Cricket News: హార్దిక్‌ చాలా స్ట్రాంగ్‌.. గడ్డు పరిస్థితిని తట్టుకోగలిగాడు: మాజీ క్రికెటర్

ఐపీఎల్‌ సమయంలో హార్దిక్‌ను చూస్తే.. అతడు మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ, వచ్చాడు. వార్మప్‌ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని హడలెత్తించే ప్రదర్శన చేశాడు.

Published : 03 Jun 2024 17:51 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో అందరి దృష్టి హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) మీదనే. ఐపీఎల్‌లో అత్యంత వివాదాస్పదమై జాతీయజట్టులోకి వచ్చాడు. కెప్టెన్సీ వివాదం, ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకోలేకపోవడంతో విమర్శలు, విడాకులు తీసుకున్నాడనే రూమర్లతో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు వైస్‌ కెప్టెన్‌గా పాండ్య వరల్డ్‌ కప్ కోసం అమెరికాలో అడుగుపెట్టాడు. వార్మప్ మ్యాచ్‌లో అదరగొట్టేశాడు. దీంతో పాండ్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో హార్దిక్ మానసిక స్థితిపై విండీస్‌ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘మానసికంగా హార్దిక్‌ అత్యంత దృఢమైన వ్యక్తి. ఇప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా అతడికి మద్దతుగా ఉంటారు. ఐపీఎల్‌ సమయంలో పాండ్య చాలా భరించాడు. కొన్నింట్లో అతడి పాత్ర లేకపోయినా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఏం జరిగిందో అదంతా ముగిసిపోయింది. ఇప్పుడు దానినుంచి పాండ్య బయటకు వచ్చాడని అనుకుంటున్నా. తప్పకుండా భారత్‌ తరఫున కీలక పాత్ర పోషిస్తాడు’’ అని వెల్లడించాడు. 


ఫిట్‌నెస్‌ అత్యంత కీలకం: రహానె

ఐపీఎల్‌ ముగిసిన కొన్ని రోజులకే భారత వెటరన్ క్రికెటర్ అజింక్య రహానె (Ajikya Rahane) తన దేశవాళీ సీజన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ముంబయి క్రికెట్ అసోసియేషన్‌ తరఫున నిర్వహించే ఆఫ్‌-సీజన్‌ ట్రైనింగ్‌ క్యాంప్ ప్రారంభం సందర్భంగా రహానె మాట్లాడాడు. ‘‘ముంబయి జట్టు గౌరవాన్ని కొనసాగించేందుకు యువకులకు ఇదొక మంచి అవకాశం. గేమ్‌ ప్లాన్‌తోపాటు ఫిట్‌నెస్‌పై తీవ్ర సాధన చేయాలి. ఫిట్‌గా ఉంటేనే ఆటపై దృష్టిసారించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సీజన్ ప్రారంభమయ్యాక.. జట్టు ఏం కోరుకుంటుందనేది కీలకం. అందుకు తగ్గట్టుగా మనం సిద్ధంగా ఉండాలి. నైపుణ్యపరంగా, ఫిట్‌నెస్‌లో ఈ రెండు నెలలను సద్వినియోగం చేసుకోవాలి. బౌలింగ్‌ మెంటార్‌గా ధవళ్ కులకర్ణిని నియమించడం అభినందనీయం. దేశవాళీ క్రికెట్‌లో అతడికి అనుభవం ఎక్కువ’’ అని రహానె తెలిపాడు. 


క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేదార్‌ జాదవ్‌

భారత ఆల్‌రౌండర్ కేదార్‌ జాదవ్‌ (Kedar Jadhav) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతంలో ఎంఎస్ ధోనీ ఎలా అయితే విభిన్నంగా రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడో.. ఇప్పుడు కేదార్‌ కూడా అలానే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కిశోర్ కుమార్‌ పాడిన బాలీవుడ్‌ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా పెట్టి మరీ 39 ఏళ్ల జాదవ్ వీడ్కోలు సందేశం పెట్టడం విశేషం. ‘‘నా క్రికెట్ కెరీర్‌లో మద్దతుగా నిలిచిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. ఇవాళ మూడు గంటల నుంచి నన్ను మాజీ క్రికెటర్‌గా పరిగణనలోకి తీసుకోండి. అన్నిరకాల క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నా’’ అని పోస్టు పెట్టాడు. కేదార్‌ భారత్‌ తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు