IPL 2024 - Impact Rule: భారీ స్కోర్లకు ‘ఇంపాక్ట్‌’ రూలే కారణం కాదు: అశ్విన్

ప్రస్తుతం ఐపీఎల్‌లో అన్ని జట్లూ 12 మంది ప్లేయర్లతో ఆడుతున్నాయి. దానికి కారణం ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్ రూల్‌. అదనంగా ఒక బ్యాటర్ లేదా బౌలర్‌ను ఎంచుకొనే వెసులుబాటు ఉంటుంది.

Published : 23 May 2024 17:27 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో 250+ స్కోర్లు ఎనిమిదిసార్లు నమోదయ్యాయి. ఇప్పుడు 200 లక్ష్యమున్నా ప్రత్యర్థి జట్టు వెరవని పరిస్థితి. దానికి ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్‌ (Impact Player) నిబంధన కారణమని.. అదనంగా బ్యాటర్‌ వస్తాడనే కొందరి వాదన. దీనివల్ల ఆల్‌రౌండర్లకు సరైన న్యాయం జరగడం లేదని మరికొందరి అభిప్రాయం. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఇలాంటి రూల్‌పై సమీక్షించాలని సూచించాడు. అయితే, రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) మాత్రం విభిన్నంగా స్పందించడం విశేషం. కేవలం ‘ఇంపాక్ట్‌’ రూల్‌ వల్లే భారీ స్కోర్లు నమోదవుతున్నాయని అనుకోవడానికి లేదని వ్యాఖ్యానించాడు. బౌలర్లు కూడా తమ బ్యాటింగ్‌ నైపుణ్యంపై దృష్టి పెట్టాలని సూచించాడు. ఇదే సీజన్‌లో హైదరాబాద్‌ 287 పరుగుల స్కోరు చేసిన సంగతి తెలిసిందే. 

‘‘ఒకవేళ ఇంపాక్ట్ రూల్‌ నిబంధన లేకపోయినా ఇలా భారీ స్కోరు నమోదయ్యేదే. వ్యక్తిగతంగా నేను ఈ సీజన్‌లో గమనించిన అంశాలనే చెబుతున్నా. బ్యాటర్లు చాలా ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. పిచ్‌లు ఎక్కడైనా సరే ప్రామాణికంగానే తయారుచేస్తారు. అందుకే, భవిష్యత్తులో బౌలర్లూ బ్యాటింగ్‌ చేయడానికి సంసిద్ధం కావాల్సిఉంది. బౌలింగ్‌ ఎలా ఉన్నా సరే.. బ్యాటింగ్‌ చేసే అవసరం ఉండొచ్చు. అప్పుడే మనం అనుకునే దిశగా మ్యాచ్‌ సాగుతుంది’’ అని వ్యాఖ్యానించాడు. 

పరాగ్‌కు ఆ సత్తా ఉంది

‘‘జట్టులోకి కొత్తగా వచ్చిన కుర్రాళ్లకు తమ బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కల్పించాలి. రియాన్‌ 17 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చాడు. ప్రతీ సంవత్సరం పరిణితి సాధిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు తన పాత్ర ఏంటనే దానిపై క్లారిటీతో ఉన్నాడు. అతడి సత్తా విషయంలో ఎలాంటి అనుమానం లేదు. బెంగళూరుపై కవర్స్‌ మీదుగా కొట్టిన సిక్స్‌ను ఎక్కువమంది బ్యాటర్లు కొట్టలేరు. దేశవాళీలో అదరగొట్టిన అతడి టాలెంట్‌ను మరోసారి చూస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరతాడు’’ అని అశ్విన్‌ తెలిపాడు. ఈ సీజన్‌లో రియాన్‌ పరాగ్ (Riyan Parag) 567 పరుగులు సాధించి.. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని