Sanju Samson: బుమ్రా తర్వాత.. అతడే అత్యుత్తమ బౌలర్‌: సంజూ శాంసన్‌

రాజస్థాన్‌కు రెండో క్వాలిఫయర్‌లో చుక్కెదురైంది. హైదరాబాద్‌ అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి ఐపీఎల్‌ 17వ సీజన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Published : 25 May 2024 09:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరును ఓడించింది. కీలకమైన రెండో క్వాలిఫయర్‌లో మాత్రం రాజస్థాన్‌ చేతులేత్తేసింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 176 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 139 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన ఆర్‌ఆర్‌ చివరికి తడబాటుకు గురైంది. తమ ఓటమికి కారణాలను రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్‌ (Sanju Samson) వెల్లడించాడు. ఆర్‌ఆర్‌ బౌలర్ సందీప్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫైనల్‌ మ్యాచ్‌ మరింత ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొన్నాడు. 

‘‘మా బౌలింగ్‌ పట్ల గర్వంగా ఉన్నా. తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లు చాలా శ్రమించి హైదరాబాద్‌ దూకుడును అడ్డుకోగలిగారు. బ్యాటింగ్‌లో స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాం. ఇక్కడే మేం మ్యాచ్‌ను కోల్పోయాం. తేమ ప్రభావం ఉంటుందని ఊహించాం. కానీ, అలా జరగలేదు. అదే వారికి అడ్వాంటేజ్‌ అయింది. లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్లు మా కుడి చేతివాటం బ్యాటర్లకు సరైన లెంగ్త్‌తో బంతులేశారు. రివర్స్‌ స్వీప్‌, క్రీజ్‌ను వదిలి ముందుకు రావడం చేస్తే బాగుండేది. ఈ సీజన్‌లో మేం చాలా అద్భుతమైన మ్యాచ్‌లు ఆడాం. రియాన్‌ పరాగ్, ధ్రువ్‌ జురెల్ వంటి కుర్రాళ్లు తమ సత్తా చాటారు. పరాగ్‌ తప్పకుండా భారత జట్టులోకి వస్తాడు. సీనియర్‌ బౌలర్ సందీప్ శర్మ మాకు పెద్ద అసెట్. అతడి గణాంకాలను చూస్తే బుమ్రా తర్వాత సందీప్‌ ఉంటాడు. 

చెపాక్‌లోనే ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. కోల్‌కతా - హైదరాబాద్‌ జట్లకు ఇక్కడి పరిస్థితిపై అవగాహన ఉంది. పవర్‌ప్లేలో ఈసారి ఎలాంటి స్కోరును చూస్తామో మరి. సన్‌రైజర్స్ బ్యాటర్లు చాలా దూకుడుగా ఆడుతున్నారు. కోల్‌కతా కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది. తప్పకుండా అద్భుత మ్యాచ్‌ అవుతుందని భావిస్తున్నా. గత 16 సీజన్లలోనూ మనం ఇలాంటి ఫైనల్స్‌ను చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా వాటికి ఏమాత్రం తగ్గకుండా మజా ఆస్వాదించే అవకాశం ఉంది.’’ అని సంజూ శాంసన్‌ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో సంజూ 11 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని