IPL 2024: ఐపీఎల్‌లో ఎవరు బెస్ట్‌..? ఎందుకు?.. ‘గూగుల్‌ జెమిని’ ఏం చెప్పిందంటే?

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) అత్యుత్తమ ప్లేయర్ల జాబితాను తీస్తే కొందరు ఉంటారు. అయితే.. గూగుల్‌ జెమిని ఏం చెప్పిందో తెలుసుకోండి..

Updated : 22 Mar 2024 10:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ 17వ సీజన్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతీ ఎడిషన్‌లో ఎవరో ఒకరు హైలైట్‌గా నిలుస్తుంటారు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యుత్తమం అంటే మాత్రం కొందరి పేర్లే గుర్తుకువస్తుంటాయి. ఇటీవల ఫేమస్‌ అయిన గూగుల్‌ ఏఐ చాట్‌బాట్‌ ‘జెమిని’కి ఇదే ప్రశ్న సంధిస్తే.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం.. 

  1. ఎంఎస్ ధోనీ: భారత క్రికెట్‌ చరిత్రలో ధోనీ కెప్టెన్సీకి ప్రత్యేక పేజీలు ఉంటాయి. టీమ్‌ఇండియాకు టీ20, వన్డే ప్రపంచ కప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీని అందించిన ఏకైక సారథి. అలాగే ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపాడు. నాయకత్వ లక్షణాల్లో టాప్‌. నిశ్శబ్దంగా తన వ్యూహాలను అమలు చేస్తాడు. ఒత్తిడిలోనూ కంగారు పడడు. సీఎస్‌కే జట్టుకు తన సారథ్యంతో వన్నె తెచ్చాడు. ‘ఫినిషర్‌’గానూ కీలకం. 
  2. విరాట్ కోహ్లీ: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్. మైదానంలో దూకుడుగా ఉంటే విరాట్.. బ్యాటింగ్‌ రికార్డుల్లోనూ టాపే. ఐపీఎల్‌లో 7,200 + పరుగులు చేశాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును సారథిగా ఫైనల్‌కూ చేర్చాడు. కోహ్లీ ఈ లీగ్‌లో మొత్తం 7 సెంచరీలు సాధించాడు. 
  3. క్రిస్‌ గేల్‌: ప్రపంచ క్రికెట్‌కు ‘యూనివర్స్‌ బాస్‌’. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు అతడి పేరిటే ఉంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒక మ్యాచ్‌లో గేల్ 175 పరుగులు  చేశాడు. 2013 సీజన్‌లో పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాటర్‌గా గేల్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. 142 మ్యాచులు ఆడిన గేల్‌ మొత్తం 4,965 పరుగులు చేశాడు.
  4. లసిత్ మలింగ: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫాస్ట్‌ బౌలర్‌. మెగా టోర్నీ చరిత్రలో 170 వికెట్లు తీసిన ఆటగాడు. కేవలం 122 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు. యార్కర్లు, బౌలింగ్‌లో వేరియేషన్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. డెత్‌ ఓవర్లలో అత్యంత ప్రమాదకారిగా నిలిచాడు.
  5. డేవిడ్‌ వార్నర్: ఆస్ట్రేలియాకు తొలిసారి టీ20 ప్రపంచ కప్‌ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్‌కు కప్‌ అందించాడు. ప్రస్తుతం దిల్లీ జట్టుకు ఆడుతున్నాడు. ఎక్కడ ఆడినా తన దూకుడైన ఆటతీరుతో శుభారంభాలను అందించాడు. 
  6. ఏబీ డివిలియర్స్‌: కొత్త షాట్లను పరిచయం చేసిన బ్యాటర్. మైదానంలో 360 డిగ్రీల్లోనూ బౌండరీలు రాబట్టగలిగే సమర్థుడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ విజయాలు సాధించడంలో ఏబీడీ కీలక పాత్ర పోషించాడు. మొత్తం 184 మ్యాచుల్లో 5,162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలూ ఉన్నాయి. 
  7. డ్వేన్‌ బ్రావో: అద్భుతమైన ఆల్‌రౌండర్. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో ప్రభావం చూపించాడు. ఫీల్డింగ్‌లోనూ చురుకైన ఆటగాడు. అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌ బౌలర్ కూడా అతడే. మొత్తం 183 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ 1500+ పరుగులు చేశాడు. సీఎస్‌కే విజయాల్లో బ్రావో కీలక పాత్ర.
  8. రోహిత్ శర్మ: హిట్‌ మ్యాన్‌గా సుపరిచితుడు. పవర్‌ప్లేలో భారీగా హిట్టింగ్‌ చేస్తాడు. ముంబయి ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన సారథి. ఈ లీగ్‌లోనే అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్. రోహిత్ మొత్తం 243 మ్యాచుల్లో 6,211 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 257 సిక్స్‌లు కొట్టాడు.
  9. జస్‌ప్రీత్ బుమ్రా: టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రాకూ ఇందులో అవకాశం దక్కింది. ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్‌ ఇతడే. నిలకడైన వేగం, యార్కర్లతో ప్రత్యర్థులను హడలెత్తిస్తాడు. ముంబయి ఇండియన్స్‌ విజయాల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 
  10. సునీల్ నరైన్‌: వెస్టిండీస్‌ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్లేయర్‌గా నిలిచాడు. వైవిధ్యమైన బంతులను సంధించే నరైన్ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టైటిల్‌ నెగ్గడంలోనూ ముఖ్య భూమిక పోషించాడు. బ్యాటింగ్‌లోనూ హిట్టింగ్‌ చేయడం అదనపు అర్హత. 

నోట్‌:  ఇది ‘గూగుల్‌ జెమిని’ వెల్లడించిన జాబితా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని