Vaibhav Pandya: హార్దిక్‌ సోదరులకు రూ.4.3కోట్ల కుచ్చుటోపీ.. కజిన్‌ వైభవ్‌ పాండ్య అరెస్టు

Vaibhav Pandya: వ్యాపారంలో హార్దిక్‌, కృనాల్‌ పాండ్యను రూ.కోట్లలో మోసగించిన కేసులో వారి కజిన్‌ వైభవ్‌ పాండ్యను పోలీసులు అరెస్టు చేశారు. 

Updated : 11 Apr 2024 11:19 IST

ముంబయి: క్రికెటర్లు హార్దిక్‌ (Hardik Pandya), కృనాల్‌ పాండ్య తమ సమీప బంధువు చేతిలోనే మోసపోయారు. వరుసకు సోదరుడయ్యే వైభవ్‌ పాండ్య (Vaibhav Pandya) వీరికి పార్ట్‌నర్‌షిప్‌ బిజినెస్‌లో దాదాపు రూ.4.3కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ముంబయి పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారులు వైభవ్‌ను అరెస్టు చేశారు.

పాండ్య సోదరులు, కజిన్‌ వైభవ్‌ కలిసి 2021లో సంయుక్తంగా పాలిమర్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో హార్దిక్‌, కృనాల్‌ (Krunal Pandya)కు 40శాతం చొప్పున పెట్టుబడులున్నాయి. మిగతా 20శాతం వాటా ఉన్న వైభవ్‌ ఈ బిజినెస్‌ రోజువారీ కార్యకలాపాలను చూసుకున్నాడు. లాభాలను కూడా ఇదే నిష్పత్తిలో పంచుకున్నారు.

3 నెలల్లో మూడు గాయాలతో పోరాడా: సూర్యకుమార్‌ యాదవ్‌

అయితే, పాండ్య సోదరులకు తెలియకుండా కొద్ది రోజుల క్రితం వైభవ్‌ సొంతంగా మరో పాలిమర్‌ వ్యాపారాన్ని ప్రారంభించాడు. దీంతో గతంలో భాగస్వామ్యంతో పెట్టిన బిజినెస్‌కు లాభాలు తగ్గి రూ.3కోట్ల మేర నష్టం వాటిల్లింది. అదే సమయంలో వైభవ్‌ రహస్యంగా తన లాభాల వాటాను 20శాతం నుంచి 33 శాతానికి పెంచుకున్నాడు. సంస్థ అకౌంట్‌ నుంచి భారీ మొత్తంలో డబ్బును తన ఖాతాకు మళ్లించుకున్నాడు. అలా మొత్తంగా దాదాపు రూ.4.3కోట్ల మేర హార్దిక్‌ సోదరులను మోసగించాడు. 

ఈ విషయంపై క్రికెటర్లు అడగ్గా.. పరువు తీస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్‌, కృనాల్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు బుధవారం వైభవ్‌ను అరెస్టు చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని