Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్‌

ప్రపంచకప్‌ ఫైనల్‌ (ODI Worldcup 2023 Final)లో కోహ్లీ (Virat Kohli) వికెట్‌ తీయడం తనకు అద్భుతమైన క్షణమని ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ (Pat Cummins) అన్నాడు. తన చివరి క్షణాల్లోనూ ఆ వికెట్టే గుర్తొస్తుందన్నాడు.

Published : 28 Nov 2023 12:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ టోర్నీ (ODI World cup 2023) ముగిసి వారం దాటినా.. ఫైనల్‌ (IND vs AUS Final Match)లో టీమ్‌ఇండియా (Team India) ఓటమి నుంచి క్రికెట్‌ అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) వికెట్‌ పడిన క్షణాలను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, ఆ వికెట్టే ఈ టోర్నీలో తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) మరోసారి చెప్పాడు. అంతేకాదు.. జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు కూడా తనకు ఆ వికెట్ గుర్తొస్తుందని అన్నాడు.

మెల్‌బోర్న్‌లో ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిన్స్‌ ఈ విషయాన్ని చెప్పాడు. ‘‘70ఏళ్లు దాటిన తర్వాత మీరు జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు.. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఏ క్షణాల గురించి ఆలోచిస్తారు?’’ అని కమిన్స్‌ను యాంకర్‌ ప్రశ్నించగా.. ‘‘విరాట్‌ కోహ్లీ వికెట్‌ గురించి ఆలోచిస్తా’’ అని సమాధానమిచ్చాడు. తన జీవితంలో అత్యంత అద్భుతమైన, కీలకమైన క్షణం అదేనన్నాడు.

ఆస్ట్రేలియాకు ప్రపంచకప్‌ను అందించిన ఆ ఒక్క మీటింగ్‌..!

‘‘ఆ సమయంలో నాకు చాలా ఆనందంగా అనిపించింది. వికెట్‌ తీసిన తర్వాత మేమంతా ఒకచోటుకి చేరుకున్నప్పుడు స్టీవ్‌ స్మిత్‌ ఓ మాట చెప్పాడు. ‘ఒక్కసారి మైదానాన్ని చూడండి’ అన్నాడు. ఆ క్షణం స్టేడియంలో దాదాపు లక్ష మంది భారత అభిమానులున్నారు. వారంతా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మైదానం లైబ్రరీ అంత నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ క్షణాలను నేను చాలా కాలం పాటు ఆస్వాదిస్తాను’’ అని కమిన్స్‌ (Pat Cummins) చెప్పాడు.

ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా తడబడింది. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రాహుల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 28.2 ఓవర్లలో 148/3తో భారత్‌ కుదురుకుంటున్న సమయంలో.. టీమ్‌ఇండియాను కమిన్స్‌ గట్టి దెబ్బ కొట్టాడు. ఆ ఓవర్‌లో అతడు వేసిన షార్ట్‌ లెంగ్త్‌ డెలివరీని కోహ్లీ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్‌ను ముద్దాడి స్టంప్స్‌ను తాకింది. కోహ్లీ ఔట్‌ అయిన తర్వాత మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యింది.

ఇదిలా ఉండగా.. ప్రపంచకప్‌లో ఆరోసారి విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్‌ జట్టు ఆ ట్రోఫీని నేడు సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో మీడియాకు ప్రదర్శించింది. ఆ ఫొటోలను ఐసీసీ తమ ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు