T20 World Cup 2024: పాండ్య ‘బ్యాకప్‌’ పేసర్.. బౌలింగ్‌ కాంబినేషన్‌ అలా ఉంటే తిరుగుండదు: గావస్కర్

రెండోసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు భారత బరిలోకి దిగింది. మరో నాలుగు రోజుల్లో తొలి మ్యాచ్‌ ఆడనుంది. జూన్ 9న పాకిస్థాన్‌తో కీలక పోరు జరగనుంది.

Published : 01 Jun 2024 11:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విండీస్ - అమెరికా సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇవాళే బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌ ఆడనుంది. జట్టు కూర్పుపై ఓ అవగాహన వచ్చేందుకు ఇదొక సదావకాశమని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) వ్యాఖ్యానించాడు. విండీస్ పిచ్‌లపై బౌలింగ్‌ అత్యంత కీలకమని సూచించాడు. ప్రపంచ కప్ ముంగిట గావస్కర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘సమతూకంతో కూడిన బౌలింగ్‌ ఎటాక్ ఉండాలి. భారత జట్టు తప్పకుండా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాలి. అలాగే బ్యాకప్ ఫాస్ట్‌ బౌలర్‌గా పాండ్య ఉంటాడు. ఇలా చేస్తే సరైన కూర్పుగా ఉంటుందని భావిస్తున్నా. సీనియర్లు, యువకులతో కూడిన టీమ్‌ ఈసారి అద్భుత ప్రదర్శన చేస్తుందని భావిస్తున్నా. రోహిత్, విరాట్, సూర్య, బుమ్రాతోపాటు యశస్వి జైస్వాల్, శివమ్‌ దూబె వంటి హిట్టర్లు ఉన్నారు. సెమీస్‌కు చేరే జట్ల గురించి అంచనా వేయడం చాలా కష్టంగా ఉంది. ప్రతి టీమ్‌లు అన్ని విభాగాల్లో బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి’’ అని గావస్కర్ వెల్లడించాడు. 

నా సరసన విరాట్ నిలుస్తాడు..

ఐపీఎల్ సందర్భంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు గావస్కర్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. స్పిన్‌ బౌలింగ్‌లో అతడి బ్యాటింగ్‌ సరిగ్గా లేదని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచ కప్‌లో మంచి స్ట్రైక్‌రేట్‌తో మరిన్ని పరుగులు చేయాలని సూచించాడు. ఇదే సమయంలో తన సరసన నిలిచే అవకాశం ఉందని.. అలా జరగాలంటే ఆసీస్‌తో ఈ ఏడాది చివర్లో టెస్టు సిరీస్‌లో ఒక్క సెంచరీ చేయాలని పేర్కొన్నాడు. ‘‘వ్యక్తిగతంగా విరాట్‌ కోహ్లీ మూడో ఓవర్సీస్‌ ప్లేయర్‌గా అవతరించేందుకు ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. అదీనూ గబ్బా వేదికలో శతకం చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో అన్ని మైదానాల్లో సెంచరీలు చేసిన అనుభవం విరాట్ కోహ్లీకి ఉంది’’ అని గావస్కర్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని