IPL Highest Paid Players: రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్‌లో ఎప్పుడూ ఇదే కథ!

భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్‌ ప్లేయర్లు ఐపీఎల్‌లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. 

Published : 02 Apr 2024 14:36 IST

ఐపీఎల్‌ (IPL) వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు రాణించిన దాఖలాలు దాదాపు కనిపించవు. రేటు ఎక్కువ పలికిన ఆటగాడి మీద అందరి దృష్టీ ఉంటుంది. ఆ జట్టు అభిమానులు కూడా తన నుంచి ఎంతో ఆశిస్తారు. కానీ భారీ అంచనాల కారణంగానో లేక తన స్థాయికి మించి రేటు పలకడంతో ఒత్తిడి వల్లనో .. ఆ ఆటగాడు అందుకు తగ్గ ప్రదర్శన చేయడు! 

  • ఈ సీజ‌న్లో ఏకంగా రూ.24.75 కోట్ల‌తో రికార్డు రేటు ప‌లికాడు మిచెల్ స్టార్క్. అత‌ణ్ని కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొనుక్కుంది. ఐతే తొలి రెండు మ్యాచ్‌ల్లో స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయ‌లేదు. పైగా రెండు మ్యాచ్‌ల్లో క‌లిపి వంద ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. గ‌త సీజ‌న్ల‌లోనూ అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాళ్ల పరిస్థితి ఇంతే.
  • గత ఏడాది ఐపీఎల్‌లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ను ఏకంగా రూ.18.5 కోట్లు పెట్టి కొనుక్కుంది పంజాబ్‌ కింగ్స్‌. అప్పటికి అది లీగ్‌లో రికార్డు ధర. కానీ, అతను 14 మ్యాచ్‌లాడి 276 పరుగులే చేశాడు. బంతితోనూ పెద్దగా సత్తా చాటలేకపోయాడు. కేవలం 10 వికెట్లకు పరిమితమయ్యాడు. 
  • 2023 సీజన్లో రూ.17.5 కోట్లతో రెండో అత్యధిక ధర దక్కించుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ కూడా ముంబయి తరఫున ఓ మోస్తరు ప్రదర్శనే చేశాడు. 16 మ్యాచ్‌ల్లో 452 పరుగులు చేసిన అతను.. 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
  • 2022లో అత్యధికంగా రూ.15.25 కోట్లకు ముంబయి సొంతమైన ఇషాన్‌ కిషన్‌.. ఆ సీజన్లో 14 మ్యాచ్‌లాడి 418 పరుగులు చేశాడు. ఒకట్రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా మొత్తంగా నిరాశపరిచాడు. ఐపీఎల్‌ కెరీర్లో 135 స్ట్రైక్‌ రేట్‌తో పరుగులు చేసిన కిషన్‌ ఆ సీజన్లో 120 స్ట్రైక్‌ రేటే నమోదు చేశాడు.

  • 2021లో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌. అతడి కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టింది. అతడి స్థాయికి అది చాలా ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు తగ్గట్లే అతను సాధారణ ప్రదర్శన చేశాడు. ఆల్‌రౌండర్‌ పాత్రలో జట్టులోకి వచ్చిన అతను.. 11 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో బౌలింగ్‌ వరకు పర్వాలేదనిపించాడు కానీ.. బ్యాటుతో కేవలం 67 పరుగులే చేశాడు. ఆ సీజన్లో 9కి పైగా ఎకానమీ నమోదు చేయడం గమనార్హం.
  • 2020లో రికార్డు రేటు దక్కించుకుంది ప్యాట్‌ కమిన్స్‌. అతడి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.15.5 కోట్లు పెట్టింది. పొదుపుగా బౌలింగ్‌ చేశాడు కానీ.. ఎక్కువ వికెట్లు తీయలేదు. 14 మ్యాచ్‌ల్లో తీసింది 12 వికెట్లే. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేదు. 146 పరుగులే చేశాడు.
  • ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా.. అతడి కోసం వేలంలో ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. ఎప్పుడు వేలంలోకి వచ్చినా భారీ ధర పలికాడు. కానీ, ఒక్కసారీ ఆ రేటుకు న్యాయం చేయలేదు. గత ఏడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ అతడి కోసం ఏకంగా రూ.16.5 కోట్లు పెట్టింది. కానీ రెండే మ్యాచ్‌లాడి గాయంతో లీగ్‌కు దూరమయ్యాడు. 2017లో రూ.12.5 కోట్లకు కొన్న రాజస్థాన్‌ తరఫున 12 మ్యాచ్‌లాడి 316 పరుగులు చేసి, 12 వికెట్లు తీశాడు స్టోక్స్‌. తర్వాతి ఏడాది రైజింగ్‌ పుణె అతణ్ని రూ.14.5 కోట్లకు సొంతం చేసుకోగా.. 13 మ్యాచ్‌ల్లో 196 పరుగులు చేసి 8 వికెట్లే తీశాడు.
  • 2014 ఐపీఎల్‌లోనే ఏకంగా రూ.16 కోట్లు పలికి చరిత్ర సృష్టించిన ఆటగాడు యువ్‌రాజ్‌ సింగ్‌. ఆ సీజన్లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ అతడి కోసం అసాధారణ రేటు పెట్టింది. కానీ, అతను ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. 14 మ్యాచ్‌ల్లో 376 పరుగులే చేసి, 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. తర్వాతి సీజన్లో ఆర్సీబీ అతణ్ని రూ.14 కోట్లకు కొనుక్కుంది. ఆ జట్టు తరఫున అతను 248 పరుగులు చేసి, ఒక్క వికెట్టే తీశాడు.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని