IPL 2024: సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా..: హర్భజన్‌

జట్టును కలిసికట్టుగా నడిపించడంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యతోపాటు సీనియర్లూ విఫలం కావడం వల్లే ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుకోలేదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ వ్యాఖ్యానించాడు.

Published : 21 May 2024 18:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌ను ముంబయి ఇండియన్స్‌ చివరి స్థానంతో ముగించింది. స్టార్లు ఉన్నా సరే నిలకడైన ఆటతీరును ప్రదర్శించడంలో ఘోరంగా విఫలమైంది. కెప్టెన్సీ మార్పు తీవ్ర ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. రోహిత్ స్థానంలో హార్దిక్‌ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. దీంతో సీనియర్ల మధ్య సత్సంబంధాలు లేవని సోషల్ మీడియాలోనూ కామెంట్లు వెల్లువెత్తాయి. తమ జట్టు పరిస్థితిపై ఇప్పటికే ముంబయి ఓనర్ నీతా అంబానీ స్పందించారు. అయితే, ఒకప్పుడు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హర్భజన్ సింగ్‌ మాత్రం ఫ్రాంచైజీ తీరుతోపాటు సీనియర్ ఆటగాళ్లపై అసహనం వ్యక్తంచేశాడు. 

‘‘ఐపీఎల్‌లోనే అతిపెద్ద జట్లలో ముంబయి ఒకటి. ఆ టీమ్‌కు ఆడిన అనుభవం నాకుంది. మేనేజ్‌మెంట్ అద్భుతమైంది. జట్టును బాగానే నడిపింది. కానీ, ఈసారి మాత్రం కెప్టెన్సీ మార్పు నిర్ణయం తీసుకుంది. అదే బ్యాక్‌ఫైర్‌ కావడంతో ఇబ్బందిపడింది. భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. సరిగ్గా అమలుచేయడంలో తడబాటుకు గురైంది. జట్టును సమష్టిగా ఉంచడంలో విఫలమైంది. ఇలాంటి గొప్ప జట్టు అలా తయారైనందుకు చాలా బాధపడ్డా. నాయకత్వ మార్పు నిర్ణయం తీసుకున్న సమయం సరైంది కాదు. ఇదేమీ హార్దిక్‌ తప్పు కాదు. గుజరాత్‌ను అద్భుతంగా నడిపించిన రికార్డు అతడి సొంతం. అయితే, సీనియర్లుగా మిగతా వారి బాధ్యత జట్టును కలిసికట్టుగా ఉండేలా చూడటమే. ఇక్కడ కెప్టెన్‌ ఎవరు అనేది అనవసరం. సారథి వస్తుంటాడు.. పోతుంటాడు కానీ, జట్టు మాత్రం ఇలాంటి ఆటతీరు ప్రదర్శించకూడదు’’ అని హర్భజన్ వ్యాఖ్యానించాడు. 

కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ పాండ్య ఈ సీజన్‌లో 14 మ్యాచుల్లో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ 143 మాత్రమే. అత్యుత్తమ స్కోరు 46 పరుగులు. బౌలింగ్‌లోనూ గొప్పగా ప్రదర్శన చేయలేదు. 11 వికెట్లు మాత్రమే తీశాడు. ఐపీఎల్‌లో విఫలమైనప్పటికీ వరల్డ్‌ కప్‌లో మాత్రం అతడు కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. రోహిత్, సూర్యకుమార్‌ యాదవ్‌ కొన్ని మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడినా ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలమైంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని