Royal Challengers Bengaluru: సెకండాఫ్‌లో బెంగళూరు దూకుడుకు ఈ 5 అంశాలే కారణమా?

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఢీకొట్టేందుకు బెంగళూరు సిద్ధమైంది. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం వెనుక ఎంతో పట్టుదల ఉంది.

Updated : 22 May 2024 13:30 IST

దెబ్బ తిన్న పులి రియాక్షన్‌ చూసుంటారు.. కానీ, దెబ్బ తిన్న సింహాల గుంపు రియాక్షన్‌ చూడకపోతే ఐపీఎల్‌లో బెంగళూరు ఆటను చూడండి అంటున్నారు ఆ జట్టు ఫ్యాన్స్‌. వాళ్లు అంటున్నారు అని కాదు కానీ.. పరాజయాల నుంచి ఆర్సీబీ బౌన్స్‌ బ్యాక్‌ ఏ రేంజిలో అయిందో మీరూ చూసే ఉంటారు. నాకౌట్‌లో పోరుకు ఆ జట్టు సిద్ధమవుతున్న సమయంలో డుప్లెసిస్‌ (కోహ్లీ) సేనకు సంబంధించి ఐదు అంశాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.

ఆ నెలలో ఒక్కటే: ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీకి తొలి గెలుపు మార్చి 25న వచ్చింది. ఆ తర్వాత నెల రోజులకు గానీ రెండో విక్టరీని నమోదు చేయలేకపోయింది. ఇక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రెండో విజయానికి ముందు జట్టు రన్‌రేట్‌ 9.73. ఆరు వరుస విజయాల తర్వాత అంటే ఇప్పుడు రన్‌రేట్‌ 11.03. సీజన్‌లో బెస్ట్‌ ఇదే. 

మిడిల్‌ ఓవర్లు : తొలి అర్ధ భాగంలో విరాట్ కోహ్లీ, ఫాప్‌ డుప్లెసిస్‌ జోడీపైనే అధిక భారం ఉండేది. మిడిలార్డర్‌ సరైన ప్రదర్శన చేయలేదు. అయితే, ఏప్రిల్ 25 నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు మిడిల్‌ ఓవర్లలో చేసిన పరుగుల రన్‌రేట్‌ 8.72 నుంచి 10.18కి పెరిగింది. ఈ సీజన్‌లో ఇది రెండో అత్యుత్తమ రన్‌రేట్. రజత్‌ పాటిదార్‌, విల్‌ జాక్స్‌, గ్రీన్ ఫామ్‌ను అందుకోవడమే దానికి కారణం. 

పవర్‌ ప్లేలో బెస్ట్ : ఈ సీజన్‌ మొదట్లో బెంగళూరు బౌలింగ్‌ను చూసి ‘ఎవరైనా బ్యాటర్ ఫామ్‌లోకి రావాలంటే ఆర్సీబీతో ఆడితే చాలు’ అనే జోక్‌లు వినిపించాయి. టోర్నీ ఆరంభమైన నెల తర్వాత.. ఒకప్పటి ఆర్సీబీ బౌలింగ్‌ ఇదేనా? అనే స్థాయికి మెరుగైంది. సీజన్‌ తొలి అర్ధభాగంలో పవర్‌ ప్లే ఓవర్లలో కేవలం 7 వికెట్లను మాత్రమే పడగొట్టిన ఆర్సీబీ.. ఆ తర్వాత ఆరు మ్యాచుల్లో 16 వికెట్లు కూల్చడం విశేషం. మరోవైపు ఎకానమీ రేటును 10.79 నుంచి 8.72కే పరిమితం చేసింది. 

పేసర్ల దూకుడు: తొలి అర్ధ భాగంలో సిరాజ్, అల్జారీ జోసెఫ్, రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్‌ బౌలింగ్‌ను బాదని బ్యాటర్‌ లేడు. ఎంత వేగంగా బంతి వేస్తే.. అంతకు రెట్టింపు స్పీడ్‌తో అది బౌండరీ దాటేది. తొలి ఎనిమిది మ్యాచుల్లో 34 వికెట్లను పడగొట్టిన పేసర్లు.. చివరి ఆరింట్లో 28 వికెట్లు తీశారు. ఎకానమీ రేటులోనూ బౌలర్లు అదరగొట్టేశారు. 10.66 నుంచి 8.79కి వచ్చింది.

అత్యుత్తమ బ్యాటింగ్‌: హైదరాబాద్‌, కోల్‌కతా తర్వాత ఆ స్థాయిలో భారీ ఇన్నింగ్స్‌లు ఆడింది ఆర్సీబీనే. లీగ్‌ స్టేజ్‌లో మొత్తంగా 2,758 పరుగులు చేసింది. హైదరాబాద్‌ (2,764) కంటే కేవలం ఆరు పరుగులే తక్కువ. బౌండరీల రూపంలో అత్యధికంగా రన్స్‌ చేసిన జట్టు ఆర్సీబీనే. మొత్తం 1,806 పరుగులు ఈ రకంగా వచ్చినవే. సన్‌రైజర్స్ (1,768) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. 

- ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని