IPL 2024: రోహిత్ ఛాంపియన్‌ లీడర్‌.. ముంబయి నిర్ణయం అతడికి షాకే: హర్భజన్‌ సింగ్

ముంబయిని ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Published : 16 Mar 2024 10:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరో ఆరు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL) 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. ముంబయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఎలా ఆడతాడు? ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ఆ జట్టును కొత్త సారథి హార్దిక్ పాండ్య ఎలా నడిపిస్తాడు? అనేది ఇప్పుడు అందరిలోనూ చర్చ. ముంబయి తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్ స్పందించాడు. రోహిత్‌ను తప్పించడం అందరినీ షాక్‌కు గురి చేసిందని.. అయితే దీని వెనుక జట్టు భవిష్యత్తు ప్రయోజనాలు ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాడు.

‘‘ముంబయి ఇండియన్స్‌ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. రోహిత్ శర్మ ఛాంపియన్‌ ప్లేయర్‌. గొప్ప లీడర్‌. ముంబయిని ఐదు సార్లు విజేతగా నిలిపాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ భారత్‌కు అద్భుత విజయాలు సాధించి పెట్టాడు. ఒక్కసారిగా అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడం దిగ్భ్రాంతికి గురి చేసి ఉంటుంది. అయితే, ముంబయి జట్టు విజయాల్లో తప్పకుండా భాగస్వామ్యం అవుతాడని ఆశిస్తున్నా. రోహిత్‌ ఓ ప్లేయర్‌గా జట్టులోకి అడుగు పెట్టి.. నాయకుడిగా ఎదిగాడు. తన సారథ్య విలువ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, సడెన్‌గా ముంబయి ఇండియన్స్‌ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియదు. కానీ, భవిష్యత్తులో మెరుగైన పనితీరు కోసం మార్పు చేసి ఉండొచ్చని అనుకుంటున్నా. గుజరాత్‌ టైటాన్స్‌ను తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్‌ను ముంబయి కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టుకు అదనపు బలం చేకూరుస్తాడు. నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకోవడంలో ముందున్నాడు’’ అని హర్భజన్‌ వ్యాఖ్యానించాడు.

ధోనీ అలా వస్తాడేమో: అంబటి రాయుడు

ధోనీ ఇంపాక్ట్‌ రూల్‌ను వినియోగించుకుని.. కెప్టెన్‌గా వేరొకరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. ‘‘ఇప్పుడు ఇంపాక్ట్‌ రూల్‌ అమల్లో ఉంది. దీంతో కెప్టెన్‌గా ఎవరో ఒకరిని ముందుంచి.. జట్టును ధోనీ నడిపే అవకాశం లేకపోలేదు. సదరు వ్యక్తి సారథిగా కుదురుకొనే వరకూ అలానే కొనసాగిస్తాడు. నేను మాత్రం వ్యక్తిగతంగా అతడిని కెప్టెన్‌గా చూడటానికే ఇష్టపడతా’’ అని రాయుడు తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని