Rohit Sharma: కెప్టెన్సీ లేని రోహిత్‌.. కోహ్లీలా రెచ్చిపోతాడా?

రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఈ ఐపీఎల్‌ (IPL 2024) సీజన్‌లో కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేని అతడు.. తిరిగి బ్యాటింగ్‌లో ఒకప్పటి దూకుడును ప్రదర్శించాలని అభిమానులు కోరుతున్నారు.

Updated : 15 Mar 2024 11:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐపీఎల్‌ మెగా సమరం.. క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న 17వ సీజన్‌ (IPL 2024)లో అందరి దృష్టి ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)పైనే ఉంది. ఆ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఈసారి హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) కెప్టెన్సీలో ఆడనుండటమే కారణం. మరి కెప్టెన్సీ లేని రోహిత్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు? మునుపటి కంటే మెరుగైన ప్రదర్శన అతడి బ్యాటింగ్‌లో చూస్తామా?

కొత్త పాత్రలో రోహిత్‌..

గుజరాత్‌ నుంచి ముంబయికి హార్దిక్‌ పాండ్య తిరిగి రావడం.. ఆ తర్వాత జట్టు పగ్గాలు రోహిత్‌ నుంచి అతడికి అప్పగించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఐపీఎల్‌లో ముంబయిని తిరుగులేని జట్టుగా నిలబెట్టిన రోహిత్‌ను ఇలా తప్పించడంపై అప్పట్లో అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ కొత్త పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుత సీజన్‌లో పాండ్య కెప్టెన్సీలో అతడు ఆడాలి. గత కొంతకాలంగా  లీగ్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా రాణించని హిట్‌మ్యాన్‌.. తనదైన దూకుడును ప్రదర్శించాలని అభిమానులు కోరుతున్నారు. భారీ సిక్సర్లతో శర్మ విరుచుకుపడి శతకాల మోత మోగించాలని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. 

తగ్గిన ప్రదర్శన..

ముంబయి ఇండియన్స్‌ 2020వ సీజన్‌లో చివరిసారిగా టైటిల్‌ నెగ్గింది. ఆ తర్వాత ఆ జట్టు ప్రదర్శన ఆశించిన విధంగా లేదు. 2021 సీజన్‌లో ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరలేదు. ఆ తర్వాత ఏడాదైతే.. ఘోర ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో నిచిలింది. గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌నకు చేరినా రాణించలేదు. రోహిత్‌.. బ్యాట్‌తో ఆకట్టుకుందీ లేదు. గత సీజన్‌లో.. 16 మ్యాచ్‌లు ఆడి మొత్తం 332 పరుగులే చేసి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 28వ స్థానంలో నిలవడం గమనార్హం. 2022 సీజన్‌లో మొత్తం పరుగులు 268. కెప్టెన్సీ బాధ్యతలు, ఇతర ఆటగాళ్లు రాణించకపోవడం లాంటి సమస్యల వల్ల బ్యాటింగ్‌పై కూడా ప్రభావం పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

వేలంలో బ్లాక్‌బస్టర్‌ కొట్టారు... మరి ఆటలో?

కోహ్లీలా దూకుడు ప్రదర్శిస్తాడా..

కోహ్లీ గతంలో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు వదిలేశాడు. 2022 నుంచి ఆ జట్టుకు ఫాఫ్‌ డు ప్లెసిస్‌ కొత్త సారథిగా వచ్చాడు. అప్పటి నుంచి బ్యాటింగ్‌లో స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. వన్డేలు, టీ20ల్లో మునుపటి ఫామ్‌ అందిపుచ్చుకున్న విరాట్‌.. అదే జోరులో గత ఐపీఎల్‌లో చెలరేగి ఆడాడు. 14 మ్యాచ్‌లు ఆడి మొత్తం 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు.. ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవనప్పటికీ.. భారీ అభిమానగణం ఉన్న టీమ్‌గా నిలిచిందంటే దానికి కారణం కోహ్లీనే.

ప్రస్తుతం రోహిత్‌కూ కెప్టెన్సీ బాధ్యతలు లేవు. దీంతో బ్యాటింగ్‌లో ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఈ నేపథ్యంలో రోహిత్‌ను కోహ్లీతో పోల్చుతూ బ్యాటింగ్‌లో ఒకప్పటి దూకుడు చూపించాలని అభిమానులు కోరుతున్నారు. మరోసారి జట్టుకు టైటిల్‌ అందించడంలో రోహిత్‌ కీలకపాత్ర పోషించి తన సత్తా ఏంటో చూపించాలని ఆశిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్‌నకు రోహితే కెప్టెన్‌ అని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో సత్తా చాటితే మరింత ఆత్మవిశ్వాసంతో పొట్టి కప్‌లో రాణించేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు పాండ్యకు బ్యాటింగ్‌ పరంగా, మైదానంలో ప్రోత్సాహం పరంగా.. సపోర్టు చేస్తూ ముంబయికి మరో మంచి కెప్టెన్‌ను అందించేవాడిలా రోహిత్‌ నిలవాలని ముంబయి ఇండియన్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని