Sachin: ఈ బర్త్‌డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్‌ విషెస్: సచిన్

భారత మాజీ క్రికెటర్ సచిన్‌ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్‌ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు.

Published : 24 Apr 2024 16:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) 51వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. మాస్టర్ బ్లాస్టర్‌గా క్రికెట్ అభిమానులను అలరించిన సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్‌, సెహ్వాగ్‌, రైనా విషెస్‌ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అయితే, అందరికంటే తనకు ముందు శుభాకాంక్షలు తెలిపిన వారి గురించి సచిన్‌ ప్రత్యేకంగా పోస్టు పెట్టడం విశేషం. తన సతీమణి అంజలితో కలిసి ‘సచిన్‌ తెందూల్కర్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో సచిన్‌ పాల్గొన్నాడు.

‘‘నా బర్త్‌డేను విభిన్నంగా చేసుకోవడం బాగుంది. ఫౌండేషన్‌ మద్దతుతో ఎదుగుతున్న చిన్నారుల మధ్య కేక్‌ కట్‌ చేయడం అద్భుతంగా భావిస్తున్నా. వారితో కలిసి ఫుట్‌బాల్‌ ఆడా. ఎన్నో స్టోరీలను పంచుకున్నా. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వీరే ఫస్ట్‌ అనుకుంటా. నిజంగా ఇలాంటి అనుభూతితో ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకంగా మారిపోయింది’’ అని సచిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసుకున్నాడు.

‘‘సచిన్‌ తెందూల్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచావు. బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సచిన్‌.. తన అద్భుతమైన ప్రవర్తనతో అభిమానుల మనసును దోచేశావు’’ - జైషా, బీసీసీఐ కార్యదర్శి

‘‘హ్యాపీ బర్త్‌డే సచిన్‌ పాజీ. మైదానంలో బంతిని ఉతికేయడం నుంచి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించడం వరకు.. నీ నుంచే స్ఫూర్తి పొందా. లైఫ్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నించా. ఆయురారోగ్యాలతో కొనసాగాలని కోరుకుంటున్నా’’ - యువ్‌రాజ్‌ సింగ్

‘‘దిగ్గజ క్రికెటర్‌గా కోట్ల మంది యువతకు ఆదర్శంగా నిలిచావు. మైదానంలో, ఆవల ప్రవర్తించిన తీరు మాకు మార్గదర్శం. ఇలాంటి పుట్టిన రోజులను మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. నీ అద్భుతమైన కవర్‌ డ్రైవ్‌లను మళ్లీ చూడాలనుంది’’ - సురేశ్‌ రైనా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని