నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే

తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ అన్నాడు.

Published : 18 May 2024 03:33 IST

దిల్లీ: తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ అన్నాడు. త్వరలో పారిస్‌ ఒలింపిక్స్‌కు ఈ స్టార్‌ అథ్లెట్‌ ప్రేక్షకుడిగా వెళ్లబోతున్నాడు. ‘‘100 మీటర్లు, 200 మీటర్లలో నేను సృష్టించిన రికార్డులకు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదు. ఇవి బద్దలు కావాలంటే చాలా ఏళ్లు పడుతుందని భావిస్తున్నా. ప్రస్తుతం ఉన్నవాళ్లెవరూ ఆ ఘనతలను అందుకునేలా కనిపించట్లేదు. పారిస్‌ ఒలింపిక్స్‌ చూసేందుకు వెళ్తున్నా’’ అని బోల్ట్‌ చెప్పాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు రాయబారిగా ఉన్న ఉసేన్‌.. రిటైర్మెంట్‌ తర్వాత కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు.  2009 బెర్లిన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగును ఎవరికీ సాధ్యం కాని రీతిలో 9.58 సెకన్లలోనే పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన బోల్ట్‌.. అదే టోర్నీలో 200 మీటర్ల పరుగులో 19.19 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసి ఇంకో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 2017లో అతడు రిటైర్‌ అయ్యాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పసిడి రేసులో ఉన్న క్రిస్టియన్‌ మిల్లర్, కెండాల్‌ విలియమ్స్‌ (అమెరికా, ఇద్దరూ 9.93 సెకన్లు), 200 మీటర్లలో కెన్నెత్‌ బెడ్‌నెర్క్‌ (అమెరికా, 19.67 సెకన్లు) బోల్ట్‌ రికార్డులకు చాలా దూరంలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని