Hardik Pandya: మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది: హ్యాట్రిక్‌ ఓటములపై హార్దిక్‌

హ్యాట్రిక్‌ ఓటముల వేళ ముంబయి ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ఓ సందేశం ఇచ్చాడు. మరోవైపు మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ ఒక్కడే ఎంఐ డగౌట్లో ఒంటరిగా కూర్చుండిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Published : 02 Apr 2024 16:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ ఓటములతో కుంగిపోయిన ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) ఫ్యాన్స్‌లో జోష్‌ నింపేందుకు ఆ జట్టు సారథి హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగా అతడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మంగళవారం ఓ పోస్టు చేశాడు. ‘‘జట్టు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే.. ఎప్పటికీ ఓటమి అంగీకరించం.. మేం పోరాడుతూనే ఉంటాం.. ముందుకు సాగుతూనే ఉంటాం’’ అని పేర్కొన్నాడు. జట్టు మైదానంలో వ్యూహరచన చేస్తున్న చిత్రాన్ని దీనికి జత చేశాడు. దీనికి ఎంఐ ఫ్యాన్స్‌ కూడా సానుకూలంగానే స్పందిస్తూ.. ‘‘ధైర్యంగా ఉండు. మేం మిమ్మల్ని విశ్వసిస్తున్నాం’’ ‘‘బలం పుంజుకోండి’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

మైదానంలో ఒంటరి పాండ్య..

హార్దిక్‌ ముంబయి పగ్గాలు చేపట్టాక జట్టును నడిపించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లను ఆ జట్టు ఓడిపోయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్‌ ఆర్డర్‌ పూర్తిగా చేతులెత్తేసింది. ముంబయి జట్టు హోం గ్రౌండ్‌ వాంఖడేలో సోమవారం రాత్రి మ్యాచ్‌ ముగిసిన తర్వాత పూర్తి నిరాశతో అతడు ఒంటరిగా ఎంఐ (MI) డగౌట్లో కూర్చుండిపోయాడు. ఆ సమయంలో ముంబయి ఆటగాళ్లు మైదానం వీడి వెళ్లిపోతుండటం గమనార్హం. ఒక్కరు కూడా పాండ్యతో లేరు. 

హ్యాట్రిక్‌.. వాళ్లకు విజయాల్లో.. వీళ్లకు ఓటముల్లో

మరోవైపు వాంఖడేలో ప్రేక్షకులు కూడా హార్దిక్‌ను తీవ్ర స్థాయిలో హేళన చేశారు. ఒక దశలో రోహిత్‌ శర్మ కూడా అభిమానులపై అసహనం వ్యక్తంచేసి.. ఆపమని కోరాల్సి వచ్చింది. హార్దిక్‌ గత రెండు మ్యాచ్‌ల్లో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా అతడిని ప్రేక్షకులు వెక్కిరించడం ఆపలేదు. 

అతడిది విభిన్నమైన శైలి: ఆకాశ్‌ మధ్వాల్‌

పాండ్యా కెప్టెన్సీపై ముంబయి బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ తొలిసారి స్పందించాడు. జట్టులో ప్రస్తుతం నెలకొన్న వాతావరణంపై అతడు మాట్లాడుతూ ‘‘జట్టులో వాతావరణం చాలా బాగుంది. మీరంతా అతడు కొత్త కెప్టెన్‌ అని అంటున్నారు. మాకు అలా ఏమీ అనిపించడం లేదు. గతంలో రోహిత్‌ తనదైన శైలిలో నడిపించాడు. ఇప్పుడు పాండ్య సొంత బాటలో నడుస్తున్నాడు. వారిద్దరి నాయకత్వంలో ఆడటం సరదాగానే ఉంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో వారిద్దరితో మాట్లాడతాను. జట్టులో ఏదో జరుగుతోందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. రానున్న ఆటల్లో మరింత మెరుగ్గా ఆడతామని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని