Imran Tahir: 44 ఏళ్ల వయసులోనూ తాహిర్‌ జోరు.. ధోని రికార్డు బద్దలు కొట్టి..

వయసు 44 ఏళ్ల వయసులోనూ దక్షిణాఫ్రికా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ అదరగొడుతున్నాడు. తాజాగా కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో అమెజాన్‌ వారియర్స్‌ను గెలిపించి తనకు వయసు అడ్డంకి కాదని నిరూపించాడు. 

Updated : 29 Sep 2023 13:12 IST

వయసు 44 ఏళ్లు.. మామూలుగానే అయితే క్రికెట్లో ఆ ఏజ్‌లో ఏదైనా జట్టుకు కోచ్‌గా ఉంటారు. లేకపోతే ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటారు. కానీ అతడు అలా ఖాళీగా కూర్చోలేదు. ఒక పెద్ద టోర్నీలో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాదు ఏకంగా టైటిల్‌ కూడా సాధించిపెట్టాడు. వయసు కేవలం ఒక నంబర్‌ అని రుజువు చేశాడు. అతడే దక్షిణాఫ్రికా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (Imran Tahir). తాజాగా కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (CPL)లో అమెజాన్‌ వారియర్స్‌ను తాహిర్‌ విజేతగా నిలిపాడు. కెప్టెన్‌గానే కాదు బౌలర్‌గానూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

కుర్రాళ్లతో పోటీపడుతూ..

మూడేళ్ల క్రితమే తాహిర్‌ జట్టుకు వీడ్కోలు పలికాడు. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (IPL)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) తరఫున ఆడినా ఆ తర్వాత కనబడలేదు. తాహిర్‌ కోచ్‌గానో లేదా మార్గదర్శకుడిగా అవతారం ఎత్తి ఉంటాడని అనుకున్నారు. కానీ నాలుగు పదుల వయసులోనూ తాహిర్‌ యాక్టివ్‌ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అదీ యువ ఆటగాళ్లు ఉండే టీ20 క్రికెట్లో! పొట్టి క్రికెట్‌ అంటే మైదానంలో చాలా ఫాస్ట్‌గా ఉండాలి. బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌లో అదరగొట్టాలి. కానీ ఈ వెటరన్‌ తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడమే కాక బౌలింగ్‌లో పదును తగ్గకుండా సాగుతున్నాడు. 

ధోని రికార్డు బద్దలు కొట్టి..

44 ఏళ్ల వయసులో క్రికెట్లో కొనసాగడమే ఎక్కువ అనుకుంటే రికార్డులు కూడా బద్దలుకొడుతున్నాడు తాహిర్‌. తాజాగా కరీబియన్‌ ప్రిమియర్‌ లీగే ఇందుకు నిదర్శనం. బౌలర్‌గా, కెప్టెన్‌గా అమెజాన్‌ వారియర్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఒక టీ20 లీగ్‌ను గెలిపించిన పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా నయా రికార్డును సృష్టించాడు. తాహిర్‌ సారథ్యంలో లీగ్‌ దశలో 10 మ్యాచ్‌ల్లో వారియర్స్‌ ఎనిమిదింట్లో విజయాలు అందుకుంది. 41 ఏళ్ల ధోని (MS Dhoni) ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నైను విజేతగా నిలబెట్టడం ప్రస్తుతం రికార్డుగా ఉంది. ఈ రికార్డును తాహిర్‌ నాలుగు నెలల్లోనే బద్దలు కొట్టాడు. 

బౌలర్‌గా అదరగొట్టి

కెప్టెన్‌గా సీపీఎల్‌లో జట్టును గొప్పగా నడిపించిన తాహిర్‌.. బౌలర్‌గానూ అదరగొట్టాడు. 13 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన ఈ లెగ్‌స్పిన్నర్‌ అత్యధిక వికెట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. పొదుపుగా బౌలింగ్‌ చేసిన ఈ వెటరన్‌ 6.22 ఎకానమీని నమోదు చేయడం విశేషం. ఫైనల్లో 4 ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చిన తాహిర్‌.. ఆండ్రూ రసెల్, డ్వేన్‌ బ్రావో వికెట్లు తీసి సత్తా చాటాడు. ఫైనల్లో అమెజాన్‌ వారియర్స్‌ కప్‌ గెలిచిన తర్వాత తాహిర్‌ ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన వయసు గురించి అందరూ మాట్లాడారని.. తనపై డబ్బులు పెట్టడం వృథా అన్నారని విమర్శించారని.. కానీ విమర్శలు తప్పని నిరూపించినట్లు తాహిర్‌ ఉద్వేగంగా చెప్పాడు. 

తాహిర్‌ ఉత్సాహమే వేరు

వికెట్‌ తీయగానే ఫుట్‌బాల్‌ ఆటగాడి మాదిరిగా చేతులు చాచి ఛాతిపై చరుచుకుంటూ మైదానంలో చాలా దూరం పరుగెత్తి తాహిర్‌ చేసుకునే సెలబ్రేషన్స్‌ భలే ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాక ఐపీఎల్‌లోనూ అతడు ఇలాగే సంబరాలు చేసుకునేవాడు. కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో తమ జట్టు టైటిల్‌ గెలిచిన తర్వాత కూడా తాహిర్‌ చిన్న పిల్లాడిలా మారి సంబరాలు చేసుకున్నాడు. అడ్డంకులు దాటుకుని.. విమర్శలను ఎదుర్కొని టైటిల్‌ను అందించి శభాష్‌ అనిపించాడు. కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ కప్‌ గెలిచిన ఉత్సాహంతో మరింత కాలం ఆడతానని అంటున్న తాహిర్‌ మున్ముందు ఎలా రాణిస్తాడో చూడాలి. 


            - ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు