Suryakumar: సూర్యకుమార్‌కు అవకాశాలివ్వండి.. ప్రపంచకప్‌లో దుమ్మురేపుతాడు: యువీ

ఆసీస్‌తో మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డక్‌ అయి విమర్శలకు గురవుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)కు భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ మద్దతుగా నిలిచాడు.

Updated : 25 Mar 2023 15:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌  (Suryakumar Yadav) ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని వన్డే జట్టు నుంచి తప్పించి టీ20లకే పరిమితం చేయాలని కొంతమంది మాజీలు, క్రికెట్‌ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, సూర్యకుమార్‌ యాదవ్‌కు భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) మద్దతుగా నిలిచాడు. వన్డేల్లో సూర్య మున్ముందు రాణిస్తాడని, ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)లో భారత్‌కు కీలక ఆటగాడిగా మారతాడని యూవీ అభిప్రాయపడ్డాడు.

‘ప్రతి క్రీడాకారుడు తన కెరీర్‌లో ఎత్తుపల్లాలను చూస్తాడు.  మనమందరం దీనిని అనుభవించాం. సూర్యకుమార్‌ యాదవ్‌ టీమ్‌ఇండియాకు కీలకమైన ఆటగాడని నేను నమ్ముతున్నాను. అతనికి మరిన్ని అవకాశాలిస్తే వన్డే ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషిస్తాడు. సూర్యకుమార్‌ తప్పకుండా మళ్లీ ఫామ్‌ని అందుకుంటాడు’ అని యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ఏడాది అక్టోబర్‌- నవంబర్‌ మధ్య వన్డే ప్రపంచ కప్‌ జరగనుంది. ఈ మెగా టోర్నీకి భారతే ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.

ఇక, టీ20ల్లో అదరగొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లో మాత్రం ఆశించినమేరకు రాణించలేకపోతున్నాడు. 21 ఇన్నింగ్స్‌ల్లో 24.06 సగటుతో 433 పరుగులే చేశాడు. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో వైఫల్యాన్ని మర్చిపోయి మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌-16 సీజన్‌లో రాణించడంపై సూర్యకుమార్‌ దృష్టిపెట్టాలి. అక్కడ రాణిస్తేనే తర్వాత జరిగే వన్డే సిరీస్‌లకు అతడిని ఎంపిక చేసే అవకాశాలుంటాయి. లేకపోతే సూర్యకుమార్‌ వన్డే కెరీర్‌ ప్రమాదంలో పడినట్లే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని