వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయా..?

ఈ సీజన్‌లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్‌ అవకాశాలకు దాదాపు దూరమైంది .

Updated : 22 Apr 2024 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి ఐపీఎల్‌ సీజన్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చడం బెంగళూరుకు అలవాటుగా మారింది. ఈ సారైతే.. జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట్లో ఏడు మ్యాచ్‌లు ఓడింది. ఆదివారం కోల్‌కతాతో చివరి బంతి వరకూ పోరాడినా.. ఒక్క పరుగు తేడాతో పరాజయం తప్పలేదు. దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగే తొలి జట్టుగా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక టాప్‌-4లో బెంగళూరు నిలవాలంటే అద్భుతాలే జరగాలి.

సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరు ఇప్పటి వరకూ ఆడిన 8 మ్యాచ్‌ల్లో.. కేవలం పంజాబ్‌పై మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున మిగిలింది. సాధారణంగా లీగ్‌లో 16 పాయింట్లు (8 విజయాలు) సాధించిన జట్లకు ప్లేఆఫ్స్‌ చేరేందుకు అవకాశముంటుంది. బెంగళూరు ఇంకా ఆడాల్సింది ఆరు మ్యాచ్‌లే. ఇందులో గెలిచినా 14 పాయింట్లే ఆ జట్టు ఖాతాలో చేరతాయి. అయితే.. రేసులో ఉన్న మిగిలిన జట్లు ఏవైనా చివరికి ఇదే పాయింట్లతో ఉంటే.. అప్పుడు బెంగళూరు ముందంజ వేసే అవకాశం ఉంటుంది. కానీ.. ఈ విషయంలో నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. అంటే.. తర్వాత మ్యాచ్‌ల్లో ఆర్సీబీ గెలవడమే కాదు.. భారీ తేడాతో ప్రత్యర్థులను చిత్తు చేయాల్సిందే. ప్రస్తుతం ఆ జట్టు రన్‌రేట్‌ మైనస్‌లో (-1.046) ఉండటం ప్రతికూలాంశం. ఇదే సమయంలో ఇతర జట్ల ఫలితాలూ తనకు అనుకూలంగా కలిసిరావాలి. అప్పుడే టాప్‌ 4లో నిలిచిందుకు డుప్లెసిస్‌ సేనకు అవకాశం ఉంటుంది.

ఆ జట్లతో సవాలే..

ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌, గుజరాత్‌, పంజాబ్‌, దిల్లీ, చెన్నైలతో తలపడనుంది. ఇందులో హైదరాబాద్‌ ఇప్పటికే రికార్డు స్థాయి స్కోరు నమోదు చేసి బెంగళూరుకు చుక్కలు చూపించింది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న చెన్నైను ఎదుర్కోవడమూ సవాలే. మిగతా జట్లను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయా జట్లను బెంగళూరు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.

అన్నీ సమస్యలే..

గతంలో ఎప్పుడూ ఎదుర్కోని పరిస్థితుల్లో బెంగళూరు చిక్కుకుంది. జట్టు నిండా స్టార్‌ బ్యాటర్లే ఉన్నప్పటికీ.. నిలకడలేమీతో ఇబ్బందిపడుతోంది. ఇక ఈ జట్టుకు అతిపెద్ద సమస్య బౌలింగ్. బంతితో ప్రత్యర్థిని నియంత్రించలేక ఆ జట్టు బౌలర్లు అత్యంత సాధారణంగా కనిపిస్తున్నారు. దీంతో ఆర్సీబీతో మ్యాచ్‌ అంటే చాలు.. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు విజయాల బాట పట్టి ఎలా పుంజుకుంటుందో చూడాలి. సిరాజ్‌ నాయకత్వంలోని బౌలింగ్ దళం రాణించాలి. తమ జట్టుకు అదృష్టమూ కలిసి రావాలని బెంగళూరు ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని