Glenn Maxwell: నొప్పితోనే మ్యాక్సీ ఆట.. ‘బై రన్నర్‌’పై చర్చ.. ఐసీసీ రూల్స్‌ ఏంటంటే..?

కండరాలుపట్టేడయంతో ఓవైపు కాళ్ల నొప్పితో బాధపడినా.. మరొక స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ లేకపోవడంతో మ్యాక్స్‌వెల్ (Maxwell) క్రీజ్‌ను వదిలి రాకుండా అఫ్గాన్‌పై కీలక ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాను గెలిపించాడు.

Updated : 08 Nov 2023 13:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై వీరోచిత డబుల్‌ సెంచరీతో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (201*) ఆస్ట్రేలియాను సెమీస్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. సెంచరీ చేసిన తర్వాత నుంచి కాలు కండరాలుపట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఇక తన వ్యక్తిగత స్కోరు 150 పరుగుల మైలురాయిని చేరుకున్న తర్వాత మ్యాక్స్‌వెల్ (Maxwell) ఒకానొక దశలో నొప్పితో విలవిల్లాడిపోయాడు. అప్పటి నుంచి సింగిల్స్‌పై కాకుండా బౌండరీలు బాదేస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఫిజయోతో చికిత్స చేయించుకుని మరీ చివరి వరకూ క్రీజ్‌లో పాతుకుపోయి జట్టును గెలిపించాడు. ఇలాంటి సమయంలో ఆ మ్యాచ్‌ను చూసిన పలువురికి వచ్చే అనుమానం.. బైరన్నర్‌ను పెట్టుకోవచ్చు కదా అని. అయితే దీనిపై ఐసీసీ నిబంధనలు ఎలా ఉన్నాయంటే..

జోడీ ఇలా కూడా ఉంటుందా.. మ్యాక్స్‌ బాదేశాడు.. కమిన్స్‌ అడ్డేశాడు..!

అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో గాయపడిన బ్యాటర్‌..  బైరన్నర్‌ను సాయంగా తీసుకొనే అవకాశం లేకుండా ఐసీసీ (ICC) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ 2011లోనే నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు ఇబ్బందిగా మారుతుందనే విజ్ఞప్తుల మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది. ఇదే విషయంపై మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (MCC) కూడా స్పష్టత ఇచ్చింది. బ్యాటింగ్‌ విభాగంలోని చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదని.. అంతర్జాతీయ మ్యాచుల్లో పరిస్థితులకు అనుగుణంగానే ఈ సవరణ చేసినట్లు ఎంసీసీ వెల్లడించింది. అయితే దేశవాళీ, ఇతర క్రికెట్‌ గేముల్లో మాత్రం యథావిధిగా బై-రన్నర్స్‌ను పెట్టుకొనే వెసులుబాటును కల్పించింది. దీంతో మ్యాక్స్‌వెల్ నొప్పితో బాధపడినా బైరన్నర్‌ సాయం లేకుండానే ఆడాల్సి వచ్చింది.

గావస్కర్ అప్పుడేమన్నాడంటే?

బ్యాటర్లకు రన్నర్లను అనుమతించకపోవడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) గతంలోనే విమర్శలు గుప్పించాడు. ఇది సరైన నిర్ణయం కాదంటూనే.. బౌలర్లకూ ఓ విషయంలో ఉన్న వెసులుబాటును అడ్డుకోవాలని సూచించాడు. ‘‘గాయపడిన బ్యాటర్లకు రన్నర్లకు అనుమతించకపోవడం సరైన నిర్ణయం కాదు. ఇలాంటి సమయంలో నేను కూడా ఓ విజ్ఞప్తి చేస్తున్నా. బౌలర్లకు బౌండరీ లైన్‌ వద్ద డ్రింకింగ్‌ వాటర్ అందుబాటులో ఉంచకూడదు. ఎందుకంటే వారు ఒక ఓవర్ వేసిన తర్వాత బౌండరీ లైన్‌ వద్దకు వచ్చేటప్పటికి వారి కోసం ఎనర్జీ డ్రింకులు సిద్ధంగా ఉంటున్నాయి. అలాగే నిర్ణీత డ్రింక్స్‌ బ్రేక్‌ల తర్వాత మళ్లీ మళ్లీ అలాంటివి గంట వరకు ఇవ్వకూడదు. ఫీల్డింగ్‌ చేస్తూ ఆటగాడు గాయపడటం లేదా కండరాలు పట్టేసి ఇబ్బంది పడితే వెంటనే సబ్‌స్టిట్యూట్‌ను అనుమతించకూడదు. అతడు మైదానంలోనే ఉండాలి లేదా వెలుపలికి వెళ్లిపోవాలి. అప్పుడు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ వైపు సమతూకంగా నిర్ణయాలు ఉన్నట్లు అవుతుంది’’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు.

మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌ నేపథ్యంలో బైరన్నర్‌ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. గావస్కర్‌ అప్పట్లో చేసిన కామెంట్లపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు