Hardik Pandya: బీసీసీఐ వేటు నుంచి హార్దిక్‌ను కాపాడిందదేనా?

బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లు పెనుదుమారమే రేపాయి. క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Updated : 01 Mar 2024 15:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ ప్రకటించింది. దేశవాళీలో ఆడకపోవడంతో శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కలేదు. మరోవైపు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) మాత్రం తన కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకోగలిగాడు. దీంతో బీసీసీఐ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని విమర్శలు వచ్చాయి. కానీ, పాండ్య ఇచ్చిన హామీతోనే బీసీసీఐ కాంట్రాక్ట్‌ను ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఇషాన్, శ్రేయస్‌ (IshanKishan - Shreyas Iyer) మాత్రం దేశవాళీలో ఆడేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

‘‘హార్దిక్‌ పాండ్యతో సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఫిట్‌గా ఉండి జాతీయ జట్టుకు ఆడని సమయంలో తప్పకుండా దేశవాళీలో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడతానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు బీసీసీఐ వైద్య బృందం నివేదిక ప్రకారం.. హార్దిక్‌కు రెడ్‌బాల్ (సుదీర్ఘ ఫార్మాట్‌) టోర్నీల్లో బౌలింగ్‌ చేసేంత ఫిట్‌నెస్‌ లేదు. దీంతో అతడి విషయంలో రంజీ మ్యాచ్‌లు ఆడకపోవడం పెద్ద సమస్య కాలేదు. భారత్‌ తరఫున ఎలాంటి కమిట్‌మెంట్లు లేనప్పుడు డొమిస్టిక్‌లో విజయ్ హజారే, ముస్తాక్‌ అలీ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడు. అలా జరగకపోతే తప్పకుండా కాంట్రాక్ట్‌ రద్దు చేసేందుకు ఆస్కారముంది’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

శ్రేయస్‌పై ఆ ప్రభావం ఉండదు: కేకేఆర్‌ కోచ్

‘‘కాంట్రాక్ట్‌ తొలగించడం శ్రేయస్‌పై ప్రభావం చూపించదు. అతడిని దగ్గుర్నుంచి చూసినవాడిగా చెబుతున్నా. భారత జట్టు కోసం ఏ ఫార్మాట్‌లోనైనా ఆడగలిగే సత్తా ఉన్నా బ్యాటర్. అతడికి గాయం సమస్య ఉంది. తన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన ఆటగాడు. కొందరు ఫామ్‌ కోల్పోతూ ఉంటారు. తప్పకుండా దేశవాళీలో ఆడతాడు. ఐపీఎల్‌లోనూ మంచి ప్రదర్శన చేస్తాడు. అతడిని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోసం తీసుకోకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం ఏంటో తెలియదు. శ్రేయస్‌కు కాంట్రాక్ట్‌ ఇస్తే బాగుండేది. మళ్లీ పోరాడి జట్టులోకి వస్తాడనే నమ్మకముంది’’ అని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) ప్రధాన కోచ్‌ చంద్రకాంత్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని