Hyderabad: ఛేజింగ్‌కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?

హైదరాబాద్‌లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

Published : 29 Apr 2024 13:31 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. గత రెండేళ్ల ప్రదర్శన చూసిన తర్వాత ఈ జట్టుపై పెద్దగా అంచనాల్లేవు. కానీ, అనూహ్యంగా ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరు రికార్డు రెండుసార్లు బద్ధలు కొట్టింది. పాయింట్ల పట్టికలో టాప్‌ - 4లో కొనసాగుతోంది. అయితే, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో తమ జట్టు ఛేజింగ్‌కి వస్తే హైదరా‘బాధ’ తప్పదా అని ఫ్యాన్స్‌ నిట్టూరుస్తున్నారు.

ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌లో (IPL 2024) హైదరాబాద్‌ 200+ స్కోర్లు నాలుగు సార్లు చేసింది. మెగా లీగ్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టూ ఇదే. బెంగళూరుపై ఏకంగా 287 పరుగులు చేసేసి రికార్డులు బద్ధలుకొట్టింది.  ఇవి ఆ టీమ్‌ బ్యాటర్ల ఫామ్‌ను తెలియజేస్తున్నారు. అలాంటి టీమ్‌ 207.. 213 పరుగుల లక్ష్యాలను ఛేదించలేకపోయింది అంటే ఎవరైనా నమ్ముతారా? తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతో ఆడినప్పుడు 209 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు చివరి వరకూ పోరాడింది. కేవలం నాలుగు రన్స్‌ తేడాతో ఓడింది. గత రెండు మ్యాచుల్లో అయితే విజయానికి చేరువగా కూడా రాలేదు. ఈ మూడు మ్యాచుల్లోనూ టాప్‌ ఆర్డర్‌లోని ముగ్గురు బ్యాటర్లు సరైన ప్రదర్శన ఇవ్వకపోవడం గమనార్హం. 

బ్యాటింగ్ త్రయం విఫలం.. 

హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) భారీ స్కోర్లు చేయడంలో ముగ్గురు బ్యాటర్లు ప్రధాన పాత్ర పోషించారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ దూకుడు ఆడి ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించారు. తొలి బంతి నుంచే వీరబాదుడుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.  ఆ తర్వాత క్లాసెన్ పతాక స్థాయికి తీసుకెళ్లేవాడు. ఈ మెరుపులన్నీ మొదట బ్యాటింగ్‌ చేసినప్పుడే అనే విషయం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయమంటే ఎగిరెగిరి షాట్లు కొట్టిన బ్యాటింగ్‌ త్రయం.. ఛేజింగ్‌ అనేసరికి చిత్తవుతున్నారు. నితీశ్ రెడ్డి, ఐదెన్ మార్‌క్రమ్‌, అబ్దుల్‌ సమద్ పరిస్థితీ ఇంతే. 

కుర్రాళ్లు సంగతేంటి?

ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి కొన్ని మ్యాచుల్లో ఆకట్టుకున్నాడు. టాప్‌ బ్యాటర్లు ఇచ్చిన అద్భుత ఆరంభాలను ముందుకు తీసుకెళ్లాడు. అబ్దుల్ సమద్‌ కూడా తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు ధనాధన్‌ షాట్లతో అలరించాడు. వీరిద్దరూ లక్ష్య ఛేదనలో మాత్రం ప్రత్యర్థి బౌలర్ల ఉచ్చులో పడిపోతున్నారు. షహబాజ్‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. సరిపోవడం లేదు. సీనియర్ ఆటగాడు ఐదెన్ మార్‌క్రమ్‌ (7, 32) జట్టును గెలిపించడంలో విఫలమవుతున్నాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనప్పుడు మిడిలార్డర్ బాధ్యతగా టీమ్‌ను విజయతీరాలకు చేర్చాలి. కానీ, ఇదే ఇక్కడ మిస్‌ అవుతోంది. మిగిలిన ఐదు మ్యాచుల్లోనూ గెలిస్తేనే హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్‌ అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి. 

బౌలర్లూ సహకరించాలి.. 

తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు హైదరాబాద్‌ భారీ స్కోర్లు చేస్తుండటంతో బౌలర్లపై పెద్దగా ఒత్తిడి ఉండటం లేదు. 287 కొట్టినప్పుడు ప్రత్యర్థి జట్టు 265 పరుగులు చేసింది. ఇక 277 స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి బంతి వరకూ లేదు. ఎట్టకేలకు విజయాలు సాధించినా బౌలర్లు విఫలం కావడం ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ సీజన్‌లో భారీగా పరుగులు సమర్పిస్తున్న బౌలర్ల జాబితాలో హైదరాబాద్‌ ప్లేయర్లూ ఉన్నారు. ఫస్ట్‌ బౌలింగ్‌ చేసినప్పుడు పెద్దగా మంచు ప్రభావం ఉండదు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ, హైదరాబాద్‌ బౌలర్లు మాత్రం గత రెండు మ్యాచుల్లో ధారాళంగా పరుగులు ఇచ్చేశారు.స్పీడ్‌ ఎంత ముఖ్యమో.. బ్యాటర్, పిచ్‌ను బట్టి స్లో డెలివరీలు, ఆఫ్‌ కట్టర్‌లను సంధించాల్సిన అవసరం ఉంది.

డేనియల్‌ మాట్లాడలేదా? 

బెంగళూరు మ్యాచు ఓడిపోయాక... హైదరాబాద్‌ టీమ్‌ ఎలాంటి హోం వర్క్‌ చేయలేదని చెన్నైతో మ్యాచ్‌ చూశాక అర్థమవుతోంది. 25న ఆర్సీబీతో మ్యాచ్‌ అనంతరం కమిన్స్‌ మాట్లాడుతూ ‘గెలిస్తే నేను మాట్లాడతా... ఓడిపోతే  కోచ్ డేనియల్‌ వెటోరీ మాట్లాడతాడు’ అని అన్నాడు. దీంతో వెటోరీ ఏమీ మాట్లాడలేదా? లేక డ్రెస్సింగ్‌ రూమ్‌లో అదో సాధారణ ఓటమి అనుకున్నారా? అనేది తెలియడం లేదు. ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారుతున్న ఈ సమయంలో ఈ  వరుస ఓటములను పట్టించుకోకపోతే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని