Nitish Reddy: నితీశ్‌ రెడ్డి.. భారత్‌ క్రికెట్‌కు మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ లభించినట్లేనా?

హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది.

Updated : 10 Apr 2024 16:59 IST

భారత జట్టులో నికార్సైన పేస్‌ ఆల్‌రౌండర్‌ కొరత చాలా ఏళ్ల నుంచి ఉంది. ఆ స్థానం భర్తీ చేసేందుకు వచ్చిన వాళ్లు అవకాశాలను నిలబెట్టుకోవడం లేదు. మరికొందరు ఫిట్‌నెస్‌ కోల్పోయి బయటకు వచ్చేస్తున్నారు. ఈ ఐపీఎల్‌లో ఆ లోటును తీర్చేలా ఓ ఆంధ్రా కుర్రాడు కనిపించాడు. అతడే నితీశ్ కుమార్‌రెడ్డి (Nitish Kumar Reddy). ఒక్క ఇన్నింగ్స్‌తోనే ఇతడు హార్దిక్‌ పాండ్యతో కలిసి బాధ్యతలు పంచుకుంటాడా..? అనే చర్చకు కారణమయ్యాడు. 

ఐపీఎల్‌ 17వ సీజన్‌ కొత్త కుర్రాళ్లకు అద్భుతమైన వేదికగా మారింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ సీనియర్లకు సవాల్‌ విసిరే స్థాయిలో ఆడుతున్నారు. మొన్న మయాంక్‌ యాదవ్, రఘువంశీ, శశాంక్‌ సింగ్‌ పేర్లు వినిపించగా.. ఆ జాబితాలోకి తాజాగా నితీశ్‌ రెడ్డి కూడా చేరిపోయాడు. సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రాణించాడు. ట్రావిస్‌ హెడ్, అభిషేక్, క్లాసెన్‌ వంటి హిట్టర్లు తడబడిన వేళ.. ఈ 20 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయస్థాయి బౌలర్లను అలవోకగా దంచికొట్టాడు. కఠినమైన పిచ్‌పై బ్యాటింగ్‌లో విలువైన 64 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో వికెట్‌ తీశాడు. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు.

అంతకుముందు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడటం చూస్తుంటే ముచ్చటేసిందని క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. అతడి ఆత్మవిశ్వాసం చూస్తుంటే తప్పకుండా భారత జట్టులోకి అడుగుపెడతాడని అంచనా వేస్తున్నారు. 

గతేడాది నాలోని బౌలర్‌ను చూశారు. ఇప్పుడు బ్యాటర్‌నూ చూస్తారు. ఆల్‌రౌండర్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు మీ ముందుకొస్తా

- టోర్నీకి ముందు నితీశ్‌ మాటలివి

ఫిట్‌నెస్‌ కాపాడుకోవాలి

టీమ్‌ఇండియాలో పేస్ ఆల్‌రౌండర్ల సంఖ్య మరీ తక్కువ. నిలకడగా 130+ కి.మీ. వేగంతో బంతులేస్తూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించే ఆటగాడు ఉండటం ఏ జట్టుకైనా బలమే. ఇప్పటికీ తొలి వన్డే ప్రపంచ కప్‌ను అందించిన కపిల్‌దేవ్‌నే టాప్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌గా చెబుతున్నామంటే మన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆయన తర్వాత వచ్చిన మనోజ్‌ ప్రభాకర్‌ సహా ఎవరూ ఆ స్థాయిని అందుకోలేదు. కొన్నాళ్లు ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆ పాత్ర పోషించినా.. బ్యాటింగ్‌లో అనుకున్నంత మేర సక్సెస్‌ కాలేదు. హార్దిక్‌ పాండ్య మొదట్లో ఫాస్ట్‌ బౌలర్‌ కమ్‌ బ్యాటర్‌గా అదరగొట్టాడు. గాయాలు ఇబ్బందిపెట్టడంతో ఆ స్థాయి ప్రదర్శన చేయలేక విఫలమవుతున్నాడు. ఇప్పుడు కనీసం తన కోటా ఓవర్లను పూర్తి చేయడానికి కూడా అవస్థలు పడుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లోనూ ఇదే పరిస్థితి.

విజయ్‌శంకర్, వెంకటేశ్ అయ్యర్... అంటూ కొంతమంది పేస్‌ ఆల్‌రౌండర్లు జట్టులోకి వచ్చినా ప్రభావం చూపించలేకపోయారు. శివమ్‌ దూబె ఏమన్నా పేస్‌ బలం చూపిస్తాడా అంటే.. బ్యాటింగ్‌ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఈ సమయంలో పేస్‌ ఆల్‌రౌండర్‌ కోసం బీసీసీఐ గాలింపు కొనసాగుతూనే ఉంది. నితీశ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌, బౌలింగ్‌లో వైవిధ్యం చూస్తుంటే.. ఆ స్థానానికి అర్హుడని చెప్పొచ్చు. అయితే, ఈ టోర్నీలో నిలకడగా రాణించడంతోపాటు ఫిట్‌నెస్‌నూ కాపాడుకోవాలి. అదే చేస్తే... వచ్చే టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ పాండ్యకు బ్యాకప్‌గా నితీశ్‌ పేరును పరిశీలించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ఇదీ అతడి సంగతి..

నితీశ్‌ రెడ్డి టాలెంట్‌ను తొలుత మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ గుర్తించారు. అండర్-12, అండర్-14 మ్యాచ్‌ల సమయంలో అతడి ఆటను చూసిన ఎమ్మెస్కే ఏసీఏ అకాడమీకి పంపించారు. 2017-18 సీజన్‌ సందర్భంగా విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో నాగాలాండ్‌పై క్వాడ్రపుల్‌ (345 బంతుల్లో 441 పరుగులు) చేశాడు. ఆ టోర్నీలో 1,237 పరుగులు చేయడంతోపాటు 26 వికెట్లు పడగొట్టాడు. ఆ ఏడాది ‘బెస్ట్ క్రికెటర్ అండర్ -16’గా జగ్మోహన్‌ దాల్మియా అవార్డును అందుకొన్నాడు. నితీశ్‌ను సన్‌రైజర్స్‌ 2023లో రూ.20 లక్షల కనీస ధరతో సొంతం చేసుకుంది. తొలి సీజన్లో కేవలం రెండే మ్యాచ్‌లు ఆడాడు. ఈ సీజన్లో అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని.. చెన్నైతో మ్యాచ్‌లో లోయర్‌ ఆర్డర్లో బరిలోకి దింపింది. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో 8 బంతులకు 14 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్‌పై టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఇప్పటివరకు 17 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన నితీశ్‌.. 29.96 సగటుతో 566 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 52 వికెట్లు పడగొట్టాడు. 22 లిస్ట్ - ఏ మ్యాచుల్లో 403 పరుగులు చేసి 11 వికెట్లు తీశాడు. తొమ్మిది టీ20ల్లో 170 పరుగులు, ఓ వికెట్ పడగొట్టాడు. 2020లో కేరళపై రంజీ అరంగేట్రం చేసిన నితీశ్‌.. లోయర్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

- ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని