Hardik Pandya: మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్‌ బ్యాటర్లకు హ్యాట్సాఫ్‌: హార్దిక్ పాండ్య

ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్‌ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Updated : 28 Mar 2024 11:02 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ నిర్దేశించిన 278 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి కూడా దూకుడు ప్రదర్శించింది. చివరికి 246 స్కోరుకే పరిమితమైనప్పటికీ హైదరాబాద్‌ జట్టుకు వణుకు పుట్టించింది. తొలుత బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇవ్వడంపై ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) స్పందించాడు. పిచ్‌ బ్యాటర్లకు పూర్తి అనుకూలంగా ఉందని.. తమ బౌలర్ల విషయంలో ఆందోళనేమీ లేదని స్పష్టం చేశాడు. 

‘‘టాస్‌ గెలిచి హైదరాబాద్‌కు బ్యాటింగ్‌ అప్పగించినప్పుడు ఇంత భారీ స్కోరు చేస్తుందని ఊహించలేదు. పిచ్‌ చాలా బాగుంది. 277 పరుగులు ఇక్కడ పెద్ద కష్టమేం కాదనిపించింది. హైదరాబాద్‌ బ్యాటర్లు బాగా ఆడారు. మా బౌలర్లు కూడా బాగానే బౌలింగ్‌ వేశారు. ఈ పిచ్‌పై 500+ పరుగులు రావడమంటే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లే. మేం కొన్ని అంశాల్లో మెరుగు పడాల్సిన అవసరం ఉంది. మా వద్ద యువ బౌలర్లు ఉన్నారు. వారు నేర్చుకొనేందుకు కాస్త సమయం అవసరం. ప్రతిసారి ఇలా బంతి స్టాండ్స్‌లోకి వెళ్లినప్పుడు ఓవర్‌ పూర్తి చేయడానికి టైమ్‌ పడుతుంది. మా జట్టులోని ప్రతి బ్యాటర్ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. మపాకా అద్భుతమైన బౌలర్. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ కావడంతో అతడిపై ఒత్తిడి ఉంటుంది. తప్పకుండా పుంజుకొంటాడనే నమ్మకం ఉంది’’ అని హార్దిక్‌ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో మపాకా (0/66), పాండ్య (1/46), కోయిట్జీ (1/57) భారీగా పరుగులు సమర్పించారు.  

గత రెండు మ్యాచుల్లో అదరగొట్టేశాం: ట్రావిస్ హెడ్

‘‘కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చాం. ముంబయితో మా బ్యాటర్లు అదరగొట్టేశారు. అందులో నా భాగస్వామ్యం ఉండటం కూడా ఆనందంగా ఉంది. మొదట్నుంచి దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఆఫ్‌సైడ్, లెగ్‌సైడ్‌లో పరుగులు రాబట్టడం బాగుంది. దాదాపు 280 పరుగులు చేశాం కాబట్టి విజయంపై నమ్మకంతోనే ఉన్నాం’’ అని హైదరాబాద్‌ ఆటగాడు ట్రావిస్ హెడ్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో హెడ్‌ 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అతడితోపాటు అభిషేక్ శర్మ (63), క్లాసెన్ (80*) హాఫ్ సెంచరీలు సాధించగా.. ఐదెన్ మార్‌క్రమ్‌ (42*) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని