Sourav Ganguly: వెస్టిండీస్‌ టూర్‌కు ఆ ఇద్దరిని ఎంపిక చేయకపోవడంతో ఆశ్చర్యపోయా: గంగూలీ

ఫస్ట్-క్లాస్‌ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌, అభిమన్యు ఈశ్వరన్‌లను టీమ్‌ఇండియాకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించిందని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) అన్నాడు. 

Published : 29 Jun 2023 23:57 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా త్వరలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో విండీస్‌తో భారత్‌ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టెస్టులు, వన్డేలకు ఇటీవల సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ప్రకటించింది. నిలకడగా రాణించలేకపోతున్న ఛెతేశ్వర్‌పై వేటు వేసిన సెలెక్టర్లు ఐపీఎల్‌లో అదరగొట్టిన రుతురాజ్‌ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లకు టెస్టు జట్టులో చోటు కల్పించారు. 30 ఏళ్ల బెంగాల్ పేసర్‌ ముఖేశ్‌కుమార్‌ను వన్డేలు, టెస్టులకు ఎంపిక చేశారు. ఫస్ట్‌- క్లాస్‌ క్రికెటర్లయిన సర్ఫరాజ్‌ ఖాన్‌, అభిమన్యు ఈశ్వరన్‌, ప్రియాంక్ పాంచల్‌లకు అవకాశం కల్పిస్తారని భావించినా సెలెక్టర్లు వారికి మొండిచేయి చూపారు. దీంతో, సెలెక్షన్‌ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) కూడా సెలెక్షన్‌ కమిటీ తీరును తప్పుబట్టాడు. ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగానే టీమ్‌ఇండియాకు ఎంపిక చేయకూడదని, దేశవాళీ క్రికెట్‌లో రాణించిన వారికి కూడా అవకాశం కల్పించాలని సెలెక్టర్లకు సూచించాడు. ఫస్ట్-క్లాస్‌ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌, అభిమన్యు ఈశ్వరన్‌లను టీమ్‌ఇండియాకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. 

‘‘రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలలో యశస్వి జైస్వాల్ టన్నుల కొద్దీ పరుగులు చేశాడని అనుకుంటున్నాను. అందుకే అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు. గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న సర్ఫరాజ్‌ఖాన్‌కు కూడా అవకాశం ఇవ్వాలి. అభిమన్యు ఈశ్వరన్ గత ఐదారేళ్లుగా టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నాడు. వీరిద్దరినీ ఎంపిక చేయకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యా. భవిష్యత్‌లో వారికి అవకాశం ఇవ్వాలి. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆటలో లోపాలు ఉంటే అతను దేశవాళీ క్రికెట్‌లో అన్ని పరుగులు చేసి ఉండేవాడు కాదు. ఫాస్ట్ బౌలింగ్‌ ఎదుర్కొవడంలో అతనికి ఎటువంటి సమస్యలు లేవని నేను భావిస్తున్నా’’అని దాదా పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని