IPL 2024: సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్‌ కిస్‌ వరకు... ఆసక్తికర విశేషాలివే!

సుదీర్ఘమైన ఐపీఎల్‌ టోర్నీలో సగం మ్యాచ్‌లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి.

Updated : 21 Apr 2024 15:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ధోనీ నామస్మరణ.. విరాట్ దూకుడు.. హైదరాబాద్‌ రికార్డులు.. ముంబయి కెప్టెన్సీ ట్రోలింగ్‌.. ఇవీ ఇప్పటి వరకు ఐపీఎల్ 17వ సీజన్‌లో అభిమానులను అలరించిన అంశాలు. ఈ ఎడిషన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తైన నేపథ్యంలో ఆసక్తికర విశేషాలు ఇవే 

హైదరా ‘బాదు’డు

గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈసారి సరికొత్త సన్‌రైజర్స్‌ను చూసినట్లుంది. బ్యాటర్లు ‘రికార్డు’లు తిరగరాసే పనిలో ఉన్నారు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు (287/3) చేసిన జట్టుగా ఈ ఏడాది హైదరాబాద్‌ చరిత్ర సృష్టించింది. 277/3తో తొలుత బద్దలు కొట్టగా... దానిని మళ్లీ తానే 287తో బ్రేక్‌ చేసింది. తాజాగా దిల్లీపైనా 266 రన్స్‌ చేయడం విశేషం. మరోవైపు కోల్‌కతా 272/7, బెంగళూరు 263/5 కూడా భారీ స్కోర్లు చేశాయి. 


ధోనీ స్పెషల్

ధోనీ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం అతడి ఆటను చూడటానికే వచ్చామా? అన్నట్లుగా అభిమానులు ఈ ఏడాది హోరెత్తిస్తున్నారు. చెన్నై ఆడిన మైదానం పసుపుమయం కావడం గమనార్హం. ఐపీఎల్‌లో బదులు డీపీఎల్‌ (ధోనీ ప్రీమియర్‌ లీగ్)గా మారిపోయింది అనే కామెంట్లూ వినిపించాయి. వచ్చిన వారిని నిరాశపరచకుండా ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి భారీ సిక్స్‌లతో రెచ్చిపోయాడీ ‘కెప్టెన్ కూల్’. అతడు బ్యాటింగ్‌కు వచ్చే వేళ అభిమానుల హోరు 95 డెసిబుల్స్‌ను దాటిందని డికాక్‌ సతీమణి సాషా ఇన్‌స్టాలో చేసిన పోస్టు సంచలనం సృష్టించింది.   


బౌలింగ్‌ ఫట్‌.. విరాట్ హిట్‌

‘ఈసాలా కప్ నమదే’.. ఏటా వినిపించే ఈ నినాదం బెంగళూరు అభిమానుల నుంచి ఈ ఏడాది రావడం లేదు. కారణం ఏడింటిలో ఒకటే విజయం. ఆ టీమ్‌ గురించి కేవలం నాలుగు పదాల్లో చెప్పాలంటే.. ‘బౌలింగ్‌ ఫట్‌.. విరాట్ హిట్’. 200+ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం లేదు. విరాట్ కోహ్లీ (7 మ్యాచుల్లో 361) ఆరెంజ్‌ క్యాప్‌ రేసులోఉండటమే బెంగళూరుకు ఊరటనిచ్చే అంశం. నా వల్ల కాదు బాబోయ్‌ అంటూ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ కూడా చేతులెత్తేశాడు. ప్లేఆఫ్స్‌ ఆశలు కాదు కదా.. బాటమ్‌ నుంచి కాస్త అయినా టీమ్‌ పైకొస్తుందా అనేది కూడా డౌటే. 


హార్దిక్‌ - రోహిత్ - ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌

మ్యాచ్‌లు ముంబయి ప్రదర్శన కంటే హార్దిక్‌-రోహిత్‌ ఫ్యాన్స్ యుద్ధాలను తలపిస్తున్నాయి. ప్రతి స్టేడియంలోనూ పాండ్యకు హేళనలు ఎదురవుతూనే ఉన్నాయి. సరైన వ్యూహాల ఎంపికలో హార్దిక్‌ విఫలమయ్యాడని కొందరు విమర్శలు గుప్పించారు. ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. జస్‌ప్రీత్‌ బుమ్రాను వినియోగించుకోవడంలో పాండ్య విఫలమవుతున్నాడని కూడా అంటున్నారు. వ్యక్తిగతంగానూ పాండ్య బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలం కావడం నిరాశకు గురి చేస్తోంది. 


మయాంక్‌కు హర్షిత్‌ రాణా ఫ్లైయింగ్‌ కిస్

హైదరాబాద్‌తో మ్యాచులో కోల్‌కతా బౌలర్‌ హర్షిత్‌ రాణా ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ను ఔట్‌ చేసినప్పుడు ‘ఫ్లైయింగ్‌ కిస్‌’ ఇవ్వడం అభిమానుల ఆగ్రహానికి దారితీసింది. అంతకుముందు తన ఓవర్‌లోనే మయాంక్‌ సిక్స్‌, ఫోర్ కొట్టడంతో రాణా ఇలా ప్రవర్తించాడు. అయితే, ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ ఈ చర్యను ఉపేక్షించలేదు. రాణాకు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. కోల్‌కతా జట్టులో చాలా సీజన్లుగా విఫలమవుతున్న సునీల్ నరైన్, ఆండ్రి రస్సెల్ ఫామ్‌ను అందిపుచ్చుకొన్నారు. పాతిక కోట్లు పెట్టి దక్కించుకున్న స్టార్‌ పేసర్ స్టార్క్‌ నిరాశపరుస్తున్నాడు.


యశస్వి తడబడగా.. పరాగ్‌ చెలరేగగా.. 

ఏడు మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించిన ఏకైక జట్టుగా (12 పాయింట్లు) రాజస్థాన్‌ నిలిచింది. మిగిలిన సగం మ్యాచుల్లో కనీసం మూడు గెలిచినా ఆ జట్టుకు ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం. అయితే, ఓపెనర్ యశస్వి జైస్వాల్ తడబాటు ఆందోళన కలిగించే అంశమే. టీ20 ప్రపంచ కప్ జట్టులోకి వస్తాడని భావిస్తున్న క్రమంలో ఫామ్‌ కోల్పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఐపీఎల్ ప్రారంభం ముందు వరకు మంచి ఫామ్‌తో ఆడిన యశస్వి ఇప్పుడు నిరాశపరుస్తున్నాడు. మరోవైపు అనూహ్యంగా రియాన్‌ పరాగ్ సక్సెస్ కావడం విశేషం. 


సామ్ - జితేశ్ వైస్ కెప్టెన్సీ రగడ

పంజాబ్‌ పరిస్థితిని చూస్తుంటే జాలేస్తోంది. టోర్నీని అద్భుత విజయంతో ప్రారంభించిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉందంటే నమ్మగలమా? ఏడు మ్యాచుల్లో రెండు విజయాలను మాత్రమే సాధించింది. రెగ్యులర్‌ సారథి శిఖర్ ధావన్‌ గాయం కారణంగా డగౌట్‌కే పరిమితం కావడం కూడా ఆ జట్టుకు షాక్‌. ఇలాంటి క్లిష్ట సమయంలో వైస్‌ కెప్టెన్సీ రగడ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. జితేశ్‌ను తొలుత వైస్‌ కెప్టెన్‌ అని చెప్పి.. తర్వాత సామ్‌కి అప్పగించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిత గబ్బర్‌కి డిప్యూటీ సామ్‌ అని మేనేజ్‌మెంట్‌ తేల్చేసింది. 


కొత్త పేస్‌ హీరో

ఈ సీజన్‌లో భారత క్రికెట్‌కు మరో పేస్ స్టార్‌ దొరికాడు. అతడే లఖ్‌నవూ సీమర్‌ మయాంక్‌ యాదవ్. నిలకడగా 150 కి.మీ వేగంతో బంతులేయడం అంత ఈజీ కాదు. కానీ, ఈ కుర్రాడు మాత్రం అలవోకగా చేసి చూపిస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని (156.7 కి.మీ) విసిరిన బౌలర్‌ అతనే. అయితే ఇప్పుడు గాయంతో డగౌట్‌కు పరిమితమయ్యాడు. ఫిట్‌నెస్‌ సాధించి మళ్లీ అదే జోరుతో బౌలింగ్‌ వేస్తే టీ20 ప్రపంచ కప్‌లో అతడిని బ్యాకప్‌ పేసర్‌గా తీసుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. 


జట్టులో పంత్ ఖాయం!

దాదాపు 15 నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్‌... ఈ సీజన్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. మిడిలార్డర్‌లో వచ్చే అతడు ఏడు మ్యాచుల్లో 210 పరుగులు చేశాడు. వీటిలో రెండు హాఫ్‌ సెంచరీలూ ఉన్నాయి. వరల్డ్‌ కప్‌ కోసం స్పెషలిస్ట్‌ బ్యాటర్ కమ్‌ వికెట్‌ కీపర్ కొరత టీమ్‌ఇండియాకు తీరిపోయినట్లే అని అంచనా వేస్తున్నారు. ఈ విషయం త్వరలో తేలిపోనుంది.


గిల్‌కి కెప్టెన్సీ కష్టం

గుజరాత్‌ శుభ్‌మన్‌ గిల్‌ నాయకత్వ అనుభవలేమితో ఇబ్బందిపడుతోంది. వ్యక్తిగత ప్రదర్శనలోనూ విఫలమవుతున్నాడు. మరోవైపు సీనియర్‌ పేసర్ మహమ్మద్‌ షమీ లేకపోవడమూ ఆ జట్టుకు నష్టమే. గత సీజన్‌లో దూకుడుగా ఆడి పరుగులు చేసిన కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాతియా, వృద్ధిమాన్‌ సాహా ఈసారి ప్రభావం చూపించడంలేదు. రషీద్‌ ఖాన్‌ ఒంటరి పోరు చేస్తున్నా సరిపోవడం లేదు. మోహిత్‌కు తోడుగా సరైన మరో పేసర్ రాణించకపోవడం వల్ల గుజరాత్‌కు ఓటములు తప్పడం లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని