Hyderabad vs Mumbai: ఉప్పల్‌లో సిక్సర్ల మోత.. ముంబయిని ఓడించి బోణీ కొట్టిన హైదరాబాద్‌

సొంత మైదానంలో హైదరాబాద్‌ చెలరేగింది. ముంబయితో జరిగిన పోరులో 31 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. 

Updated : 27 Mar 2024 23:43 IST

హైదరాబాద్‌: సిక్సర్ల మోత మోగిన ఉప్పల్‌లో.. అభిమానులకు పసందైన విందు లభించింది. తొలుత బ్యాటింగ్‌లో అదరగొట్టిన హైదరాబాద్‌ (Hyderabad) ఐపీఎల్‌ (IPL) చరిత్రలో అత్యధిక స్కోర్‌ (277)చేయగా, తర్వాత బ్యాటింగ్‌ చేసిన ముంబయి (Mumbai) (246) తాము సైతం తక్కువ కాదంటూ బౌండరీలతో విరుచుకుపడింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ(64: 34 బంతుల్లో 6 సిక్స్‌లు, 2 ఫోర్లు), టిమ్‌ డేవిడ్‌ (42*: 22 బంతుల్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (34: 13 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లు), నమన్‌ ధీర్‌ (30: 14 బంతుల్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు) దూకుడుగా ఆడారు. అయితే ఎదుట భారీ లక్ష్యం ఉండడంతో ముంబయి బ్యాటర్లు శ్రమించినప్పటికీ గెలుపు తీరాలకు చేరలేకపోయారు. హైదరాబాద్‌ బౌలర్లలో కమిన్స్‌ 2, ఉనద్కత్‌ 2, షబాజ్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఇరుజట్ల స్కోర్‌ మొత్తం 523 పరుగులు. టీ20, ఐపీఎల్‌ చరిత్రలో ఇరుజట్లు చేసిన అత్యధిక స్కోర్‌ ఇదే.  

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ సొంత గ్రౌండ్‌లో చెలరేగిపోయింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఇప్పటి వరకు బెంగళూరు (263) పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. తొలుత హెడ్‌ (62: 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (63: 23 బంతుల్లో 7 సిక్స్‌లు, 3 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా, తర్వాత వచ్చిన క్లాసెన్‌ (80*: 34 బంతుల్లో 7 సిక్స్‌లు, 4 ఫోర్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. మార్‌క్రమ్‌ (42*: 28 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌) విలువైన పరుగులు చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని