IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?

గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్‌ తగిలే అవకాశముంది. ఆ జట్టు ప్రధాన పేసర్ మహ్మద్‌ షమి (Mohammed Shami) ఫ్రాంఛైజీ మారే ఛాన్స్‌ ఉందని వార్తలొస్తున్నాయి. 

Published : 08 Dec 2023 02:14 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans)కు మరో షాక్‌ తగిలేలా ఉంది. మొదటి రెండు సీజన్లలో జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్య ఇప్పటికే ముంబయి ఇండియన్స్‌కు ట్రేడ్‌ కాగా.. ఇప్పుడు మరో కీలక ఆటగాడు ఫ్రాంఛైజీ మారే అవకాశముందని తెలుస్తోంది. గుజరాత్ జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్న మహ్మద్‌ షమి (Mohammed Shami)ని ట్రేడింగ్‌ కోసం ఓ ఫ్రాంఛైజీ సంప్రదించిందట. ఈ విషయాన్ని స్వయంగా గుజరాత్ టైటాన్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కల్నల్ అర్విందర్‌ సింగ్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘ప్రతి ఫ్రాంఛైజీకి అగ్రశ్రేణి ఆటగాళ్లను ఎంచుకునే హక్కు ఉంది. ఒకవేళ ఏదైనా ఫ్రాంఛైజీ ట్రేడింగ్‌ కోసం నేరుగా ఆటగాడిని సంప్రదించినట్లయితే అది తప్పు.  ఈ విధానం పట్ల గుజరాత్ టైటాన్స్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్ సంతోషంగా లేదు. ఆటగాళ్ల ట్రేడింగ్‌కు సంబంధించిన బీసీసీఐ కొన్ని నియమాలు రూపొందించింది. ఏ ఆటగాడైనా కావాలనుకుంటే ఫ్రాంఛైజీలు బీసీసీఐని సంప్రదించాలి. ఆపై ఆ విషయాన్ని బీసీసీఐ మాకు తెలియజేస్తుంది. అనంతరం ఫ్రాంఛైజీ ఏదో ఇక నిర్ణయం తీసుకుంటుంది.  ఈ ఐపీఎల్ టీమ్‌ నేరుగా మా కోచింగ్ స్టాఫ్‌ని సంప్రదించడం తప్పు. బదిలీ కావాలంటే మాతో ముందే మాట్లాడి ఉండేవారు. కానీ, మేము దాని గురించి తర్వాత తెలుసుకున్నాం’’ అని గుజరాత్ టైటాన్స్‌  సీవోవో కల్నల్ అర్విందర్‌ సింగ్ వివరించాడు. అయితే, ఆ ఫ్రాంఛైజీ ఏది అనే విషయాన్ని అతడు వెల్లడించలేదు. 

మరోవైపు, ఆటగాళ్ల రిటెన్షన్‌ చేసుకునే గడువు ముగిసింది. కానీ, ప్లేయర్స్‌ని ట్రేడ్‌ చేసుకునేందుకు డిసెంబరు 12 వరకు అవకాశం ఇచ్చారు. షమి ఫ్రాంఛైజీ మారతాడా? గుజరాత్‌ జట్టులోనే కొనసాగతాడా? అనేది  మరో నాలుగైదు రోజుల్లో తేలనుంది. అప్పటిలోగా మరికొంతమంది ఆటగాళ్ల ట్రేడింగ్ జరిగే ఛాన్స్‌ ఉంది. డిసెంబరు 19న దుబాయ్‌లో మినీ వేలం నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు