Bengaluru X Hyderabad: నేనూ బ్యాటర్‌ అయితే బాగుండే: కమిన్స్‌

Bengaluru X Hyderabad: సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరుపై హైదరాబాద్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌ చరిత్రలో ఆ జట్టు అత్యధిక స్కోరు నమోదు చేసింది.

Updated : 16 Apr 2024 13:00 IST

బెంగళూరు: హైదరాబాద్‌ జట్టు సోమవారం ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో బ్యాటర్ల విధ్వంసానికి బెంగళూరు బౌలర్లు చేతులెత్తేశారు. ట్రావిస్‌ హెడ్‌ బంతిపై పగబట్టినట్లుగా విరుచుకుపడటంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. క్లాసెన్‌, సమద్‌ సైతం రాణించడంతో స్టేడియంలో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ క్రమంలో తమ ప్లేయర్ల ఆటతీరును చూస్తుంటే తానూ బ్యాటర్‌ అయితే బాగుండనిపించిందని హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీయడంతో బెంగళూరు కష్టాల్లో పడింది.

‘‘నేనూ బ్యాటర్‌ అయితే బాగుండనిపించింది. అద్భుతమైన గేమ్‌.. కళ్లు చెదిరే దృశ్యాలు. వికెట్‌ను రీడ్‌ చేయడం వదిలేశా. పిచ్‌ డ్రైగా అనిపించింది. ఇది నాలుగో విజయం. సంతోషంగా ఉంది. మా బ్యాటర్లు అలవోకగా ఆడేశారు’’ అని మ్యాచ్‌ అనంతరం కమిన్స్‌ వ్యాఖ్యానించాడు. ఇలా పరుగుల వరద పారిస్తే బౌలర్లు కనుమరుగవుతారన్న సరదా ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాలాంటి బౌలర్లను మరికొన్నేళ్లు ఆడనివ్వండి (నవ్వుతూ).. నా ప్రయత్నం నేను చేశా. ఒక్క ఓవర్‌లో ఏడెనిమిది పరుగులు మాత్రమే ఇవ్వగలిగితే మ్యాచ్‌పై ప్రభావం చూపొచ్చు’’ అని బౌలింగ్‌లో తన పాత్రను వివరించాడు. 

సోమవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (102; 41 బంతుల్లో 9×4, 8×6) విధ్వంసక శతకం సాధిస్తే.. క్లాసెన్‌ (67; 31 బంతుల్లో 2×4, 7×6), సమద్‌ (37 నాటౌట్‌; 10 బంతుల్లో 4×4, 3×6), అభిషేక్‌ శర్మ (34; 22 బంతుల్లో 2×4, 2×6) మార్‌క్రమ్‌ (32 నాటౌట్‌; 17 బంతుల్లో 2×4, 2×6) కూడా రెచ్చిపోయారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (62; 28 బంతుల్లో 7×4, 4×6), కోహ్లి (42; 20 బంతుల్లో 6×4, 2×6) మెరుపు ఆరంభాన్నిచ్చినా.. ఆ తర్వాత ఆ జట్టు గాడి తప్పింది. దినేశ్‌ కార్తీక్‌ (83; 35 బంతుల్లో 5×4, 7×6) సంచలన ఇన్నింగ్స్‌ ఆడటంతో బెంగళూరు పోటీ ఇచ్చినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని