heinrich klaasen: హెన్రిచ్‌ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు

ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్‌ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. 

Updated : 29 Mar 2024 12:14 IST

హెన్రిచ్‌ క్లాసెన్‌.. ఐపీఎల్‌-17లో ఈ పేరు మార్మోగుతోందిప్పుడు. అతడాడిన రెండు ఇన్నింగ్స్‌లు అలాంటివి మరి. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యుత్తమ స్ట్రైక్‌ రేట్‌ కలిగిన బ్యాటర్లలో అతడు ఒకడు. అలాంటి ఆటగాడిని గత సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేజిక్కించుకుని జాక్‌పాట్‌ కొట్టింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను గెలుపు అంచుల వరకు తీసుకెళ్లిన క్లాసెన్‌.. రెండో మ్యాచ్‌లో విశ్వరూపమే చూపించాడు. కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన క్లాసెన్‌.. ముంబయి ఇండియన్స్‌పై అజేయంగా 34 బంతుల్లోనే 80 పరుగులు సాధించి ఐపీఎల్‌ చరిత్రలోనే సన్‌రైజర్స్‌ అత్యధిక స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 

2018లోనే మొదలైనా..

నిజానికి 2018లోనే క్లాసెన్‌ ఐపీఎల్‌ ప్రయాణం ఆరంభమైంది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ను కనీస ధర రూ.50 లక్షలకే కొనుక్కుంది. స్టీవ్‌ స్మిత్‌ స్థానంలో అప్పుడు ఈ జట్టులోకి వచ్చాడు. అరంగేట్ర సీజన్లో ఈ దక్షిణాఫ్రికా స్టార్‌ పెద్దగా రాణించలేకపోయాడు. 4 మ్యాచ్‌లే ఆడి 57 పరుగులు చేశాడు. ఆ తర్వాతి ఏడాదే రాజస్థాన్‌ అతడిని వదిలేసింది. వెంటనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దక్కించుకుంది. 2019  ఐపీఎల్‌ సీజన్లో 3  మ్యాచ్‌ల్లో 9 పరుగులే సాధించి దారుణ ప్రదర్శన చేశాడీ బ్యాటర్‌. దీంతో ఐపీఎల్‌లో అతడి కథ ముగిసినట్లే కనిపించింది. దీనికి తోడు కరోనా మహమ్మారి కూడా రావడంతో ఓ టోర్నీ పూర్తిగా జరగలేదు. ఈ విరామంలోనే ఆర్సీబీ జట్టు క్లాసెన్‌ను విడిచిపెట్టింది. ఆ తర్వాత మూడేళ్లు క్లాసెన్‌ మళ్లీ ఐపీఎల్‌లో కనిపించలేదు. ఈ సఫారీ బ్యాటర్‌ను ఏ ఫ్రాంఛైజీ తీసుకోదేమో అనిపించింది. కానీ 2023 వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్లాసెన్‌ను ఏకంగా రూ.5.25 కోట్లు పెట్టి కొనుక్కుంది. అతడికి ఇంత డబ్బా అన్నవాళ్లూ ఉన్నారు. ఈ డబ్బులుకు న్యాయం చేస్తూ క్లాసెన్‌ చెలరేగుతున్నాడు. బ్యాటింగ్‌లోనూ కాదు కీపింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. గతంలో ఐపీఎల్‌లో ఆడిన ఆటకు ఇప్పటికి సంబంధమే లేదు. బౌలర్‌ ఎవరనేది చూడట్లేదు. బాదుడే బాదుడు. 

గత ఐపీఎల్‌లోనూ..

2023 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ సత్తా చాటకపోయినా క్లాసెన్‌ తన మార్కు చూపించాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో 51 బంతుల్లోనే సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ఈ సీజన్లో 12 మ్యాచ్‌ల్లో 448 పరుగులు చేసి సత్తా చాటాడు. సన్‌రైజర్స్‌ తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. తాజా సీజన్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో రెండు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అదరగొట్టాడు. సాధారణంగా విదేశీ బ్యాటర్లు స్పిన్‌ ఎదుర్కోవడంలో తడబడతారు. కానీ క్లాసెన్‌ రూటే సపరేటు. స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు అతడి ఫుట్‌వర్క్, షాట్‌ సెలక్షన్‌ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఉపఖండ బ్యాటర్ల మాదిరిగా ఏమాత్రం తడబాటు లేకుండా స్పిన్నర్లను ఎదుర్కొంటాడు క్లాసెన్‌. క్రీజులో ముందుకు కదులుతూ బంతి లెంగ్త్‌ను కచ్చితంగా అందుకోవడం క్లాసెన్‌ ప్రత్యేకత. ఈ లక్షణాలే స్లోగా ఉండే భారత పిచ్‌లపై అతడిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. విదేశీ బ్యాటర్లు స్పిన్‌ బుట్టలో పడితే.. అతడు మాత్రం స్పిన్‌ వస్తే చాలు పండగ చేసుకుంటాడు. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి సిక్స్‌లు బాదేస్తాడు. క్లాసెన్‌ స్పిన్నర్లను చదివినట్లుగా ప్రస్తుత తరం బ్యాటర్లు ఎవరూ చదవరు. లెంగ్త్‌ను బాగా పసిగట్టి దానికి తగ్గ షాట్లను సిద్ధం చేసుకుంటాడతను. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ తానేంటో శాంపిల్‌ చూపించాడు. మున్ముందు కూడా ఈ స్టార్‌ ఇలాగే ఆడితే హైదరాబాద్‌కు ఇక ఎదురుండదు.

-ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని