Yashasvi Jaiswal: వారితో పోల్చొద్దు.. నాలానే ఉండనివ్వండి: యశస్వి జైస్వాల్

భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించాడు.

Published : 15 Feb 2024 18:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. పిన్న వయసులోనే ద్విశతకం చేయడంతో అతడిని భారత స్టార్‌ క్రికెటర్లు సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌తో అభిమానులు పోల్చడం ప్రారంభించారు. రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తనను ఎవరితోనూ పోల్చవద్దని.. యశస్వి జైస్వాల్‌గానే ఉంటానని వ్యాఖ్యానించాడు. ఆ ముఖాముఖిలో పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. 

నీ క్రికెట్‌ కెరీర్‌లో డబుల్‌ సెంచరీకి ఎన్నో ర్యాంకు ఇస్తావు?

యశస్వి: ప్రతి మ్యాచ్‌లో ప్రతి ఇన్నింగ్స్‌కు విలువ ఉంటుంది. ఎంతో సంతృప్తి కలుగుతుంది. భారీగా పరుగులు చేసిన ప్రతిసారీ నేను ఆటను ఆస్వాదిస్తా. 

భారీ ఇన్నింగ్స్‌ను కుటుంబం ఎలా సెలబ్రేట్‌ చేసుకుంది?

యశస్వి: ఆ మ్యాచ్‌ తర్వాత కుటుంబంతో కలిసి కాస్త సమయం గడిపా. డబుల్‌ సెంచరీ సాధిస్తే ప్రత్యేకంగా సంబరాలు చేసుకోవాలని కలలు కనేవాడిని. చాలాకాలంగా దీని గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకొనే ఉన్నా. ద్విశతకం తర్వాత నా స్టైల్‌లో సెలబ్రేట్‌ చేసుకున్నా. 

ఐదు టెస్టుల సిరీస్‌కు మానసికంగా ఎలాంటి సన్నద్ధత అవసరం? 

యశస్వి: ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యానని తెలిశాక ఎంతో ఆనందించా. ఇలాంటి భారీ సిరీస్‌లో వివిధ దశలను అధిగమించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సాఫీగా ఇన్నింగ్స్‌ సాగినా.. ప్రత్యర్థి జట్టు నుంచి కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  సుదీర్ఘ ఫార్మాట్‌లో నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వెస్టిండీస్‌ టూర్‌ నుంచే నేను ఆటను ఆస్వాదించడం ప్రారంభించా. ఇప్పుడూ అదే చేస్తున్నా.

విభిన్న పిచ్‌లపై ఆడటం ఎలా అనిపిస్తోంది?

యశస్వి: ప్రతి దేశంలో వారికంటూ ప్రత్యేక సంప్రదాయాలు ఉంటాయి. భారత జట్టుగా మనం అక్కడికి వెళ్లినప్పుడు వాటిని నేర్చుకోవాలి. సీనియర్ల నుంచి తెలుసుకోవాలి. రోహిత్, రాహుల్‌ ద్రవిడ్‌, విరాట్ కోహ్లీతో మాట్లాడుతూ ఉంటా. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాలో పిచ్‌ పరిస్థితులు మనకంటే భిన్నంగా ఉంటాయి. భారత్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల అలవాటు పడిపోయాం. అందుకే, విదేశాలకు వెళ్లినప్పుడు నిరంతరం ఆటను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటా. 

బజ్‌బాల్‌పై భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో చర్చ జరుగుతుందా? 

యశస్వి: భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో బజ్‌బాల్‌ గురించి చర్చే జరగదు. మా ఆటపై మాత్రమే దృష్టి పెడతాం. మైదానంలో ఎలాంటి ప్రణాళికలు అమలుచేయాలనే దానిపై మాట్లాడుకుంటాం. ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం. జట్టులో సానుకూల దృక్పథం ఉండేలా చూసుకుంటాం. 

‘జాజ్‌బాల్’ అని పిలిస్తే ఎలా అనిపిస్తుంటుంది? అండర్సన్‌కు మాటలతో బదులిచ్చావా?

యశస్వి: నన్ను ఏ పేరు పెట్టి పిలిచినా ఫర్వాలేదు. ప్రేమగా పిలిస్తే చాలు. అయితే,  నా ఇంటి పేరు జైస్వాల్. నన్ను అలా పిలిచినా సంతోషపడతా.  ఇక అండర్సన్‌తో మాటల యుద్ధం ఏమీ ఉండదు. ఏ బౌలరైనా మంచి బంతి విసిరితే దానిని గౌరవిస్తా. చెత్త బాల్‌ వస్తే మాత్రం బాదేందుకు ప్రయత్నిస్తా. అండర్సన్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరు. అతడి బౌలింగ్‌లో ఆడటం ఆస్వాదిస్తా. 

రోహిత్‌తో ఎలాంటి అనుబంధం ఉంది? 

యశస్వి: అద్భుతమైన క్రికెటర్‌తో కలిసి ఆడటం గౌరవంగా భావిస్తా.  బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు మధ్యలో తన అనుభవాలను షేర్‌ చేస్తుంటాడు. క్లిష్ట సమయాల్లోనూ నింపాదిగా ఉంటాడు. ఏ అనుమానం ఉన్నా అడిగే స్వేచ్ఛ అతడి వద్ద నాకుంది.  చెత్త ప్రశ్నను అడిగినప్పటికీ చక్కగా సమాధానం ఇస్తాడు. భారత జట్టు కోసం అద్భుతంగా ఆడాడు. 

ధోనీ ఇచ్చిన కీలక సూచనలు ఏంటి?

యశస్వి: తొలిసారి ధోనీని కలిసినప్పుడు ‘నమస్తే’ అని చెప్పా. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆయన ఏమనుకుంటారోనని సంశయించా. నా మొదటి ఐపీఎల్‌ సందర్భంగా ధోనీ కీపింగ్‌ చేస్తుండగా నేను బ్యాటింగ్‌ చేశా. ఆ ఫొటో ఇప్పటికీ నా జీవితంలో అద్భుతమైన జ్ఞాపకం. ఆ మ్యాచ్‌ తర్వాత ధోనీ మాట్లాడుతూ రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాడు. క్రికెట్‌ ఆడటం ఓకే. అదే సమయంలో మనిషిగా పరిపూర్ణత సాధించాలి. అదే నీ జీవిత గమనాన్ని నడిపిస్తుందన్నాడు. క్రికెట్‌లో ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. వాటి నుంచి నేర్చుకుంటూ ఉండాలి. 

బౌలింగ్‌ చేయడంపై ఆసక్తి ఉందా? సెహ్వాగ్‌, గంగూలీతో పోల్చడంపై?

యశస్వి: బౌలింగ్‌ చేయడాన్నీ ఆస్వాదిస్తా. ప్రాక్టీస్‌ సందర్భంగానూ బంతులేస్తుంటా. తప్పకుండా భారత జట్టు తరఫున బౌలింగ్‌ చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నా. చాలామంది నన్ను స్టార్ క్రికెటర్లతో పోల్చుతున్నారు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తా. కానీ, నేను మాత్రం యశస్వి జైస్వాల్‌లా మాత్రమే ఉండేందుకు ఇష్టపడతా. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని