Bengaluru X Hyderabad: ఆకట్టుకున్న బెంగళూరు పోరాటం.. హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయం

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది.  

Updated : 15 Apr 2024 23:57 IST

బెంగళూరు: ఐపీఎల్‌ 2024లో హైదరాబాద్‌ (Hyderabad) హ్యట్రిక్‌ విజయం నమోదు చేసింది. బెంగళూరు(Bengaluru)ను వారి సొంతగడ్డపై 25 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ 287/3 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో బెంగళూరు గట్టిగానే పోరాడింది. చివరకు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) (83; 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. డుప్లెసిస్‌ (Faf Du Plessis) (62; 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ కోహ్లీ (Virat Kohli) (42; 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్‌ కెప్టెన్‌ కమిన్స్‌ మూడు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. మయాంక్‌ మార్కండే రెండు, నటరాజన్‌ ఒక వికెట్‌ తీశారు.   

డీకే మెరిపించినా

లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ధనాధన్‌ ఆటతో మెరుపు ఆరంభానిచ్చారు. వీరిద్దరూ చెలరేగడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి 79/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. తర్వాత బెంగళూరు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లీని మార్కండే ఏడో ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్ చేశాడు. వీల్ జాక్స్‌ (7), రజత్ పటీదార్‌ (9) ఇలా వచ్చి అలా వెళ్లారు. కమిన్స్‌ ఒకే ఓవర్‌లో డుప్లెసిస్‌, సౌరభ్‌ చౌహన్‌ (0)ను వెనక్కి పంపాడు. దీంతో 10 ఓవర్లకు బెంగళూరు 122/5 స్కోరుతో నిలిచి కష్టాల్లో పడింది. ఈ దశలో మహిపాల్ లామ్రోర్ (19), అనుజ్ రావత్‌ (25*; 14 బంతుల్లో 5 ఫోర్లు) సాయంతో దినేశ్‌ కార్తిక్‌ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కమిన్స్‌ వేసిన 17 ఓవర్‌లో తొలి బంతికి డీకే సిక్సర్ బాది హాఫ్ సెంచరీ (23 బంతుల్లో) అందుకున్నాడు. నటరాజన్‌ వేసిన 19 ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ బాది సెంచరీ చేసేలా కనిపించిన కార్తిక్‌.. అదే ఓవర్లో ఐదో బంతికి వికెట్ కీపర్‌ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చాడు. చివరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 44 రన్స్‌ అవసరం కావడంతో హైదరాబాద్‌ విజయం ఖాయమైపోయింది. చివరి ఓవర్‌లో అనుజ్ రావత్ నాలుగు ఫోర్లు బాదాడు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (102; 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ హెన్రిచ్‌ క్లాసెన్ (67; 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) సిక్సర్ల వర్షం కురిపించాడు. ట్రావిస్ హెడ్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడుతూ 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు మరో 19 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్ 23 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. చివర్లో అబ్దుల్ సమద్ (37*; 10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో హైదరాబాద్‌ రికార్డు స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లలో ఫెర్గుసన్‌ 2, టాప్లే ఒక వికెట్‌ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని