ODI World Cup 2023: మెగా సమరంలో ఇంకెన్ని షాకులు చూడాలో...

ప్రపంచకప్‌ లాంటి వేదికల్లో పెద్ద జట్లకు చిన్న జట్లు షాక్‌లు ఇవ్వడం గతంలోనూ చూశాం. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒకటి జరిగింది. దీంతో ఇంకెన్ని జరుగుతాయో అని క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. 

Published : 16 Oct 2023 15:58 IST

ఏ ప్రపంచకప్‌లోనైనా కొన్ని ఫేవరెట్‌ జట్లు ఉంటాయి. కొన్ని డార్క్‌ హార్స్‌గా బరిలో దిగుతాయి. కొన్నిటి మీద అసలు అంచనాలే ఉండవు. మిగిలిన జట్లు పసి కూనలు. అయితే అంచనాలు లేని జట్లు ఒక్కోసారి అనూహ్య ప్రదర్శనతో ఫేవరెట్‌ జట్లకు షాకిస్తుంటాయి. ఇంగ్లాండ్‌పై అఫ్గానిస్థాన్‌ గెలుపు అలాంటిదే. అయితే అఫ్గానిస్థాన్‌ను పసికూన అనకపోయినా.. ఇంగ్లాండ్‌తో పోల్చుకుంటే ఆ జట్టు చాలా చిన్నదే. 

ఇలా ఆడిందేంటో!

ఇంగ్లాండ్‌ ఈ టోర్నీలో బరిలో దిగేటప్పుడే రికార్డులు చాలా బద్దలువుతాయనిపించింది. ఎందుకంటే ఆ జట్టు అంత బలంగా ఉంది. అలాంటిది ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోయి ఆశ్చర్యపరిచింది డిఫెండింగ్‌ ఛాంపియన్‌. తొలి మ్యాచ్‌లో బలమైన న్యూజిలాండ్‌ చేతిలో తలొంచడం పర్వాలేదు కానీ మరీ అఫ్గానిస్థాన్‌పై చేతులెత్తేడం డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు పెద్ద షాకే. ఈ ప్రపంచకప్‌లో బ్యాటర్లకు గొప్పగా సహకరించిన దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఏకంగా 400పైన పరుగులు చేసి టోర్నీలోనే అతి పెద్ద స్కోరుతో రికార్డు కూడా సాధించింది.

 శ్రీలంక కూడా తానేమి తక్కువ కాదన్నట్లు 300పైన స్కోరుతో అదరగొట్టింది. అఫ్గానిస్థాన్‌తో భారత్‌ ఇదే పిచ్‌పై ఆడి చెలరేగింది.  అలాంటి పిచ్‌పై అఫ్గాన్‌పై ఇంగ్లాండ్‌ ఆడితే ఎంతటి స్కోరు చేస్తుందో అని అనుకున్నారు. మొదట అఫ్గాన్‌ అద్భుతంగా ఆడి పోరాడే స్కోరు చేసింది. ఈ పిచ్‌పై 300 చేసినా తక్కువే అనుకుంటే ఇంగ్లాండ్‌ ఆటే ఆశ్చర్యపరిచింది. స్పిన్‌కు పడిపోయే అలవాటును కొనసాగించిన ఆ జట్టు 300కన్నా కింద ఉన్న లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. స్పిన్‌తో ముప్పేట దాడి చేసిన అఫ్గాన్‌.. ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టింది.

ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి కాదు

ప్రపంచకప్‌లో ఓ కూన చేతిలో కంగుతినడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి కాదు. అయితే భారత్‌ గడ్డపైనే ఆ జట్టు చిన్న జట్టు చేతిలో ఓడడమే విశేషం. 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లిష్‌ జట్టుకు ఐర్లాండ్‌ దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చింది. బెంగళూరులో జరిగిన ఆ పోరులో ఏకంగా 328 పరుగులు ఛేదించి ఐర్లాండ్‌ పెను సంచలనం సృష్టించింది. కెవిన్‌ ఓబ్రైన్‌ అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు. కప్‌ను డిఫెండ్‌ చేసుకోవడం కోసం బరిలో దిగిన ఇంగ్లాండ్‌కు తాజా ఓటమి పెద్ద కుదుపే. 1996 ప్రపంచకప్‌లో పసికూన కెన్యా చేతిలో రెండుసార్లు ఛాంపియన్‌ వెస్టిండీస్‌ ఓడడం, 2007లో పాకిస్థాన్‌ను ఐర్లాండ్‌ మట్టి కరిపించడం, 1999లో దక్షిణాఫ్రికాను జింబాబ్వే ఓడించడం, ఇదే కప్‌లో పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్‌ కంగుతినిపించడం ఇదే కోవకు వస్తాయి. 

మున్ముందు కూడా..

అఫ్గానిస్థాన్‌ ఒక స్థాయి జట్టుగానే ప్రపంచకప్‌ బరిలో దిగింది. అయితే దుర్భేద్యమైన ఇంగ్లాండ్‌ను ఓడిస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, శ్రీలంకపై గెలిచే సత్తా ఉందని ఆ జట్టుకు భావించారు. కానీ అఫ్గాన్‌ ఊహించిన దానికంటే ఎక్కువే సాధించింది. ఒకరకంగా ఆ జట్టు ఈ టోర్నీలో ఆడినందుకు లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. అంతేకాదు మిగిలిన జట్లకు కూడా అఫ్గాన్‌ గట్టి హెచ్చరికలు పంపింది. మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదైనా ఆశ్చర్యపడక్కర్లేదు. అదే జరిగితే టోర్నీ గమనమే మారే ఛాన్స్‌ ఉంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని