష్కలంగానే ఉన్నాయి. అయితే టోర్నీలో భారత్‌ భవితవ్యాన్ని నిర్ణయించేది పేస్‌ బౌలింగే అనడంలో సందేహం లేదు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న పేస్‌ దళపతి బుమ్రా అందుబాటులో లేకపోవడం నిస్సందేహంగా భారత్‌కు ప్రతికూలాంశమే. ఎలాంటి స్థితిలోనైనా ఆటను మలుపు తిప్పి, ఒంటి చేత్తో జట్టుకు విజయాలనందించగల సత్తా బుమ్రా సొంతం. ఆరంభంలోనైనా, మిడిల్‌ ఓవర్లలోనైనా, ఆఖర్లోనైనా బ్యాటర్లకు కళ్లెం వేయగల అతడి సామర్థ్యం జట్టుకు గొప్ప బలం. కానీ ఇప్పుడు భారత్‌కు ఈ బలం లేదు. అయితే సరైన సమయానికి షమి అందుబాటులోకి రావడం జట్టుకు ఊరట. ఇంగ్లాండ్‌తో సిరీస్‌తో తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అతడు.. బుమ్రా గైర్హాజరీలో ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియాకు పేస్‌ దాడికి నాయకత్వం వహించనున్నాడు.

సిద్ధంగా ఉన్నాడా..?

షమి తక్కువ వాడేమీ కాదు. అతడి రాక కచ్చితంగా జట్టు విశ్వాసాన్ని పెంచే విషయమే. గాయానికి ముందు పదునైన పేస్‌తో ఎన్నో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో తన ప్రదర్శనను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. అతను మణికట్టును అద్భుతంగా ఉపయోగిస్తూ ఎంతటి మేటి బ్యాటర్‌నైనా బోల్తాకొట్టించగలడు. అయితే మరోసారి బంతితో సత్తా చాటి, 12 ఏళ్ల విరామం తర్వాత టీమ్‌ఇండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించడంలో షమి కీలక పాత్ర పోషిస్తాడా అన్నదే ప్రశ్న! కోట్లాది అభిమానుల అంచనాల భారం ఇప్పుడు అతడిపై ఉంది. దీన్ని తట్టుకుని రాణించడం అతడికి సవాలే. షమి సత్తాపై సందేహాలు లేకున్నా.. అతడి ఫిట్‌నెస్‌పై మాత్రం ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు అతడు సంసిద్ధమయ్యాడా అన్నదే ప్రశ్న! గాయంతో ఆటకు దూరమై, దాదాపు ఏడాది విరామం తర్వాత పునరాగమనం చేసిన షమి, కొన్ని మ్యాచ్‌లు ఆడినా.. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆసాంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడగలడా అన్న అనుమానం జట్టును, అభిమానులను వెంటాడుతూనే ఉంది. ఎక్కువ ఒత్తిడి ఉండే ఐసీసీ ఈవెంట్లో రాణించడం భిన్నమైన అంశం. బుమ్రా లేకపోవడం కూడా షమిపై  ప్రభావం చూపవచ్చు. అతడు చాలా ఏళ్ల పాటు బుమ్రాతో కలిసి అద్భుత ఫలితాలు రాబట్టాడు. అతడితో కలిసే అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌లను సైతం హడలెత్తించాడు. ఇప్పుడేమో ఒక సీనియర్‌గా ఎక్కువ భారం అతడే మోయాల్సివుంది. అర్ష్‌దీప్‌ ప్రతిభావంతుడే కానీ.. బుమ్రా స్థాయి వేరు. అయితే మాజీ ఫాస్ట్‌బౌలర్‌ బాలాజి మాత్రం షమిని సందేహించాల్సిన అవసరం లేదని అంటున్నాడు. ‘‘నిజానికి షమి.. 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లలో బుమ్రా కన్నా మెరుగ్గా బౌలింగ్‌ చేశాడు. అన్ని ఫార్మాట్లలో బుమ్రా ఛాంపియన్‌ బౌలర్‌. కానీ షమికి అనుభవం ఉంది. బుమ్రా రాకకు ముందు భారత్‌ దాడిని నడిపించింది అతడే’’ అని అన్నాడు. షమి ఎలా రాణిస్తాడన్న దానిపైనే టోర్నీలో ప్రత్యర్థులను టీమ్‌ఇండియా ఎలా కట్టడి చేస్తుంది అన్నది ఆధారపడి ఉంది. ముఖ్యంగా కొత్త బంతితో అతడు వికెట్లు తీయడం చాలా అవసరం. తొలి ఆరు ఓవర్లలో అతడు చూపే ప్రభావం భారత్‌కు కీలకమని బాలాజి అన్నాడు. దుబాయ్‌లో పిచ్‌లు సీమర్లకు  కాస్త సహకరించనుండడం షమికి కలిసొచ్చే విషయమే. స్టంప్స్‌ను ఎటాక్‌ చేసే అతడి సామర్థ్యం వికెట్ల వేటలో ఉపయోగపడుతుంది. చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న షమి.. లయను అందుకుంటే భారత్‌కు తిరుగుండదు. ఎంత త్వరగా అతడు ఆ పని చేస్తాడన్నదే కీలకం. 

మిగతా వాళ్లు?

షమి ఉన్నా.. అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తిగా సందేహాలు తొలగని నేపథ్యంలో ప్రస్తుతానికి భారత్‌కు పేస్‌ బౌలింగ్‌ అంతగా ధీమానివ్వట్లేదన్నది వాస్తవం. అర్ష్‌దీప్‌ సింగ్, హర్షిత్‌ రాణాలకు పెద్దగా వన్డే అనుభవం లేదు. అర్ష్‌దీప్‌ కేవలం 9 వన్డేలే ఆడగా.. రాణా (ఇంగ్లాండ్‌తో సిరీస్‌) మూడే ఆడాడు. బుమ్రాకు షమి మద్దతిచ్చినట్లు.. వీళ్లు షమికి మద్దతివ్వగలరా అన్నది ప్రశ్న. అనుభవం లేని రాణా.. ఇంగ్లాండ్‌పై ఎక్కువ పరుగులే ఇచ్చాడు. షార్ట్‌గా, వికెట్లకు దూరంగా బంతులేసి మూల్యం చెల్లించుకున్నాడు. అయితే పాత బంతితో బాగానే బౌలింగ్‌ చేశాడు. ఇక టీ20ల్లో స్థిరపడ్డ అర్ష్‌దీప్‌ ఇప్పుడిప్పుడే వన్డేల్లో అడుగులేస్తున్నాడు. అయితే అతడు ఎడమచేతి వాటం బౌలర్‌ కావడం కీలకాంశం. వన్డే అనుభవం లేకున్నా.. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగల అతడి నైపుణ్యం, వికెట్లు తీయగల సామర్థ్యం కలిసొస్తాయని భారత జట్టు భావిస్తోంది. అతడు కుదురుకుంటే ఛాంపియన్స్‌ ట్రోఫీలో జట్టుకు పెద్ద బలమే అవుతాడు. ఇక ఆల్‌రౌండరే అయినా.. ఫిట్‌నెస్‌ లేమి కారణంగా గత కొన్నేళ్లలో పెద్దగా బౌలింగ్‌ చేయని హార్దిక్‌ ఇటీవల రెగ్యులర్‌గానే వేస్తున్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఎంత మేర ప్రభావం చూపుతాడో చూడాలి. 

మాయగాళ్లు రెడీ..

ఛాంపియన్స్‌ ట్రోఫీలో వైవిధ్యమైన స్పిన్‌ భారత్‌కు పెద్ద బలం. ఈ టోర్నీ కోసం ఏకంగా అయిదుగురు స్పిన్నర్లు.. జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌లను తీసుకుంది టీమ్‌ఇండియా. ఇంగ్లాండ్‌తో వైట్‌బాల్‌ సిరీస్‌లో విశేషంగా రాణించిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. మిడిల్‌ ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టడం, పరుగుల కోసం బ్యాటర్లను చెమటోడ్చేలా చేయడమే అతడికి జట్టులో స్థానాన్ని తెచ్చిపెట్టింది. దుబాయ్‌లోనూ ఈ లెగ్‌స్పిన్నర్‌ సత్తా చాటుతాడని జట్టు ఆశిస్తోంది. ఇక చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక సమయాల్లో వికెట్లు తీయగలడు. ఎడమచేతి వాటం స్పిన్నర్లు జడేజా, అక్షర్‌ పటేల్‌లు పిచ్‌ ఏమాత్రం సహకరించినా ప్రత్యర్థికి ఉచ్చుబిగిస్తారు. పరుగుల వేగానికి కళ్లెం వేస్తారు. ఆఫ్‌స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఇటీవల కాలంలో బాగా రాణించాడు. తుది జట్టులో ఎవరెవరున్నా ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలే. వీరి మాయాజాలానికి నిలిచి పరుగులు చేయడం తేలిక కాదు. దాదాపుగా స్పిన్నర్లంతా ఫామ్‌లోనే ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశమే. టోర్నీలో వీరి పాత్ర చాలా కీలకం కాబోతోంది.

Tags :
Published : 18 Feb 2025 03:04 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు