Glenn Maxwell: జోడీ ఇలా కూడా ఉంటుందా.. మ్యాక్స్‌ బాదేశాడు.. కమిన్స్‌ అడ్డేశాడు..!

అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేయాలంటే ఇద్దరు బ్యాటర్లు దూకుడుగా ఆడాల్సిన అవసరం లేదని మ్యాక్సీ-కమిన్స్‌ జోడీ నిరూపించింది. ఒకరు క్రీజులో పాతుకు పోయి వికెట్లను కాపాడితే.. మరొకరు ఒత్తిడి నుంచి బయటపడి ప్రత్యర్థి బౌలింగ్‌ను కకావికలం చేయొచ్చని నిరూపించారు.

Updated : 08 Nov 2023 11:07 IST

ఇంటర్నెట్‌డెస్క్: స్టార్క్‌ రూపంలో ఆసీస్‌ ఏడో వికెట్‌ పడ్డాక సంబరాల్లో మునిగిపోయిన అఫ్గాన్‌ ఓ విషయం గుర్తించలేదు.. ఇదే టోర్నీలో నెదర్లాండ్స్ మీద మ్యాచ్‌లో కూడా మ్యాక్స్‌వెల్‌తో కలిసి కమిన్స్‌ లోయర్‌ ఆర్డర్‌లో 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ భాగస్వామ్యంలో కమిన్స్‌ కేవలం 7 పరుగులే చేశాడు.. మిగిలిన విధ్వంసకాండలో మ్యాక్స్‌వెల్‌వి 91 పరుగులు ఉన్నాయి. అంటే 88.35 శాతం పరుగులు మ్యాక్సీ.. 7.77 శాతం రన్స్‌ కమిన్స్‌ నుంచి లభించాయన్నమాట. ఓ భాగస్వామ్యంలో బ్యాటర్ల పరుగుల నిష్పత్తి మధ్య ఇంత భారీ తేడా ఉండటం ఓ రికార్డు.  మరోసారి ఈ రికార్డు నిన్న బద్దలైంది.

కలయా మ్యాక్సీ మాయా

ఆఫ్గానిస్థాన్‌ మీద జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ క్రీజులోకి వచ్చే సమయానికి మ్యాక్సీ 22 పరుగుల వద్ద ఉన్నాడు. ముజీబ్‌ ఇచ్చిన జీవనదానంతో రెచ్చిపోయాడు. స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. వీలైనంత వరకు స్ట్రైక్‌ను తానే తీసుకొని కమిన్స్‌ను నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌కే పరిమితం చేశాడు. కొన్ని సందర్భాల్లో తప్పని సరిపరిస్థితుల్లో కమిన్స్‌ బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చినా.. అతడు బంతులను అడ్డుకుని మెయిడిన్‌ చేయడానికి కూడా వెనుకాడలేదు. మ్యాచ్‌ మొత్తంలో కమిన్స్‌ 68 బంతులు (11 ఓవర్లకు పైగా) ఎదుర్కొని కేవలం 12 పరుగులే చేశాడు. కెప్టెన్‌ వృథా చేసిన బంతుల మూల్యాన్ని అఫ్గానీల నుంచి మ్యాక్స్‌వెల్‌ వసూలు చేశాడు. ఫలితంగా 128 బంతుల్లోనే 201 పరుగలు చేశాడు. వీరిద్దరి 202 పరుగుల భాగస్వామ్యంలో.. కమిన్స్‌  పరుగుల శాతం 5.94. ఇక మ్యాక్స్‌ వాటా (179పరుగులు) 88.6 శాతం. మిగిలినవి ఎక్స్‌ట్రాల రూపంలో లభించాయి. అతి తక్కువ శాతం పరుగుల భాగస్వామిగా కమిన్స్‌ రికార్డు సృష్టించాడు.

  • 1983 ప్రపంచకప్‌లో కపిల్‌-కిర్మానీలు జింబాబ్వేపై 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీనిలో కపిల్‌ వాటా 98 పరుగులతో 77.78 శాతంగా ఉంది. ఇక కిర్మానీ వాటా 24 పరుగులతో 19.05 శాతం.
  • 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వే బ్యాటర్లు టేలర్‌-ఎర్విన్‌లు భారత్‌పై 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీనిలో టేలర్‌ వాటా 84 పరుగులతో 77.06 శాతం. ఇక ఎర్విన్‌ 22 పరుగులతో 20.18 శాతం వాటాగా ఉంది.
  • 2015 ప్రపంచకప్‌లో మెక్‌ కల్లమ్‌-గప్తిల్‌లు ఇంగ్లాండ్‌పై 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీనిలో మెక్‌కల్లం వాటా 77 పరుగులతో 73.33 శాతం కాగా.. ఇక గప్తిల్‌ వాటా 22 పరుగులతో 20.95 శాతం.

రికార్డుల వరద..

  • మ్యాక్స్‌వెల్‌ సాధించిన 201 పరుగులే వన్డేల్లో ఆసీస్‌ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు.
  • ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన వారిలో మ్యాక్స్ (43) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ద్వితీయ స్థానం మన రోహిత్‌దే.
  • లక్ష్యసాధనలో వన్డేల చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ మ్యాక్స్‌ (201) పేరిట నమోదైంది. ఈ జాబితాలో మన ధోనీ (183*), కోహ్లీ (183) నాలుగో స్థానంలో ఉన్నారు.
  • ప్రపంచకప్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో  మ్యాక్స్‌ చేసిన 201 పరుగులు మూడో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో మన గంగూలీ (183) ఐదో స్థానంలో ఉన్నాడు.
  • వన్డేల్లో ఓపెనర్‌గా కాకుండా బరిలోకి దిగి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్‌ నిలిచాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు