WI vs IND: విండీస్‌తో టెస్టు సిరీస్‌.. 21 ఏళ్ల జైత్రయాత్రను భారత్ కొనసాగించేనా..?

దాదాపు నెల రోజుల తర్వాత భారత్‌ ఆటగాళ్లు మైదానంలోకి దిగబోతున్నారు. రోహిత్ - రాహుల్ ద్రవిడ్‌ కాంబినేషన్‌లో విండీస్‌తో టెస్టు సిరీస్‌ (WI vs IND) ఆడేందుకు సిద్ధమైంది. ఇవాళ తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Updated : 12 Jul 2023 14:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దాదాపు నాలుగేళ్ల తర్వాత విండీస్‌ - భారత్ (WI vs IND) జట్ల మధ్య టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. చివరిసారిగా 2019లో విండీస్‌ పర్యటనకు టీమ్‌ఇండియా వెళ్లింది. గతేడాది భారత్‌కు విండీస్‌ వచ్చినా టెస్టు సిరీస్‌ ఆడలేదు. రోహిత్ శర్మ (Rohit sharma) నాయకత్వంలోని టీమ్‌ఇండియా (Team India) ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, గత 21 ఏళ్ల కాలంలో ఇరు దేశాల మధ్య ఎనిమిది సిరీస్‌లు జరిగాయి. అన్నింటినీ టీమ్‌ఇండియానే గెలుచుకోవడం గమనార్హం. చివరిసారిగా భారత్‌పై వెస్టిండీస్‌ 2001/2002 సీజన్‌లో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా విండీస్‌ గెలవలేకపోయింది.

ఇప్పటి వరకు ఇరు జట్లూ 98 టెస్టుల్లో తలపడగా విజయాల్లో భారత్ (22) కంటే విండీస్‌ (30) ఆధిపత్యంలో ఉంది. ఇక  కరేబియన్‌ మైదానంలో 51 మ్యాచుల్లో ఆడగా.. విండీస్‌ 16 విజయాలు, భారత్ 9 విజయాలను నమోదు చేసింది. మరో 26 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.  సిరీస్‌ల గణంకాల ప్రకారం..  విండీస్‌-భారత్‌ జట్ల మధ్య 24 టెస్టు సిరీస్‌లు జరిగాయి. ఇందులో 12 సిరీస్‌లను వెస్టిండీస్‌ సొంతం చేసుకోగా.. భారత్ 10 సిరీస్‌లను గెలుచుకుంది. మరో రెండు డ్రాగా ముగిశాయి. 2000వ సంవత్సరం ముందు వరకు విండీస్‌ ఆధిపత్యం ప్రపంచానికి తెలిసిందే. ఆ సమయంలో ఆ జట్టుపై విజయం సాధించడమంటే మాటలు కాదు. అయినా భారత్‌ రెండుసార్లు సిరీస్‌ను సొంతం చేసుకుంది. కానీ, 2002/2003 సీజన్‌ నుంచి విండీస్‌తో ఆడిన అన్ని సిరీస్‌లను భారత్‌  గెలుచుకుంది. 

గత ఐదు టెస్టు మ్యాచ్‌ల ఫలితాలు ఇలా.. 

  • ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో వేదికలో జరిగిన మ్యాచ్‌ (2016) డ్రాగా ముగిసింది. అదీ వర్షం కారణంగా మ్యాచ్‌ ఫలితం డ్రాకు దారితీసింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో గెలుచుకుంది.
  • హైదరాబాద్‌ వేదికగా 2018లో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
  • రాజ్‌కోట్‌లో (2018) జరిగిన మ్యాచ్‌లోనూ భారత్‌దే విజయం. విండీస్‌పై ఏకంగా ఇన్నింగ్స్‌ 272 పరుగుల భారీ తేడాతో గెలవడం విశేషం.
  • భారత్ - విండీస్‌ మధ్య (2019) జమైకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 257 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  • ఇదే ఏడాది (2019) అంటిగ్వా మైదానంలో జరిగిన మ్యాచ్‌లోనూ విండీస్‌పై భారత్‌ 318 పరుగుల భారీ తేడాతో గెలిచింది. 

అత్యధిక పరుగుల వీరులు

  • విండీస్‌ - భారత్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీసుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్ కావడం విశేషం. మొత్తం 27 మ్యాచుల్లోని 48 ఇన్నింగ్స్‌ల్లో 65.45 సగటుతో 2,749 పరుగులు చేశాడు. 
  • గావస్కర్‌ తర్వాత క్లైవ్‌లాయిడ్ 28 టెస్టుల్లో 44 ఇన్నింగ్స్‌ల్లో 2,344 పరుగులు చేశాడు. అతడి సగటు 58.60.
  • శివ్‌నారాయణ్‌ చంద్రపాల్ కూడా భారత్‌పై మంచి ఇన్నింగ్స్‌లే ఆడాడు. మొత్తం 25 టెస్టుల్లో 44 ఇన్నింగ్స్‌ల్లో 63.85 సగటుతో 2,171 పరుగులు చేశాడు. 
  • ప్రస్తుత భారత క్రికెట్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గతంలో విండీస్‌పైనా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. 23 టెస్టుల్లోని 38 ఇన్నింగ్స్‌ల్లో 63.80 సగటుతో 1,978 పరుగులు సాధించాడు. 
  • డేంజరస్‌ బ్యాటర్ వివియన్‌ రిచర్డ్స్‌ కూడా టెస్టుల్లోనూ అదరగొట్టాడు. భారత్‌పై 28 టెస్టుల్లో 41 ఇన్నింగ్స్‌ల్లో 50.71 సగటుతో 1,927 పరుగులు చేశాడు.

అత్యధిక వికెట్ల వీరులు

  • భారత దిగ్గజం కపిల్‌ దేవ్ 25 మ్యాచుల్లో 89 వికెట్లు పడగొట్టాడు. 
  • విండీస్‌ మాజీ పేసర్ మాల్కమ్ మార్షల్‌ 17 మ్యాచుల్లోనే 76 వికెట్లు తీసి భారత్‌ను బెంబేలెత్తించాడు. 
  • టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ అనిల్‌ కుంబ్లే కూడా విండీస్‌పై భారీగానే వికెట్లు తీశాడు. కేవలం 17 మ్యాచుల్లోనే 74 వికెట్లు పడగొట్టాడు. 
  • భారత బౌలర్ ఎస్‌ వెంకట్రాఘవన్‌ 23 మ్యాచుల్లో 68 వికెట్లు తీశాడు. 
  • విండీస్‌  ఆండీ రాబర్ట్స్‌ 14 మ్యాచుల్లో 67 వికెట్లు పడగొట్టాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని