Gujarat vs Hyderabad: మెరిసిన మిల్లర్‌, సుదర్శన్‌.. హైదరాబాద్‌పై గుజరాత్‌ విజయం

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గుజరాత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 31 Mar 2024 19:25 IST

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 17 సీజన్‌లో గుజరాత్‌ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (36), వృద్ధిమాన్‌ సాహా (25) శుభారంభాన్నిచ్చారు. సాయి సుదర్శన్‌ (45), డేవిడ్ మిల్లర్ (44*; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. హైదరాబాద్‌ బౌలర్లలో మయాంక్‌ మార్కండే, కమిన్స్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలో వికెట్‌ తీశారు.

మిల్లర్‌, సాయి సుదర్శన్‌ దూకుడు

లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ ప్రారంభం నుంచి పక్కా ప్రణాళికతో ఆడింది. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభాన్నిచ్చారు. క్రీజులో నిలదొక్కుకుంటున్న ఈ జోడీని షాబాజ్‌ అహ్మద్‌ విడగొట్టాడు. ఐదో ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన వృద్ధిమాన్‌... కమిన్స్‌ చేతికి చిక్కిపోయాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ నిర్మించాడు. అయితే పదో ఓవర్లో కమిన్స్‌ మార్కండే బౌలింగ్‌లో అబ్దుల్‌ సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌తో కలిసి సుదర్శన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇద్దరూ పోటా పోటీగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.  ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కమిన్స్‌ విడగొట్టాడు. 16.1వ బంతికి సాయి సుదర్శన్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్‌ శర్మ చేతికి చిక్కిపోయాడు. అప్పటికి జట్టు స్కోరు 138 పరుగులు. అప్పటికే గుజరాత్‌ లక్ష్యానికి చేరువ కావడంతో హైదరాబాద్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. చివర్లో వచ్చిన విజయ్‌ శంకర్‌ (14*) సాయంతో మిల్లర్‌ లక్ష్యాన్ని పూర్తి చేశాడు.

ఒక్క ఓవర్లోనే తారుమారు..

15 ఓవర్ల వరకు హైదరాబాద్‌ పోటీలోనే ఉంది. అప్పటికి గుజరాత్ స్కోరు 114/2. 30 బంతుల్లో 49 పరుగులు అవసరమైన దశలో మయాంక్ మర్కండే వేసిన 16 ఓవర్‌లో మిల్లర్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. సాయి సుదర్శన్ కూడా ఓ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తం 24 పరుగుల రావడంతో మ్యాచ్‌ గుజరాత్‌ వైపు మళ్లింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (29), అబ్దుల్ సమద్ (29) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. క్లాసెన్ (24; 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. షాబాజ్ అహ్మద్‌ (22), ట్రావిస్ హెడ్ (19), మయాంక్ అగర్వాల్ (16), మార్‌క్రమ్‌ (17) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్‌, ఉమేశ్ యాదవ్, రషీద్‌ ఖాన్‌, నూర్ అహ్మద్‌ తలో వికెట్ పడగొట్టారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని