MS Dhoni : అతడు డ్రగ్‌ లాంటి వాడు.. ఇప్పటి వరకూ పరిణతి సాధించలేదు : ధోనీ

కెప్టెన్‌ కూల్‌గా పేరుతెచ్చుకున్న ఎంఎస్‌ ధోనీ(MS Dhoni).. తన జట్టు సహచరులతో ఎప్పుడూ సరదాగా ఉంటాడు. అవసరమైన సూచనలు చేస్తూ వారిని రాటుదేలేలా చేస్తాడు.

Updated : 11 Jul 2023 17:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ(MS Dhoni)కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇక మహీని.. ఇతర జట్లలోని ఆటగాళ్లూ ఆరాధిస్తుంటారు. అతడి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ధోనీ కూడా వీలు చిక్కిన సమయంలో.. సలహాలు, సూచనలు చేస్తూ జూనియర్లను రాటుదేలేలా చేస్తాడు. దీపక్‌ చాహర్‌(Deepak Chahar) కూడా ధోనీ నేతృత్వంలోనే ఎదిగినవాడే. అతడి మార్గదర్శకత్వంలోనే జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇక చెన్నై జట్టులో చాహర్‌తో ధోనీకి మంచి అనుబంధం ఉంది.

ఇటీవల ధోనీ సినీ నిర్మాణ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. తన సొంత సినీ నిర్మాణ సంస్థపై (Dhoni Entertainment) రూపొందించిన తొలి చిత్రం ‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’ (LGM). ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహీ మాట్లాడుతూ.. దీపక్‌ చాహర్‌పై సరదా వ్యాఖ్యలు చేశాడు. అతడు ఓ ‘డ్రగ్‌’లాంటి వాడంటూ జోకులు వేశాడు.

‘‘దీపక్‌ చాహర్‌ ఓ ‘డ్రగ్‌’ లాంటివాడు. అతడు ఇక్కడ లేకపోతే.. ఎక్కడున్నాడని మీరు ఆలోచిస్తారు. ఒకవేళ అతడు ఇక్కడే ఉంటే.. ఎందుకు ఉన్నాడు? అని అనుకుంటారు. మంచి విషయం ఏంటంటే.. అతడు పరిణతి చెందడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ.. అందుకు ఎంతో సమయం పడుతుంది. అదే సమస్య. నా జీవిత కాలంతో అతడు పూర్తిగా పరిణతి సాధించినట్లు నేను చూడలేదు’ అని నవ్వూతూ మహీ అన్నాడు.

ఇక దీపక్‌ చాహర్‌ పుణె(Rising Pune Supergiant) జట్టుకు 2016లో ఆడుతున్న సమయంలో ధోనీ దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత చెన్నై జట్టులోకి వచ్చాడు. 2018 సీజన్‌లో చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లేమింగ్‌.. తనను ఆడించేందుకు ఇష్టపడకపోయినా.. ధోనీ ఎంతో నమ్మకం ఉంచాడని గతంలో చాహర్‌ చెప్పిన విషయం తెలిసిందే. అన్ని మ్యాచ్‌లు ఆడస్తానని చెప్పి తనకు ఎంతో భరోసాను కల్పించాడని తెలిపాడు. ఇక 2023(IPL 2023) సీజన్‌లో గాయాల కారణంగా చాహర్‌ పది మ్యాచ్‌లే ఆడాడు.. 13 వికెట్లు తీశాడు. ఇక ఈ సీజన్‌లో ధోనీ చెన్నై జట్టును అయిదో సారి విజేతగా నిలబెట్టి.. ఐపీఎల్‌ చరిత్రలో  ముంబయి రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని