Glenn Maxwell: మ్యాక్సీ ఆడితే.. మైదానం ఊగదా.. మ్యాక్స్‌వెల్‌ ఆటే ప్రత్యేకం!

వరల్డ్ కప్‌లో (ODI World Cup 2023) కీలక సమయంలో ఆస్ట్రేలియా గేర్‌ మార్చింది. నెదర్లాండ్స్‌ను భారీ తేడాతో చిత్తు చేసి రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంది. దీని వెనుక డేవిడ్‌ వార్నర్‌ శతకంతోపాటు మరో చిచ్చరపిడుగు సెంచరీ కూడా తోడైంది.

Published : 26 Oct 2023 16:57 IST

ప్రపంచ క్రికెట్లోని ప్రమాదకర బ్యాటర్లలో అతడు ఉంటాడు. బౌలర్లపై కనికరం లేకుండా.. బంతిని నిర్దాక్షిణ్యంగా బాదే క్రికెటర్లలో అతనొకడు. అతడు అడుగుపెడితే క్రీజు కాస్తా నృత్య వేదికగా మారిపోతోంది! అతని కాళ్లు స్టెప్పులు వేస్తాయి! అతని బ్యాట్‌ వీరవిహారం చేసి.. పరుగుల వరద పారిస్తోంది! క్రికెట్లో ఎంతో మంది దిగ్గజాలున్నారు. స్టార్‌ బ్యాటర్లున్నారు. కళాత్మక ఆటతీరుతో అదరగొట్టే క్రికెటర్లున్నారు. కానీ తనకే సొంతమైన శైలితో.. అతనిలాగా బంతిని ఊచకోత కోస్తూ అభిమానులను అలరించే ఆటగాడు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ ఉపోద్ఘాతమంతా ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell) గురించే. ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై (AUS vs NED0 అతను విరుచుకుపడిన తీరు.. ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోయేదే! 

రికార్డులు బద్దలు..

నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లోనే సెంచరీ సాధించిన మ్యాక్స్‌వెల్‌ కొన్ని రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్‌ (ODI World Cup) చరిత్రలోనే ఇదే అత్యంత వేగవంతమైన శతకం. ఈ ప్రపంచకప్‌లోనే దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్‌ నమోదు చేసిన రికార్డు (49 బంతుల్లో)ను ఇప్పుడు మ్యాక్సీ తిరగరాశాడు. ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగంగా వన్డే శతకం చేసిన ఆటగాడిగానూ తన రికార్డు (2015 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 51 బంతుల్లో)ను తానే మెరుగుపర్చుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో డివిలియర్స్‌ (31 బంతుల్లో), కోరె అండర్సన్‌ (36), షాహిద్‌ అఫ్రిది (37) తర్వాత నాలుగో ఆటగాడిగా మ్యాక్సీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 39.1 ఓవర్లున్నప్పుడు మ్యాక్స్‌వెల్‌ క్రీజులో అడుగుపెట్టాడు. సుమారుగా మరో పది ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో అతను సెంచరీ చేస్తాడని ఎవరైనా ఊహించి ఉంటారా? కానీ ఊహకు అందితే అతను మ్యాక్స్‌వెల్‌ ఎందుకవుతాడు? నెదర్లాండ్స్‌ చిన్న జట్టే కావొచ్చు. పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేకపోవచ్చు. కానీ సామర్థ్యాల పరంగా, నైపుణ్యాల పరంగా ఆ జట్టులో మంచి ఆటగాళ్లున్నారు. ఈ ప్రపంచకప్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో సాగుతున్న దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్‌ ఓడించడమే దీనికి నిదర్శనం. కానీ మ్యాక్సీ ముందు ఆ జట్టు పూర్తిగా తేలిపోయింది. అతని పరుగుల తుపానులో కొట్టుకుపోయింది. చివరి పది ఓవర్లలో చెలరేగిన మ్యాక్సీ ఏకంగా 106 పరుగులు సాధించాడు. 27 బంతుల్లో 50 పరుగులు చేసిన అతను.. ఆ తర్వాత 13 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడంటే ఏ స్థాయిలో రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు. 

గాయాన్ని దాటి..

అసలు ఈ ప్రపంచకప్‌లో మ్యాక్సీ ఆడటంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. గాయాలే అందుకు కారణం. నిరుడు ఓ పార్టీ సందర్భంగా అనుకోకుండా అతని ఎడమ కాలు విరిగింది. దీని నుంచి కోలుకుని తిరిగి ఆటలో అడుగుపెట్టాడు. కానీ ప్రపంచకప్‌ నెల రోజులు ఉందనగా చీలమండ గాయం బారిన పడ్డాడు. దీంతో అతను ప్రపంచకప్‌లో ఆడేది అనుమానంగా మారింది. కానీ గాయం నుంచి కోలుకుని టోర్నీలో అడుగుపెట్టిన ఈ ఆల్‌రౌండర్‌గా స్పిన్నర్‌గానూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా జంపా ఒక్కడే ఉండటంతో మరోవైపు నుంచి మ్యాక్సీ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు. ఎంతోమంది బ్యాటర్లు క్రీజులోకి వస్తారు.. పరుగులు సాధిస్తారు.. సెంచరీలు చేస్తారు.. వెళ్లిపోతారు. కానీ మ్యాక్సీలాగా ఆటతీరుతో అలరించే బ్యాటర్లు అరుదనే చెప్పాలి. అతనికి బౌలర్‌ ఎవరన్నది అవసరం లేదు. తొలి బంతి నుంచే ఎదురు దాడికి దిగడమే తెలుసు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ ఆరంభానికి ముందు మ్యాక్సీ షాట్ల ఎంపికను దిగ్గజం గావస్కర్‌ తప్పుపట్టాడు.

కానీ ఈ మ్యాచ్‌లో శతకం తర్వాత గావస్కరే మ్యాక్సీని అభినందనల్లో ముంచెత్తాడు. రివర్స్‌ స్వీప్‌తో అతను కొట్టిన ఓ సిక్సర్‌ క్రికెట్లోనే అత్యుత్తమ షాట్‌ అని గావస్కర్‌ కితాబిచ్చాడు. స్ట్రెయిట్‌ డ్రైవ్, కవర్‌ డ్రైవ్, కట్, ఫ్లిక్, పుల్‌.. ఇలా క్రికెట్‌ పుస్తకంలోని షాట్లతో పాటు రివర్స్‌ స్వీప్, స్విచ్‌ షాట్లతో సిక్సర్లు సాధించడంలో మ్యాక్సీని మించినోళ్లు లేరనే చెప్పాలి. కుడి చేతి వాటం బ్యాటరైన అతను.. ఉన్నట్లుండి లెఫ్టార్మ్‌ బ్యాటర్‌గా మారి వికెట్లకు అడ్డంగా వచ్చి అలవోకగా స్విచ్‌ షాట్లతో సిక్సర్లు కొట్టే విధానం అభిమానులను కట్టిపడేస్తోంది. మ్యాక్సీ అందరివాడు. ఐపీఎల్‌తో భారత అభిమానులకూ అతను దగ్గరయ్యాడు. అంతే కాదు భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా అమ్మాయి విని రామన్‌ను మ్యాక్సీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లకు ఇటీవల కొడుకు పుట్టాడు. నెల వయసున్న తనయుడు లోగాన్‌ మేవరిక్‌ మ్యాక్స్‌వెల్‌కు తన శతకాన్ని అంకితం చేస్తూ ఊయల ఊపినట్లు మ్యాక్సీ సంబరాలు చేసుకున్నాడు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు