Pat Cummins: ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ బోణీ కొట్టింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని చిత్తు చేసింది.

Published : 28 Mar 2024 08:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఉప్పల్ స్టేడియం సిక్సర్లతో తడిసిపోయింది. ఐపీఎల్‌ చరిత్రలోనే రికార్డు స్థాయి పరుగుల సునామీ సన్‌రైజర్స్‌ సృష్టించింది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ 277/3 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి 246/5కే పరిమితమైంది. ఒక దశలో విజయం సాధించేలా ముంబయి కనిపించినా.. హైదరాబాద్‌ బౌలర్లు సరైన సమయంలో అడ్డుకట్ట వేయగలిగారు. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిన ఉప్పల్‌ పిచ్‌పై భారీ స్కోరును ముంబయి ఛేదించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు హైదరాబాద్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 

‘‘ఇది క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్. రెండు జట్లూ విజయం కోసం పోరాడాయి. ముంబయి ఛేజ్ చేస్తుందా? అంటే మాత్రం అంగీకరించను. మేం మెరుగైన బౌలింగ్‌ చేశాం. కొన్ని బౌండరీలను ప్రత్యర్థి బ్యాటర్లు బాదినా మా ప్రణాళికల్లో మార్పులు లేకుండా అమలు చేశాం. ఆఫ్ కట్టర్స్‌ సంధించడం వర్కౌట్‌ అయింది. యువ ఆటగాడు అభిషేక్ శర్మ స్వేచ్ఛగా ఆడేస్తాడు. ఐపీఎల్‌లో బ్యాటింగ్‌ చేయడమంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కానీ, అతడిలో అదేమీ కనిపించదు. మేం 270+ కొట్టాలనే లక్ష్యంతో ఈ మ్యాచ్‌ బరిలోకి దిగలేదు. సానుకూల దృక్పథంతో ఆడి మెరుగైన లక్ష్యం నిర్దేశించాలని భావించాం. ఇంపాక్ట్‌ రూల్‌ వల్ల అదనంగా మరొక బ్యాటర్‌ను ఆడించాం. పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది’’ అని కమిన్స్‌ వ్యాఖ్యానించాడు. 

హెడ్‌ నాకిష్టమైన ఆటగాడు: అభిషేక్ శర్మ

‘‘దేశవాళీ క్రికెట్‌లో ఆడటం వల్ల నా ప్రదర్శనపై మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. మా జట్టులో చాలా మంది పంజాబీ కుర్రాళ్లం ఉన్నాం. మేనేజ్‌మెంట్ నుంచి బ్యాటర్లకు అందిన సూచనలు కూడా కీలకంగా పనిచేశాయి. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మా ఆటతీరును ప్రదర్శించాం. ట్రావిస్‌ హెడ్‌ నాకిష్టమైన క్రికెటర్లలో ఒకరు. అతడి బ్యాటింగ్‌ను చూస్తుంటే అద్భుతమనిపించింది. హెడ్‌తో కలిసి ఆడటాన్ని ఆస్వాదించా. మ్యాచ్‌కు ముందు రోజు బ్రియాన్‌ లారాతో మాట్లాడే అవకాశం దక్కింది. బ్యాటింగ్‌ విషయంలో అతడి సూచనలు సాయంగా నిలిచాయి. నేను బ్యాటింగ్‌ కంటే బౌలింగ్‌ చేయడాన్ని మరింతగా ఆస్వాదిస్తా. బంతితోనూ రాణించగలననే నమ్మకం నాకుంది’’ అని అభిషేక్ శర్మ తెలిపాడు. కేవలం 23 బంతుల్లోనే 63 పరుగులు చేసిన అభిషేక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 16 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని