Hardik Pandya: ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్‌ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్‌ పాండ్య

జట్టు నిండా స్టార్‌ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్‌ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్‌ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్‌నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 18 May 2024 12:25 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐదుసార్లు ఛాంపియన్‌.. కొత్త సారథి నియామకం.. కానీ, ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి జట్టును ప్లేఆఫ్స్‌కు ఇవేవీ చేర్చలేకపోయాయి. కనీసం గౌరవప్రదమైన స్థానంతోనైనా ముగింపు దక్కుతుందంటే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండిపోయింది. తాజాగా లఖ్‌నవూతో మ్యాచ్‌లోనూ గెలిచి కాస్త పరువుతో టోర్నీ నుంచి నిష్క్రమిద్దామంటే అదీ సాధ్యపడలేదు. మెగా లీగ్‌లో తాము ఎక్కడ పొరపాట్లు చేశామనేది ఇప్పుడే చెప్పలేనని.. నాణ్యమైన క్రికెట్‌ను మాత్ర ఆడలేకపోయినట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్‌ పాండ్య అంగీకరించాడు. బౌలర్‌, బ్యాటర్‌గా వ్యక్తిగత ప్రదర్శన చేయడంలోనూ హార్దిక్ విఫలమయ్యాడు. మొత్తం 14 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించిన ముంబయి 8 పాయింట్లను నమోదు చేయగలిగింది.

‘‘ఇలాంటి ముగింపును మేం అస్సలు కోరుకోలేదు. జీర్ణించుకోవడం చాలా కష్టం. మేం టోర్నీ ఆసాంతం నాణ్యమైన క్రికెట్‌ను ఆడలేదనేది కాదనలేని వాస్తవం. ఇదే మమ్మల్ని వెనక్కి వెళ్లేలా చేసింది. ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో ఇలాంటివన్నీ సహజమే. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నించాలి. కానీ, మేం జట్టుగా స్మార్ట్‌ క్రికెట్‌ ఆడలేకపోయాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయో ఇప్పుడే చెప్పడం కష్టం. తప్పకుండా వాటిని సరిదిద్దుకొని వచ్చేసారి బలంగా ముందుకొస్తాం’’ అని పాండ్య వెల్లడించాడు. 

రోహిత్‌ చెప్పిన సమాధానమదే: మార్క్‌ బౌచర్

ఐపీఎల్‌ సీజన్‌ను ముగించిన తర్వాత రోహిత్ శర్మ ఎదుట ముంబయి ప్రధాన కోచ్‌ మార్క్‌ బౌచర్‌ ఓ ప్రశ్న ఉంచాడట. దానికి హిట్‌మ్యాన్ ఇచ్చిన సమాధానం అద్భుతంగా ఉందని బౌచర్ తెలిపాడు. లఖ్‌నవూతో మ్యాచ్‌ అనంతరం కోచ్‌ మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా నాకు రోహిత్‌ బాగా నచ్చుతాడు. అతడు ఏం చేయాలనుకుంటే దానినే ఆచరిస్తాడు. ఈ సీజన్‌లోనూ రోహిత్‌ అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. చెన్నైపై సెంచరీ చేసి అలరించాడు. ఆరంభంలోనే దూకుడుగా పరుగులు రాబట్టాడు. లఖ్‌నవూపైనా అతడి ఇన్నింగ్స్‌ను మనమంతా చూశాం. ఈ సీజన్‌లో మా జట్టు పరిస్థితిపై రివ్యూ చేసుకున్నాం. అదే సమయంలో రోహిత్‌తో మాట్లాడా. ఇక తర్వాత ఏంటి? అని అడిగా. మామూలుగా వేరేవాళ్లయితే కాస్త విశ్రాంతి తీసుకోవడమో.. ఇతర వ్యాపకాల గురించి చెబుతారు. కానీ, రోహిత్‌ మాత్రం ఠక్కున ‘వరల్డ్‌ కప్‌’ అనేశాడు. ఆటపట్ల అతడికి ఉన్న కమిట్‌మెంట్‌ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. వచ్చే సీజన్‌లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం. అసలే మెగా ఆక్షన్ జరగనుంది’’’ అని బౌచర్ తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని