Mayank Yadav: మయాంక్‌ యాదవ్‌కు బౌలింగ్‌ కాంట్రాక్ట్ ఇవ్వాలి: విండీస్‌ క్రికెట్ దిగ్గజం

ఐపీఎల్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన కుర్రాడు మయాంక్‌ యాదవ్ (Mayank Yadav). అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థులు ఇబ్బంది పడుతున్నారు.

Published : 03 Apr 2024 12:09 IST

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు మ్యాచుల్లో ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డులను మయాంక్‌ యాదవ్ దక్కించుకున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా అవతరించిన ఈ లఖ్‌నవూ యువ పేసర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడికి బీసీసీఐ బౌలింగ్‌ కాంట్రాక్ట్‌ను ఇవ్వాలని వెస్టిండీస్‌ క్రికెట్ దిగ్గజం ఇయాన్‌ బిషప్ సూచించాడు. ‘‘నిలకడగా 150+ కి.మీ వేగంతో బంతులను సంధించడం అద్భుతం. అతడిని బౌలింగ్‌ కాంట్రాక్ట్‌ల జాబితాలోకి చేర్చడానికి  ఇంతకుమించిన ఇతర ప్రదర్శన అవసరం లేదు’’అని పోస్టు పెట్టాడు. ఫాస్ట్‌ బౌలర్లకు కాంట్రాక్ట్‌ ఇవ్వాలనే బీసీసీఐ నిర్ణయంపై ఇప్పటికే బిషప్ అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. 

మయాంక్‌కు మంచి భవిష్యత్తు: అంబటి రాయుడు

యువ పేసర్ మయాంక్‌పై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సూపర్‌ స్టార్‌గా మారతాడని అభిప్రాయపడ్డాడు. ‘‘మయాంక్‌లో అద్భుమైన టాలెంట్ ఉంది. అతడు ఎంత దృఢంగా ఉంటాడనే దానికి ఇదొక నిదర్శనం. గత సీజన్‌ నుంచి పూర్తిగా వైదొలిగిన తర్వాత.. ఈ ఎడిషన్‌లో అతడి ఆటతీరును చూస్తుంటే మంచి భవిష్యత్తు ఉన్నట్లు కనిపిస్తోంది. అతడి ముందు ఆసీస్‌ జట్టు ఉండుంటే.. ఊహిస్తేనే భలేగా ఉంది. నాణ్యమైన పేస్‌తో కుడి చేతివాటం బ్యాటర్లను హడలెత్తించాడు’’ అని అన్నాడు.

అలాంటి బ్యాటర్‌నే బోల్తా కొట్టించాడు: స్టీవ్‌ స్మిత్

‘‘మయాంక్‌ యాదవ్‌ లైన్‌ అండ్ లెంగ్త్‌తో బంతులేయడం అభినందనీయం. అత్యంత వేగంగా బౌలింగ్‌ చేయడం కంటే లెంగ్త్‌ను ఒడిసి పట్టడం  చాలా కష్టం. అతడు రెండింటిపైనా పట్టు సాధించాడు. 155 కి.మీ వేగంతో సరైన ప్రదేశంలో పడిన బంతులను ఆడటం బ్యాటర్లకు చాలా కష్టమైన టాస్క్. అయితే, జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసినప్పుడు అతడిపై భారీగా అంచనాలు ఉంటాయి. చాలా మంది క్రికెటర్లు తమ మొదటి మ్యాచుల్లో మెరిసినా.. తర్వాత విఫలమైన సందర్భాలూ ఉన్నాయి. ఈ సీజన్‌లో మయాంక్‌ అత్యుత్తమ బ్యాటర్లను ఔట్‌ చేసిన విధానం బాగుంది. ఫాస్ట్‌ బౌలింగ్‌ను చక్కగా ఆడే మ్యాక్స్‌వెల్‌ను బోల్తా కొట్టించాడు. తప్పకుండా ఇతడి పేరు చాన్నాళ్లు గుర్తుండిపోతుంది’’ అని స్టీవ్‌ స్మిత్ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని