IND vs ENG: ఇంగ్లాండ్‌కు బజ్‌బాల్‌ రుచి చూపించిన యశస్వి జైస్వాల్‌

బజ్‌బాల్‌ అంటూ దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన ఇంగ్లాండ్‌కు మన యువ బ్యాటర్ చుక్కలు చూపించాడు. ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో (IND vs ENG) అదరగొట్టాడు.

Updated : 25 Jan 2024 17:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌కు భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ‘బజ్‌బాల్‌’ ఆటేంటో చూపించాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న (IND vs ENG) తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్‌పై భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. పర్యాటక జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్‌ చేసిన టీమ్‌ఇండియా.. ఆట ముగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 23 ఓవర్లలో 119 పరుగులు చేసింది. క్రీజ్‌లో యశస్వి జైస్వాల్ (76 నాటౌట్: 70 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్ (14*) ఉన్నారు. ఓపెనర్‌, భారత కెప్టెన్ రోహిత్ శర్మ (24) ఫర్వాలేదనిపించాడు. తొలి బంతి నుంచే యశస్వి దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. అతడిని కట్టడి చేయడం ఇంగ్లాండ్‌ బౌలర్ల వల్ల కాలేదు. రోహిత్‌ను జాక్‌ లీచ్‌ ఔట్ చేశాడు. భారత్‌ ఇంకా 127 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌ మూడు డీఆర్‌ఎస్‌లను వినియోగించుకోవడం గమనార్హం. అవన్నీ వృథా కావడంతో ఆ జట్టు ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు.

టీ20లా ఆడేసిన యశస్వి

యువ బ్యాటర్.. ఆ పైన ఇంగ్లాండ్‌ వంటి కఠినమైన ప్రత్యర్థి. అయినా సరే తన టీ20 ఫార్ములాతో పర్యాటక జట్టు ‘బజ్‌బాల్’ క్రికెట్‌కు సవాల్‌ విసిరాడు. తొలి రెండు ఓవర్లలో ఒక్క బంతిని కూడా భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ ఎదుర్కోనీయకుండా.. యశస్వినే ఆడేశాడు. రెండో ఓవర్‌లోనే రెండు సిక్స్‌లు కొట్టి తన ఉద్దేశం ఏంటో చెప్పేశాడు. అదే దూకుడు ఆట ముగిసేసవరకూ కొనసాగింది. జట్టు స్కోరు 80కి చేరుకుంటే.. అందులో యశస్వివే 53 పరుగులు కావడం విశేషం. రోహిత్ ఔటైన తర్వాత కఠినమైన బంతులను వదిలేస్తూ.. అడపాదడపా బౌండరీలతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రెండో రోజు తొలి సెషన్‌లో కాసేపు క్రీజ్‌లో ఉంటే.. సెంచరీ కొట్టడం అతడికి పెద్ద కష్టమేం కాదు. 

స్పిన్నర్లే హీరోలు..

హైదరాబాద్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని పేరు. రెండో రోజు లేదా మూడో రోజు నుంచి స్పిన్‌కు అనుకూలంగా మారుతుందని అంతా భావించారు. కానీ, ఇవాళ తొలి సెషన్‌ నుంచే స్పిన్నర్ల ప్రభావం చూపించారు. అశ్విన్‌ (3/68), జడేజా (3/88), అక్షర్ పటేల్ (2/33) కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు డకెట్ (35), జాక్‌ క్రాలే (20) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. దీంతో రంగంలోకి స్పిన్నర్లను దించిన రోహిత్ అద్భుత ఫలితాన్ని సాధించాడు. అశ్విన్‌, జడేజా స్వల్ప వ్యవధుల్లో వికెట్లు తీసి భారత్‌కు బ్రేక్‌ అందించారు. బెయిర్‌స్టో (37), రూట్ (29) కుదురుకుని పరుగులు చేయడంతో ఒక దశలో ఇంగ్లాండ్‌ 120/3 స్కోరుతో ఉంది. మళ్లీ స్పిన్నర్లు విజృంభించి వికెట్లు పడగొట్టారు. ఒక పక్క క్రీజ్‌లో పాతుకు పోయిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (70) హాఫ్ సెంచరీ సాధించాడు. దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాడు. చివరికి బుమ్రా (2/28) అద్భుతమైన బంతితో స్టోక్స్‌ను బౌల్డ్‌ చేసి ఇన్నింగ్స్‌ను ముగించాడు. 

​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని