French Open: స్వైటెక్‌ తీన్‌మార్‌

లేడీ నాదల్‌ అదరగొట్టింది. దూకుడైన ఆటతో నాలుగోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను పట్టేసింది. వరుసగా మూడో టైటిల్‌తో ఎర్రకోట నాదే అని చాటి చెప్పింది. శనివారం మహిళల సింగిల్స్‌ తుదిపోరులో స్వైటెక్‌ 6-2, 6-1తో పన్నెండో సీడ్‌ పౌలీనిని చిత్తు చేసింది.

Updated : 09 Jun 2024 08:10 IST

వరుసగా మూడోసారి టైటిల్ సొంతం
ఫైనల్లో పౌలీనిపై గెలుపు

పారిస్‌: లేడీ నాదల్‌ అదరగొట్టింది. దూకుడైన ఆటతో నాలుగోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను పట్టేసింది. వరుసగా మూడో టైటిల్‌తో ఎర్రకోట నాదే అని చాటి చెప్పింది. శనివారం మహిళల సింగిల్స్‌ తుదిపోరులో స్వైటెక్‌ 6-2, 6-1తో పన్నెండో సీడ్‌ పౌలీనిని చిత్తు చేసింది. హోరాహోరీ పోరు సాగుతుందనుకుంటే టాప్‌సీడ్‌ స్వైటెక్‌ ఫైనల్‌ను ఏకపక్షంగా మార్చింది. అయితే తొలి సెట్‌ ఆరంభంలో పౌలీని కాస్త మెరుగ్గా ఆడింది. ప్రత్యర్థికి బ్రేక్‌ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. కానీ జోరు పెంచిన స్వైటెక్‌ ఆరో గేమ్‌లో బ్రేక్‌ సాధించి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే ఊపులో సెట్‌ గెలిచి ఆధిక్యంలో నిలిచింది. రెండో సెట్లో స్వైటెక్‌ టాప్‌గేర్‌లోకి వెళ్లింది. మెరుపు విన్నర్లు.. చక్కని ప్లేస్‌మెంట్లతో అదరగొట్టిన ఆమె.. రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసింది. ఆ తర్వాత ఆట అంతా స్వైటెక్‌దే. బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో ప్రత్యర్థిని అదరగొట్టిన ఆమె 5-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ పోలెండ్‌ తార గెలవడానికి ఎక్కువసేపు పట్టలేదు. పౌలీని ఓ రిటర్న్‌ను కోర్టు బయటకు కొట్టడంతో స్వైటెక్‌ విజయ సంబరాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో తొమ్మిదిసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ఆమె..   ఓ ఏస్‌తో పాటు 18 విన్నర్లు కొట్టింది. 2 డబుల్‌ ఫాల్ట్స్, 21 అనవసర తప్పిదాలు చేసిన పౌలీని మూల్యం చెల్లించుకుంది.


3

రొలాండ్‌ గారోస్‌లో వరుసగా 3 టైటిళ్లు గెలిచిన మూడో క్రీడాకారిణి స్వైటెక్‌. హెనిన్‌ (2005-07), మోనికా సెలెస్‌ (1990-92) కూడా హ్యాట్రిక్‌ సాధించారు. 


5

స్వైటెక్‌ ఖాతాలోని గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు. ఇప్పటివరకు నాలుగుసార్లు (2020, 2022, 2023, 2024) ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఆమె.. ఒకసారి యుఎస్‌ ఓపెన్‌ (2022) నెగ్గింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని