Virat Kohli: విరాట్‌కు రెండో వైపు.. అప్పుడు స్మిత్‌కు అండ.. ఇప్పుడు నవీనుల్‌కు బాసట

విరాట్‌ కోహ్లి (Virat Kohli) అంటే దూకుడుకు మారుపేరు. ప్రత్యర్థి ఆటగాళ్లెవరైనా అతడితో పెట్టుకుంటే అంతే సంగతులు. అవతలి ఆటగాడు ఒక మాట అంటే అతను రెండు మాటలు అంటాడు. బౌలర్లు కవ్విస్తే బ్యాటుతో వారికి సమాధానం చెబుతాడు. సై అంటే సై అన్నట్లే ఉంటుంది అతడి వ్యవహారం.

Updated : 12 Oct 2023 17:19 IST

విరాట్‌ కోహ్లి అంటే దూకుడుకు మారుపేరు. ప్రత్యర్థి ఆటగాళ్లెవరైనా అతడితో పెట్టుకుంటే అంతే సంగతులు. అవతలి ఆటగాడు ఒక మాట అంటే అతను రెండు మాటలు అంటాడు. బౌలర్లెవరైనా కవ్విస్తే బ్యాటుతో వారికి సమాధానం చెబుతాడు. సై అంటే సై అన్నట్లే ఉంటుంది అతడి వ్యవహారం. కొన్నిసార్లు కోహ్లి మరీ ఎక్కువ స్పందిస్తాడని.. ప్రత్యర్థులతో అమర్యాదరకంగా వ్యవహరిస్తాడని అప్పుడప్పుడూ విమర్శలు కూడా వస్తుంటాయి. అయిదే ఇదంతా కోహ్లిలో నాణానికి ఒకవైపు! అవసరమైనపుడు ప్రత్యర్థులను గౌరవించడం, వారికి బాసటగా నిలవడంలోనూ కోహ్లి ముందుంటాడు. అఫ్గానిస్థాన్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్‌లో నవీనుల్‌ హక్‌ విషయంలో అతను వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం.

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం దిల్లీలో అఫ్గానిస్థాన్‌తో తలపడి ఘనవిజయం సాధించింది భారత్‌. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన దృశ్యం.. అఫ్గానిస్థాన్‌ పేసర్‌ నవీనుల్‌ హక్‌తో స్నేహంగా మెలగడమే. ఈ ఏడాది ఐపీఎల్‌లో వీళ్లిద్దరికీ జరిగిన గొడవను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఆ గొడవ తర్వాత నవీనుల్‌.. కోహ్లి అభిమానులకు విలన్‌ అయిపోయాడు. అతను ఎక్కడ మ్యాచ్‌ ఆడినా.. ‘‘కోహ్లి కోహ్లి’’ అంటూ అరవడమే పనిగా పెట్టుకున్నారు విరాట్‌ ఫ్యాన్స్‌. ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనూ నవీనుల్‌ బౌలింగ్‌కు వచ్చినపుడల్లా ‘‘కోహ్లి’’ నినాదాలు వినిపించాయి. ఇక భారత్‌తో మ్యాచ్‌లో అయితే ఈ నినాదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

దిల్లీ కోహ్లి సొంత నగరం కావడంతో అతడి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాళ్లు నవీనుల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అతను బ్యాటింగ్‌కు వచ్చినపుడు స్టేడియమంతా కోహ్లి నినాదాలు హోరెత్తాయి. ఆపై కోహ్లికి నవీనుల్‌ బంతులేస్తున్నపుడు అభిమానులు ఇంకా రెచ్చిపోయారు. అయితే ప్రత్యర్థి ఆటగాడిని ఇలా లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యవహరించడం కోహ్లికి నచ్చలేదు. నవీనుల్‌ తనతో గొడవపడ్డప్పుడు విరాట్‌ ఎంత ఆగ్రహం ప్రదర్శించాడో తెలిసిందే. కానీ అభిమానులు ఇప్పుడిలా చేయడం విరాట్‌కు రుచించలేదు. అందుకే తర్వాత అభిమానుల వైపు చేత్తో సంజ్ఞ చేస్తూ నినాదాలు ఆపేయమన్నాడు. దీంతో ఫ్యాన్స్‌ శాంతించారు. తర్వాత నవీనుల్‌తో నవ్వుతూ మాట్లాడ్డమే కాక.. అతడి భుజంపై చేయి వేసి సన్నిహితంగా కనిపించాడు విరాట్‌. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. మన అతిథి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించిన కోహ్లిని కొనియాడుతూ నెటిజన్లు అతణ్ని ప్రశంసల్లో ముంచెత్తారు.

ఏంటి వాళ్లిద్దరి గొడవ?

ఈ ఏడాది ఐపీఎల్‌లో బెంగళూరు-లఖ్నవూ మ్యాచ్‌ సందర్భంగా కోహ్లికి, నవీనుల్‌కు పెద్ద గొడవే నడిచింది. నవీనుల్‌ ఔటైనపుడు కోహ్లి తన షూను చూపిస్తూ అతణ్ని ఏదో అన్నాడు. దీంతో నవీనుల్‌ కూడా ఏదో తిడుతూ పెవిలియన్‌కు వెళ్లాడు. మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకునేటపుడు నవీనుల్‌.. కోహ్లితో కొంత అమర్యాదకరంగా వ్యవహరించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మ్యాచ్‌ తర్వాత కూడా నవీనుల్‌ తగ్గలేదు. బెంగళూరు ఓ మ్యాచ్‌లో ఓడినపుడు వ్యంగ్యంగా ఒక పోస్టు పెట్టాడు. దీంతో కోహ్లి అభిమానులకు అతను లక్ష్యంగా మారాడు. అప్పట్నుంచి అతను ఇండియాలో ఎక్కడ మ్యాచ్‌ ఆడినా.. కోహ్లి నినాదాలతో అభిమానులు గోల గోల చేస్తున్నారు. ప్రపంచకప్‌లోనూ అఫ్గానిస్థాన్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో అదే చేశారు. కానీ భారత్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ గొడవకు కోహ్లి తెరదించాడు.

అప్పుడు స్మిత్‌ కోసం..

విరాట్‌  ప్రత్యర్థి ఆటగాడికి బాసటగా నిలవడం తొలిసారేమీ కాదు. 2019లో అతను ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు అండగా నిలబడిన తీరు ప్రశంసలందుకుంది. స్మిత్‌ అంతకుముందు ఏడాదే బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణంలో భాగం కావడం వల్ల ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. నిషేధం పూర్తి చేసుకున్నాక వన్డే ప్రపంచకప్‌లో ఆడుతుండగా.. భారత్‌తో మ్యాచ్‌లో అభిమానులు అతణ్ని గేలి చేశారు. స్మిత్‌ మోసగాడన్నట్లుగా కొందరు నినాదాలు చేశారు. చేసిన తప్పుకి శిక్ష కూడా అనుభవించాక స్మిత్‌ను ఇలా అభిమానులు లక్ష్యంగా చేసుకోవడం కోహ్లికి నచ్చలేదు. దీంతో అతను అలా చేయొద్దంటూ అభిమానులను వారించాడు. దీంతో స్టేడియం సద్దుమణిగింది. ఈ చర్యతో స్మిత్‌ కోహ్లి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు కూడా చెప్పాడు. తర్వాత ఐసీసీ.. కోహ్లికి ‘స్పిరిట్‌ ఆఫ్‌ ద క్రికెట్‌’ అవార్డు కూడా ఇవ్వడం విశేషం.

- ఈనాడు క్రీడా విభాగం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని