Hyderabad Vs Chennai: హైదరాబాద్‌లో హవా ఎవరిది? కమిన్స్‌ టీమ్‌దా? ధోనీ శిష్యులదా?

ఉప్పల్‌ స్టేడియం వేదికగా చెన్నైతో తలపడేందుకు హైదరాబాద్‌ సిద్ధమైంది. కానీ, ఇక్కడ అందరి చూపు ఎంఎస్ ధోనీపైనే ఉందనడంలో సందేహం లేదు.

Updated : 05 Apr 2024 15:49 IST

మీకు సొంత జట్టు కావాలా? మహేంద్ర సింగ్‌ ధోనీ కావాలా?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు చాలా కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే హైదరాబాద్‌ ఫ్యాన్స్‌కు ఎదురవుతోంది. ఈ డౌట్‌తోనే ఈ రోజు మ్యాచ్‌కు సిద్ధమవుతున్నారు. మరికాసేపట్లో మొదలుకానున్న ఈ మ్యాచ్‌ ఎలా ఉండనుంది.. ఏం కాబోతోంది అనేది పక్కన పెడితే.. ఇరు జట్లపై ఓ లుక్కేద్దాం!

ఉప్పల్‌ స్టేడియం వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ రికార్డు స్కోరు (277) సాధించింది. అటువైపు ముంబయి కూడా దూకుడుగా ఆడినప్పటికీ.. హైదరాబాద్‌ 31 పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్‌ 17వ సీజన్ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఓ దశలో ముంబయి భారీ టార్గెట్‌ను ఛేదిస్తుందా? అన్నట్లుగా మ్యాచ్‌ పరిస్థితి మారింది. చివర్లో పుంజుకొని హైదరాబాద్‌ విజయం సాధించగలిగింది. ఆ తర్వాత అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ చేతిలో ఓడిపోయింది. దీంతో మళ్లీ తన సొంత మైదానంలో విజృంభించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఐదుసార్లు ఛాంపియన్‌ చెన్నై జట్టును ఢీకొట్టాలంటే కాస్త శ్రమించాల్సిందే. ట్రావిస్‌ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ టాప్‌ ఫామ్‌లో ఉన్నారు. మయాంక్‌ అగర్వాల్, మార్‌క్రమ్‌ మాత్రం ఇంకా ‘వన్డే’ ఫార్మాట్‌ తరహాలోనే ఆడటం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. బ్యాటింగ్‌లో వీరిద్దరూ దూకుడుగా ఆడితే మరోసారి భారీ స్కోరు చూసే అవకాశం లేకపోలేదు. బౌలింగ్‌లో కెప్టెన్ కమిన్స్, భువనేశ్వర్‌ కుమార్‌పైనే ఎక్కువ భారం ఉంది. స్పిన్నర్లలో షహ్‌బాజ్, వాషింగ్టన్ సుందర్, మయాంక్‌ మార్కండే ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సిందే.

అంతా ధోనీమయం

చెన్నై ఓడినా.. గెలిచినా ఏ మైదానంలో చూసినా ఒకటే నామస్మరణ. ఇదే చివరి సీజన్‌ అని భావిస్తున్న తరుణంలో ధోనీని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీగా అభిమానులు స్టేడియాలకు తరలివస్తున్నారు. ఈ సీజన్‌ మూడో మ్యాచ్‌లో దిల్లీపై మహీ (16 బంతుల్లో 37) బ్యాటింగ్‌ విశ్వరూపాన్ని మరోసారి చూసే అవకాశం అభిమానులకు దక్కింది. దీంతో నేటి మ్యాచ్‌లో అతడిపై అంచనాలు పెరిగిపోయాయి. మరోసారి ఉప్పల్‌లోనూ అలాంటి ఆటను చూడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం చెన్నై మూడు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించింది. దిల్లీపైనా ధోనీ విజృంభించినా.. 20 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. రుతురాజ్‌ నాయకత్వంలోని ఆ జట్టు మళ్లీ విజయాల బాట పట్టి చెపాక్‌లో (ఏప్రిల్ 8న కోల్‌కతాతో మ్యాచ్) అడుగు పెట్టాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో ఓపెనర్లు రుతురాజ్‌ - రచిన్ ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. అజింక్య రహానె, డారిల్ మిచెల్, జడ్డూ, ధోనీ రాణించారు. శివమ్‌ దూబె స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఉప్పల్‌ స్టేడియంలో తమ అభిమాన బ్యాటర్లు రాణించాలని చెన్నై ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో ముస్తఫిజర్‌ ఆడటం లేదు. దీపక్ చాహర్, జడేజా భారీగా పరుగులు సమర్పించడం ఆ జట్టును ఆందోళనకు గురి చేసే అంశమే. యువ బౌలర్లు తుషార్‌ దేశ్‌ పాండే, పతిరన తమ ఫామ్‌ను కొనసాగిస్తున్నారు.

పిచ్‌ పరిస్థితి ఇదీ..

ఉప్పల్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంటుంది. గత గణాంకాలను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ముంబయితో మ్యాచే ప్రత్యక్ష నిదర్శనం. ఇరు జట్లూ కలిపి 520+ పరుగులు చేయడం గమనార్హం. మరోసారి ఈ మైదానంలో 200+ స్కోరు నమోదయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. నల్లమట్టితో తయారు చేసిన తాజా పిచ్‌పై హిట్టింగ్‌ చేయడం కాస్త కష్టమేనని.. కుదురుకుంటే మాత్రం భారీగా పరుగులు రాబట్టవచ్చని పేర్కొన్నారు.

తుది జట్లు (అంచనా)

హైదరాబాద్‌: మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐదెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షహ్‌బాజ్‌ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్‌ కుమార్, మాయంక్‌ మార్కండే, జయ్‌దేవ్ ఉనద్కత్

చెన్నై: రచిన్‌ రవీంద్ర, రుతురాజ్‌ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్య రహానె, శివమ్‌ దూబె, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్‌ దేశ్ పాండే, పతిరన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని