IND vs ENG: క్రాలే కోసం పక్కా స్కెచ్.. సర్ఫరాజ్‌కు రోహిత్ స్వీట్‌ వార్నింగ్‌.. వీడియోలు వైరల్‌

రాంచీ టెస్టులో భారత్‌ విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆటలో అద్భుత ఫీట్‌లు జరిగాయి. అందులో కొన్ని వీడియోల రూపంలో.. 

Updated : 25 Feb 2024 20:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - ఇంగ్లాండ్‌ (IND vs ENG) నాలుగో టెస్టు సందర్భంగా మ్యాచ్‌ వీడియోలు వైరల్‌గా మారాయి. పర్యటక జట్టును ఆలౌట్‌ చేయడంలో అశ్విన్‌ కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన క్యాచ్‌లు పట్టిన సర్ఫరాజ్‌ను కెప్టెన్ రోహిత్ ఓ విషయంలో వారించాడు. దూకుడుగా ఆడుతున్న ఇంగ్లిష్‌ బ్యాటర్ జాక్‌ క్రాలే వికెట్‌ కోసం పక్కా ప్లానింగ్‌.. ఇలాంటి వీడియోలను మీరూ చూసేయండి...

హీరో అవుదామనుకుంటున్నావా? 

కెప్టెన్ రోహిత్ శర్మ చూసేందుకు కఠినంగా ఉన్నట్లు అనిపించినా.. మైదానంలో తన సహచరులను జాగ్రత్తగా చూసుకోవడంలో ముందుంటాడు. తాజాగా సర్ఫరాజ్ ఖాన్‌ విషయంలోనే చూడండి. షార్ట్‌ ఫీల్డింగ్‌ పొజిషన్‌లో ఉండే సమయంలో సర్ఫరాజ్‌ హెల్మెట్‌ వద్దన్నాడు. దీంతో రోహిత్ స్పందిస్తూ.. ‘‘ఏం హీరో అవుదామని అనుకుంటున్నావా?’ అంటూ సుత్తిమెత్తగా వారించాడు. ఈ సిరీస్‌లోనే సర్ఫరాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. ఆ సమయంలో సర్ఫరాజ్‌ తండ్రి నౌషద్ ఖాన్.. రోహిత్‌తో మాట్లాడుతూ.. తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు నాలుగో టెస్టులో సర్ఫరాజ్‌ కుర్రతనంతో హెల్మెట్‌ లేకుండా ఉండటాన్ని గమనించిన రోహిత్ పైవిధంగా స్పందించాడు. బ్యాటర్‌కు దగ్గరగా ఫీల్డింగ్‌ చేయడం చాలా ప్రమాదకరం. అందుకే, రోహిత్ ఇలా స్పందించాడని అభిమానులు ప్రశంసలు కురిపించారు. 


సర్ఫరాజ్‌ డైవింగ్‌ క్యాచ్‌

కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో హార్ట్‌లీ భారీ షాట్‌కు యత్నించాడు. లాంగాఫ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ ఖాన్ బంతికి అద్భుతంగా ఒడిసిపట్టాడు. దాదాపు నాలుగు ఓవర్లపాటు సంయమనంతో ఆడిన హార్ట్‌లీ భారీ షాట్‌కు యత్నించగా, సర్ఫరాజ్‌ డైవింగ్‌ చేస్తూ ఆ క్యాచ్‌ పట్టాడు. ఆ తర్వాత అభిమానులకు ఫ్లెయింగ్‌ కిస్‌ ఇచ్చాడు. 


ఇది పక్కా ప్లానింగ్‌

అప్పటికే జాక్‌ క్రాలే దూకుడుగా ఆడుతున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం హాఫ్‌ సెంచరీ సాధించాడు. దీంతో అతడిని ఔట్‌ చేయడం ఎలా అనే భారత శిబిరంలో డిస్కషన్ జరిగింది. అదేంటనేది కామెంట్రీ బాక్స్‌లోని దినేశ్‌ కార్తిక్‌ వెల్లడించాడు. ‘‘ఆఫ్‌సైడ్ ఫీల్డర్‌ పెడదామని రోహిత్ భావించాడు. ఇదే విషయాన్ని కుల్‌దీప్‌ యాదవ్‌కు చెప్పాడు. కుల్‌దీప్‌ మాత్రం ఆఫ్‌సైడ్‌ వద్దని.. మిడాఫ్‌లోని ఫీల్డర్‌ను కాస్త వెనక్కి పంపించాలని సూచించాడు. దీంతో అలానే ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడు. క్రాలే మాత్రం ఆఫ్‌సైడ్‌ ఖాళీ కనిపించడంతో అటువైపు ఆడేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా టర్నింగ్‌ బంతితో క్రాలేను కుల్‌దీప్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు’’ అని డీకే తెలిపాడు. క్రాలేను ఔట్‌ చేసిన వీడియోను చూసేయండి..


ధ్రువ్‌ జురెల్‌ తొలి ఫీఫ్టీ

జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు చేసే ప్రతి పరుగూ విలువైంది. అలా హాఫ్‌ సెంచరీ సాధిస్తే అద్భుతమే కదా. యువ వికెట్‌ కీపర్ ధ్రువ్‌ జురెల్ కూడా ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతడి అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో మొదటి హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో ధ్రువ్‌ 90 పరుగులు చేశాడు. 


అశ్విన్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

ఇంగ్లాండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలడానికి ప్రధాన కారణం రవిచంద్రన్ అశ్విన్‌.. ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మరీ ముఖ్యంగా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి పర్యటక జట్టును దెబ్బకొట్టాడు. ఓపెనర్‌ డకెట్‌ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్‌ పొజిషన్‌లో ఉన్న సర్ఫరాజ్‌ ఒడిసిపట్టాడు. ఆ తర్వాత బంతికే ఈ మంచి ఫామ్‌లో ఉన్న ఓలీ పోప్ (0)ను అశ్విన్ ఎల్బీ చేశాడు. డకౌట్‌గా పోప్‌ పెవిలియన్‌కు చేరాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని