సంక్షిప్త వార్తలు (5)

Eenadu icon
By Sports News Desk Published : 02 Nov 2025 01:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వినూమన్కడ్‌ ట్రోఫీ హైదరాబాద్‌దే

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అండర్‌-19 క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. సమష్టి ప్రదర్శనతో వినూ మన్కడ్‌ ట్రోఫీలో విజేతగా నిలిచింది. రాజ్‌కోట్‌లో జరిగిన ఫైనల్లో పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 28.2 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ఆర్యన్‌ (29), విహాన్‌ (28) మాత్రమే రాణించారు. యశ్‌వీర్‌ (3/22), మాలిక్‌ (2/21), నిపుణ్‌ రెడ్డి (2/24), యుజైర్‌ అహ్మద్‌ (2/25) ప్రత్యర్థిని కట్టడి చేశారు. బదులుగా హైదరాబాద్‌ 29.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అలంకృత్‌ (58 నాటౌట్‌), అవేజ్‌ అహ్మద్‌ (35 నాటౌట్‌) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. పంజాబ్‌ జట్టులో ఇషాన్‌ సూద్‌ (5/18) సత్తా చాటాడు. విజేత జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ.2 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.లక్షా 50 వేలు చొప్పున నజరానా ఇవ్వనున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. 


దివ్యకు షాక్‌ 

పంజిమ్‌: చెస్‌ ప్రపంచకప్‌లో భారత స్టార్‌ ప్లేయర్‌ దివ్య దేశ్‌ముఖ్‌కు షాక్‌! ఈ టోర్నీలో వైల్డ్‌కార్డుతో ఆడుతున్న ఈ మహిళల ప్రపంచకప్‌ విజేత తొలి రౌండ్లో సత్తా చాటలేకపోయింది. శనివారం స్టామటిస్‌ (గ్రీస్‌)తో పోరులో ఆమె ఓడిపోయింది. రెండో గేమ్‌లో గెలవకపోతే దివ్య ఇంటిముఖం పడుతుంది. గెలిస్తే.. గేమ్‌ టైబ్రేకర్‌కు వెళుతుంది. గ్రాండ్‌మాస్టర్‌ లలిత్‌ బాబు డ్రాతో మొదలుపెట్టాడు. తొలి రౌండ్‌ తొలి గేమ్‌లో మ్యాక్స్‌ వార్‌మెర్‌డామ్‌ (నెదర్లాండ్స్‌)తో అతడు పాయింట్‌ పంచుకున్నాడు. మరో తెలుగుతేజం రాజా రిత్విక్‌.. కజాబెక్‌ (కజకిస్థాన్‌)తో డ్రా చేసుకున్నాడు. దీప్తాయన్, ల్యూక్‌ మెండోంకా, రౌనక్‌ సద్వాని, ఎస్‌ఎల్‌ నారాయణన్, కార్తీక్‌ వెంకటరామన్‌ గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి. 


హిమాచల్‌ 293/7 

నదౌన్‌: హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ ఎలైట్‌ ‘డి’ మ్యాచ్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి రోజు, శనివారం ఆట చివరికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 293 పరుగులు చేసింది. ఆకాశ్‌ వశిష్ట్‌ (114 బ్యాటింగ్‌; 156 బంతుల్లో 16×4, 1×6) అజేయ సెంచరీ సాధించాడు. సిద్ధాంత్‌ (37), మయాంక్‌ దాగర్‌ (36), అంకుశ్‌ (30), పక్రాజ్‌ మాన్‌ (30) కూడా రాణించారు. ఒక దశలో హిమాచల్‌ 115 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. ఆకాశ్‌ నిలవడంతో కోలుకుంది. హైదరాబాద్‌ బౌలర్లలో రోహిత్‌ రాయుడు మూడు, తనయ్‌ త్యాగరాజన్‌ 2 వికెట్లు తీయగా.. మిలింద్, నిశాంత్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 


హైదరాబాద్‌కు మెస్సి 

కోల్‌కతా: తెలుగు ఫుట్‌బాల్‌ అభిమానులకు శుభవార్త. భారత్‌లో గోట్‌ టూర్‌ సందర్భంగా అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సి హైదరాబాద్‌ కూడా రానున్నాడు. కేరళలో ప్రతిపాదిత అర్జెంటీనా స్నేహపూర్వక మ్యాచ్‌ రద్దు కావడంతో నిర్వాహకులు మెస్సి బృందాన్ని హైదరాబాద్‌ తీసుకురావాలని నిర్ణయించారు. డిసెంబరులో గోట్‌ టూర్‌లో భాగంగా మెస్సి బృందం కోల్‌కతా, హైదరాబాద్, దిల్లీ, ముంబయి నగరాలను సందర్శిస్తుంది. డిసెంబరు 13న హైదరాబాద్‌ వస్తుంది. 


కరుణ్‌ అజేయ శతకం

మంగళాపురం: భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన కరుణ్‌ నాయర్‌ (142 బ్యాటింగ్‌; 251 బంతుల్లో 14×4, 2×6).. రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు. కేరళతో ఎలైట్‌ గ్రూప్‌-బి మ్యాచ్‌లో ఆ జట్టు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 319 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (65) రాణించాడు. ఆట చివరికి కరుణ్‌తో పాటు రవిచంద్రన్‌ స్మరణ్‌ (88 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు