Dhoni: సీఎస్‌కేలో చోటిస్తారా..? కమెడియన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన ధోని

‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’ (LGM) ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, ప్రముఖ కమెడియన్‌ యోగిబాబుకు మధ్య జరిగిన సంభాషణ ఆసక్తిగా మారింది.

Published : 11 Jul 2023 12:25 IST

చెన్నై: సీఎస్కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన సొంత సినీ నిర్మాణ సంస్థపై (Dhoni Entertainment) రూపొందించిన తొలి చిత్రం ‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’ (LGM). ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. మహేంద్ర సింగ్‌ ధోనికి తమిళ స్టార్‌ కమెడియన్‌ యోగి బాబు వీరాభిమాని అని తెలిసిన విషయమే. వీళ్లిద్దరి మధ్య ఆ ఈవెంట్‌లో జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’లో యోగిబాబు ఓ కీలకపాత్రలో నటించారు. ఆయన స్టేజ్‌పై మాట్లాడుతూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోకి తనను తీసుకోవాలని ధోనిని (Dhoni) కోరారు. దీనికి ధోనీ కూడా అంతే సరదాగా సమాధానం చెప్పారు. ‘‘మా ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) ఇటీవలే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాబట్టి ఆ స్థానం ఖాళీగానే ఉంది. నేను మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతాను. అయితే మీరు నిలకడగా ఆడాల్సి ఉంటుంది. కానీ, మీరేమో సినిమాలతో బిజీగా ఉంటారు కదా..! నేను మీకు ముందే చెబుతున్నాను. వాళ్లు మిమ్మల్ని గాయపరచాలని మాత్రమే బౌలింగ్‌ వేస్తారు’’ అని చెబుతూ నవ్వులు పూయించారు ధోని.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. హరీశ్‌ కల్యాణ్‌, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ ప్రేక్షకాదరణ పొందుతోంది. రమేష్‌ తమిళమణి (Ramesh Thamilmani) దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ధోనికి ఉన్న అభిమానుల్లో కమెడియన్‌ యోగిబాబు ఒకరు. ధోని గతంలో అతడి కోసం ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను గిఫ్ట్‌గా పంపిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ యోగిబాబు చేసిన ట్వీట్‌ అప్పట్లో వైరలైంది. ‘ఎంతో ఆనందంగా ఉంది. స్వయంగా ధోనినే తన బ్యాట్‌ను నాకోసం పంపాడు. ఎప్పటికీ దాచుకుంటాను. థ్యాంక్యూ సర్‌’ అంటూ ఈ కమెడియన్‌ తన ఆనందాన్ని తెలియజేశాడు. ఇప్పుడు వీరిద్దరి సంభాషణ మరోసారి నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని