IPL 2024: వేలంలో బ్లాక్‌బస్టర్‌ కొట్టారు... మరి ఆటలో?

ఐపీఎల్‌ మినీ వేలంలో భారీ ధరను సొంతం చేసుకున్న ఆటగాళ్లు ఎలా ఆడతారనేది అందరిలోనూ ఉత్కంఠ ఉంటుంది. మరి వారి రీసెంట్ ఫామ్‌పై ఓ లుక్కేద్దాం..

Updated : 13 Mar 2024 16:37 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. మరో పది రోజుల్లో లీగ్‌ జోష్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. దీంతో ఇటీవల వేలంలో అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంటుంది. ఆ క్రికెటర్ల ప్రస్తుత ఫామ్‌ ఎలా ఉంది అనేది ఓసారి చూద్దాం!


మిచెల్ స్టార్క్‌ (రూ.24.75 కోట్లు)

ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) భారీ మొత్తం వెచ్చించి దక్కించుకుంది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఈసారి కేకేఆర్‌ అమ్ములపొదిలో కీలకాస్త్రంగా మారతాడని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. స్టార్క్‌ తాజా ఫామ్‌ను చూస్తే.. గొప్పగా ఏమీ లేదు. కివీస్‌తో టీ20 సిరీస్‌ మూడు మ్యాచుల్లో రెండింట్లోనే ఆడాడు. కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. పరుగులు కూడా భారీగానే ఇచ్చాడు. రెండు టెస్టుల్లో ఐదు వికెట్లే తీశాడు. అయితే, ఈ ఆసీస్‌ పేసర్‌ను తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే అనూహ్యంగా చెలరేగిపోయే అలవాటు ఉన్నవాడు మరి.


ప్యాట్ కమిన్స్ (రూ. 20.50 కోట్లు)

భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌... ప్యాట్ కమిన్స్‌ను సారథిగా నియమించింది. ఐడెన్‌ మార్‌క్రమ్‌ స్థానంలో అతడికి అవకాశం కల్పించింది. గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో ఆసీస్‌ను విజేతగా నిలపడంలో కమిన్స్‌ సారథ్యానికి కీలక పాత్ర.  బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆసీస్‌కు అండగా నిలిచాడు. కివీస్‌తో రెండో టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆసీస్‌ విజయం సాధించడంలో కమిన్స్‌ ప్రత్యేకంగా నిలిచాడు. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసిన కమిన్స్.. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 55 అతి ముఖ్యమైన పరుగులు చేశాడు. మామూలుగానే లోయర్‌ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేయడంలో కమిన్స్‌ దిట్ట. 


డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు)

చెన్నై సూపర్ కింగ్స్‌ సాధారణంగా పెద్ద స్టార్ల కోసం భారీగా ఖర్చు చేయదు. యువ క్రికెటర్లతోనే అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంటుంది. అయితే కివీస్‌ ప్లేయర్ డారిల్ మిచెల్‌ కోసం రూ.14 కోట్లు వెచ్చించింది. వన్డే ప్రపంచకప్‌లో మిడిలార్డర్‌లో మిచెల్‌ దూకుడు చూసి సీఎస్‌కే యాజమాన్యం మొగ్గు చూపి ఉంటుంది. మరి మిచెల్‌ను కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎలా వినియోగించుకుంటాడనేది ఆసక్తికరం. ప్రస్తుతం అతడి ఫామ్‌ గురించి తెలియాలంటే ఆసీస్‌ టెస్టు సిరీస్‌ను పరిశీలించాలి. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో డారిల్ ఆడలేదు. రెండు టెస్టుల్లో 111 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక అర్ధ శతకం ఉంది. అంతకుముందు దక్షిణాఫ్రికాతో టెస్టులోనూ పెద్దగా రాణించలేదు. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ చేశాడు. 


హర్షల్‌ పటేల్ (రూ. 11.75 కోట్లు)

ఐపీఎల్ 2021 సీజన్‌లో టాప్‌ వికెట్‌ టేకర్ హర్షల్‌ పటేల్‌. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున బరిలోకి దిగి 15 మ్యాచుల్లో 32 వికెట్లు పడగొట్టాడు. మరుసటి ఎడిషన్‌లో 15 మ్యాచుల్లో 19 వికెట్లే తీయగలిగాడు. గతేడాది హర్షల్‌ ప్రదర్శన ఇంకా పడిపోయింది. 14 మ్యాచులకుగాను 14 వికెట్లే పడగొట్టాడు. దీంతో అతడిని ఆర్‌సీబీ రిలీజ్‌ చేసింది. అనూహ్యంగా పంజాబ్‌ కింగ్స్‌ రూ.11.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిందీ లేదు. రంజీ ట్రోఫీలో హరియాణా తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడిన హర్షల్.. 7 వికెట్లు తీశాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో రాజస్థాన్‌పై 9 ఓవర్లు వేసిన హర్షల్‌ 47 పరుగులకు 3 వికెట్లు తీశాడు. 


అల్జారీ జోసెఫ్‌ (రూ. 11.50 కోట్లు)

నాణ్యమైన పేసర్ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అల్జారీ జోసెఫ్‌ రూ.11.50 కోట్లు వెచ్చించింది. ఇటీవల ఆసిస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచుల్లో 7 వికెట్లు తీశాడు. రెండు వన్డేల్లో 3 వికెట్లు, మూడు టీ20ల్లో 3 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్‌లో 12 ఓవర్లు వేసిన అల్జారీ జోసెఫ్‌ 115 పరుగులు ఇచ్చాడు. గతేడాది వరల్డ్‌ కప్‌ తర్వాత ఇంగ్లాండ్‌తో విండీస్‌ ఐదు టీ20ల సిరీస్‌ ఆడింది. మూడు మ్యాచ్‌లు ఆడిన జోసెఫ్‌ 6 వికెట్లు తీసి 143 పరుగులు ఇచ్చాడు. ఒక మ్యాచ్‌లో వికెట్‌ లేకుండానే 50 రన్స్‌ ఇవ్వడం గమనార్హం. వైవిధ్యంగా బంతులను సంధించే అల్జారీ జోసెఫ్‌కు వేగం అదనపు ప్రత్యేకత. మరి ఐపీఎల్‌లో ఫామ్‌ ఏమన్నా దొరకబుచ్చుకుంటాడేమో చూడాలి.


స్పెన్సర్ జాన్‌సన్ (రూ. 10 కోట్లు)

అంతర్జాతీయ కెరీర్‌లో ఆసీస్‌ తరఫున ఇప్పటివరకు ఒకేఒక్క వన్డే మ్యాచ్‌ ఆడాడు స్పెన్సర్‌ జాన్సన్‌. అదీనూ టీమ్‌ఇండియాపై గతేడాది సెప్టెంబర్‌లో అరంగేట్రం చేశాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. ఐదు టీ20ల్లో 6 వికెట్లు తీశాడు. అలాంటి యువ క్రికెటర్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ.10 కోట్లు పెట్టి తీసుకుంది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన జాన్‌సెన్ 21 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 7/47. బిగ్‌బాస్‌ లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్‌లో సిడ్నీ సిక్సర్‌పై నాలుగు వికెట్లు (4/26) తీసి సంచలన స్పెల్‌ విసిరాడు. ఇప్పటివరకు టీ20ల్లో 32 మ్యాచుల్లో 39 వికెట్లు తీశాడు. ఇదే అతడు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టేందుకు మార్గమైంది. 


- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని